దొంగతనానికి వచ్చాడు.. మరణించాడు

Person Came To Robbery And Died By Fall From Apartment In Banjarahills  - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌ : ఫిలింనగర్‌లో సోమవారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా మృతి చెందిన వేముల ప్రేమ్‌సాగర్‌(20) మిస్టరీ వీడింది. తన స్నేహితుడు సత్యానంద్‌తో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లోకి దొంగతనానికి వెళుతూ ప్రమాదవశాత్తు కింద పడటంతో తీవ్రంగా గాయాలై మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్‌లోని దుర్గాభవానీనగర్‌కు చెందిన ప్రేమ్‌సాగర్‌ గత ఏడాది జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సెల్‌ఫోన్‌ చోరీ కేసులో అరెస్టై రిమాండ్‌కు వెళ్లాడు.

అంతకుముందే అతడిపై మాదాపూర్‌ పీఎస్‌లోలోనూ సెల్‌ఫోన్‌ చోరీ కేసులు ఉన్నాయి. దీన్‌దయాల్‌నగర్‌ బస్తీకి చెందిన సత్యానంద్‌ బైక్‌ చోరీ కేసులో అరెస్టై జువైనల్‌ హోమ్‌కు వెళ్లి వచ్చాడు. వీరిద్దరికీ ఓ దొంగతనం కేసులోనే పరిచయం ఏర్పడి స్నేహితులయ్యారు. ఆదివారం రాత్రి ప్రేమ్‌సాగర్‌ తన స్నేహితుడు సత్తిని సికింద్రాబాద్‌లో రైలెక్కించి వస్తానని తల్లికి చెప్పి స్కూటీ తీసుకొని బయటికి వచ్చాడు.

అపోలో చౌరస్తాలో మరో ఇద్దరు స్నేహితులు గణేష్, నాగరాజులతో కలిసి మద్యం తాగారు. అనంతరం హైటెక్‌ సిటీ వైపు వెళ్లారు. అక్కడ  ప్రేమ్‌సాగర్, సత్యానంద్‌ నిద్రమాత్రలు వేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ నలుగురు కలిసి మద్యం తాగడమేగాక గంజాయి తీసుకున్నారు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో అంతా కలిసి ఫిలింనగర్‌కు రాగా గణేష్, నాగరాజు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రేమ్‌సాగర్, సత్యానంద్‌ స్కూటీని అపోలో ముందు  పార్క్‌ చేసి నడుచుకుంటూ అపోలో ఆస్పత్రి మెడికల్‌ కాలేజీ వెనుక గేటు నుంచి ఓ అపార్ట్‌మెంట్‌ వైపు వెళ్లారు. అపార్ట్‌మెంట్‌ ప్రహరీ ఎక్కిన వీరు మద్యం మత్తులో చూసుకోకుండా కిందకు దూకడంతో  సెల్లార్‌లో పడ్డారు.

ముందు ప్రేమ్‌సాగర్‌ పడగా అతడి ముక్కు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. సత్యానంద్‌ నేరుగా అతడిపై పడటంతో గాయాలు కాలేదు. తెల్లవారుజామున వారిని గుర్తించిన అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ ఓ ప్లాటు యజమానితో కలిసి వారిద్దరినీ రోడ్డుపైకి తీసుకొచ్చారు. వారి సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్‌ సిబ్బంది అప్పటికే ప్రేమ్‌సాగర్‌ మృతి చెందినట్లు నిర్దారించారు.

అపార్ట్‌మెంట్‌లో చోరీ యత్నం జరిగినట్లు తెలిస్తే తన ఉద్యోగం పోతుందన్న భయంతోనే వారిని రోడ్డుపైకి తీసుకొచ్చినట్లు వాచ్‌మెన్‌ మధు తెలిపాడు. మూడు రోజుల క్రితం అదే అపార్ట్‌మెంట్‌లో చోరీకి యత్నించిన వీరు ఓ ప్లాటు ముందు ఉన్న ఖరీదైన షూస్‌ ఎత్తుకెళ్లినట్లు సత్యానంద్‌ అంగీకరించాడు. ఇదిలా ఉండగా రెండు రోజులైనా సత్యానంద్‌ మద్యం మత్తు  దిగకపోవడంతో కేసు విచారణలో జాప్యం జరుగుతోంది. సీసీ ఫుటేజీలే ఈ ఘటనను వెలుగులోకి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top