ఇంటి పట్టున ఉండలేక..

People Trying to End lives in Lockdown Affects Tamil nadu - Sakshi

సేలం జిల్లాలో ఆత్మహత్యాయత్నాలు

ఐదుగురు మహిళలు సహా

ఏడుగురు ఆస్పత్రిపాలు లాక్‌డౌన్‌తో సామాన్యులు విలవిల

సాక్షి ప్రతినిధి, చెన్నై: దైనందిన జీవితంలో ఇంటిపనులతోపాటు బాహ్య ప్రపంచంలోని పనులను సైతం చక్కబెట్టుకోవడం దాదాపుగా అందరికీ నిత్యకృత్యం. ఉబుసుపోక ఊరకనే ఊరిలో తిరిగేవారు, షాపింగ్‌ పేరుతో చక్కర్లు కొట్టేవారు, స్నేహితులతో షికార్లు కొట్టేవారు కూడా కొందరుంటారు. అయితే ఇలాంటి వారందరికీ అకస్మాత్తుగా అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌ ఒక శాపంగా మారింది. ఇంటిపట్టున కదలకుండా ఉండలేక ఉక్కిరిబిక్కిరవుతూ ఏకంగా ఊపిరితీసుకునే పరిస్థితికి చేరుకున్నారు. ఒక్క సేలం జిల్లాలోనే ఏడుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం వారిలో ఐదుగురు మహిళలు ఉండడం ఆందోళనకర పరిణామం.

వివరాల్లోకి వెళితే..
కరోనా వైరస్‌ ప్రబలకుండా లాక్‌డౌన్‌ ఉత్తర్వులు అమల్లో ఉన్నందున ప్రజలు ఇళ్లను వదిలిబయటకు రాకుండా తమిళనాడు ప్రభుత్వం కట్టుదిట్టమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అకారణంగా రోడ్లపైకి వస్తే అరెస్ట్‌లు చేయడం, కే సులు పెట్టడం, వాహనాలను సీజ్‌ చేయడం వంటి కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉండగా, సేలం జిల్లా ఆత్తూరు సమీపం కాట్టుకోటై్ట ప్రాంతానికి చెందిన అయ్యనార్‌మలై (50) అనే వ్యక్తి విషపుమొక్కను పొడిచేసి నీళ్లలో కలుపుకుని సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇరుగూపొరుగూ వారు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా తీవ్రచికిత్స అందిస్తున్నారు. ఆత్తూరు సమీపం పెత్తనాయకన్‌పాళయంకు చెందిన మణికంఠన్‌ (24) అనే యువకుడు విషద్రావకం సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్తూరు సమీపం నరసింగపురానికి చెందిన గుణశేఖరన్‌ భార్య సుధ (32) ఎలుకల మందు సేవించి ప్రాణాలుతీసుకునే ప్రయత్నం చేయగా వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.

తలైవాసల్‌ పట్టుదురై గ్రామానికి చెందిన ఆనంద్‌ అనే వ్యక్తి భార్య ప్రియాంక (28) గన్నేరుపప్పు మింగి ఆత్యహత్యాయత్నం చేసింది.  తలైవా ప్రాంతానికి చెందిన శివశంకరన్‌ భార్య తేన్‌మొళి (32) పురుగుల మందు తాగింది. ప్రాణాపాయ స్థితిలో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.  ఆత్తూరు సమీపం చతురంగపట్టికి చెందిన అర్ముగం కుమార్తె సుహాసిని (18) పొటాషియం సల్ఫేటు మిశ్రమాన్ని సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆత్తూరు నర్సింగ్‌పురం కలైంజ్ఞర్‌ కాలనీకి చెందిన దేశింగురాజా భార్య రాజేశ్వరి (35) విషద్రావకం సేవించి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేయగా ఆసుపత్రిలో చేర్పించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారంతా లాక్‌డౌన్‌ మూలంగా ఇంటికే పరిమితమైనవారేగానీ కరోనా వైరస్‌ మూలంగా గృహనిర్బంధానికి గురికాలేదు. అయినా ఇంకా ఎన్నాళ్లు ఈ ఇంటి జైలు అనే బాధతో ప్రాణాలు తీసుకునేందుకు సిద్దపడినట్లు భావిస్తూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top