నిందితుడు... బాధితుడు!

OLX Cheating Case Filed Hyderabad - Sakshi

బెంగళూరు, ఆగ్రాల్లోని నేరాలతో సిటిజన్ల లింకులు

వ్యాపార సంస్థను మోసం చేసిన హైదరాబాదీ వ్యాపారి

ఓఎల్‌ఎక్స్‌ పేరుతో ఎర వేసి మరో నగరవాసి దోపిడీ

ఆరా తీస్తున్న పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: ఇద్దరు నగరవాసులు... ఒకరు బెంగళూరులో నమోదైన కేసులో నిందితుడిగా, మరొకరు ఆగ్రాలో జరిగిన నేరంలో బాధితుడిగా మారారు... మొదటి కేసులో ఓ వ్యాపారి యానిమేషన్‌ కంపెనీని మోసం చేశారన్నది ఆరోపణ... రెండో దాని విషయానికి వస్తే ఓఎల్‌ఎక్స్‌లో చూసి కారు ఖరీదు చేయడానికి వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. గత వారం చోటు చేసుకున్న ఈ రెండు ఉదంతాలకు సంబంధించి ప్రాథమిక సమాచారం అందడంతో సిటీ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. సిటీలో ఏమైనా నేరాలతో సంబంధం ఉందా? అనే కోణంలో కూపీ లాగుతున్నారు. 

విదేశీ ఆర్డర్ల పేరుతో టోకరా...
బెంళగూరుకు చెందిన ఆర్‌.రంజిత్‌ వార్థూర్‌ ప్రాంతంలో సాట్చా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థను నిర్వహిస్తున్నారు. ఇది ఆర్డర్‌పై దేశవిదేశాల్లోని కంపెనీలకు వివిధ రకాలైన యానిమేషన్‌ వర్క్‌ చేసి అందిస్తుంటుంది. రంజిత్‌కు గతేడాది నగరానికి చెందిన వ్యాపారి అనురాగ్‌తో పరిచయమైంది. హైదరాబాద్‌లో కంపెనీ నిర్వహించే తనకు నెదర్లాండ్స్‌లోని వివిధ కంపెనీలతో సంబంధాలున్నాయంటూ ప్రచారం చేసుకున్నాడు. కొన్ని రోజులకు ఓ కంపెనీ నుంచి రూ.2 కోట్ల యానిమేషన్‌ వర్క్‌ ఆర్డర్‌ ఉందని చెప్పిన అతను ఈ ఆర్డర్‌ చేయడానికి తాను నెదర్లాండ్స్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు ఎర వేశాడు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని, వచ్చే లాభంలో చెరి సగం తీసుకుందామని చెప్పాడు. ఇందుకు రంజిత్‌ అంగీకరించడంతో గతేడాది ఆగస్టు 30న ఇరువురూ ఒప్పందపత్రాలు రాసుకున్నారు. అనురాగ్‌ రంజిత్‌ నుంచి అడ్వాన్స్‌గా రూ.20 లక్షలు తీసుకుని ప్రాజెక్టు అప్పగించాడు. ఈ వర్క్‌ పది శాతం వరకు పూర్తి చేసిన తర్వాత రంజిత్‌కు అనుమానం రావడంతో నేరుగా నెదర్లాండ్స్‌ కంపెనీని సంప్రదించగా తాము అనురాగ్‌కు చెందిన కంపెనీకి ఎలాంటి ఆర్డర్స్‌ ఇవ్వలేదని తెలిపారు. లోతుగా ఆరా తీయగా బోగస్‌ ప్రాజెక్ట్‌ వర్క్‌ అప్పగించి తమను అనురాగ్‌ మోసం చేసినట్లు గుర్తించిన అతను వార్థుర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అనురాగ్‌పై కేసు నమోదైంది. విచారణ నిమిత్తం అనురాగ్‌కు నోటీసులు జారీ చేయడానికి అక్కడి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

కారంటూ ఆగ్రాకు రప్పించి దోపిడీ...
నగరానికి చెందిన ప్రదీప్‌కుమార్‌ అనే యువకుడు ఆగ్రాకు చెందిన ముఠా చేతిలో దారుణంగా మోసపోయాడు. ఎస్‌యూవీ కారును తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇచ్చిన ముఠా బాధితుడిని అక్కడకు రప్పించుకుని అతడి వద్ద ఉన్న రూ.3.2 లక్షలతో పాటు ఐఫోన్‌ దోచుకుంది.

దీనిపై కేసు నమోదు చేసుకున్న వరిందవాన్‌ పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. ఓఎల్‌ఎక్స్‌లోని ప్రకటనలు చూస్తున్న ప్రదీప్‌ను ఎస్‌యూవీకి సంబంధించిన యాడ్‌ ఆకట్టుకుంది. ఆ వాహనాన్ని కేవలం రూ.3.7 లక్షలకే అమ్ముతామంటూ వరిందవాన్‌కు చెందిన షమ్మీ ఎర వేశాడు. ఇది హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.4.8 లక్షలు పలుకుతుండటంతో ఆకర్శితుడైన ప్రదీప్‌ షమ్మీని సంప్రదించాడు.

కారు విక్రయించడానికి అంగీకరించిన షమ్మీ ఆగ్రా రావాలంటూ సూచించాడు.వస్తూ తన కోసం ఓ ఐఫోన్‌ తీసుకురావాలని, దాని విలువ మినహాయించుకుని మిగతా మొత్తం చెల్లించి ఎస్‌యూవీ తీసుకువెళ్లమని చెప్పాడు. దీంతో రూ.50 వేల ఐఫోన్, రూ.3.2 లక్షల నగదుతో ప్రదీప్‌ అక్కడకు చేరుకున్నాడు. ఢిల్లీ విమానాశ్రయంలో ఇతడిని రిసీవ్‌ చేసుకున్న ముగ్గురు వ్యక్తులు ఆగ్రా తీసుకువెళ్లారు. వాహనాన్ని చూపించడంతో పాటు సైట్‌ సీయింగ్‌ పేరు చెప్పి అక్కడి వరిందవాన్‌లో ఉన్న చిన్న అడవిలోకి తీసుకువెళ్లారు. ప్రదీప్‌ వద్ద ఉన్న ఐఫోన్‌తో పాటు రూ.3.2 లక్షలు దోచుకుని, తుపాకీతో బెదిరించి తరిమేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వరిందర్‌వాన్‌ పోలీసులు గత వారం ముఠా సభ్యుడైన ముకీమ్‌ను పట్టుకున్నారు. అతడి నుంచి ఎస్‌యూవీ వాహనం,తుపాకీతో పాటు రూ.20 వేల నగదు స్వాధీనంచేసుకున్నారు. పరారీలో ఉన్న షమ్మీసహా మరో ముఠా సభ్యుడి కోసం గాలిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top