మలుపు తిరుగుతున్న నవ వరుడు హత్యకేసు | Sakshi
Sakshi News home page

మలుపు తిరుగుతున్న నవ వరుడు హత్యకేసు

Published Fri, May 18 2018 11:19 AM

New twist in murder case - Sakshi

పార్వతీపురం : గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్‌ వద్ద ఐటీడీఏ పార్క్‌ సమీపంలో ఇటీవల జరిగిన నవ వరుడు హత్యకేసు ఉదంతం మలుపు తిరుగుతోంది. కట్టుకున్న భార్యే... భర్తను హతమార్చడానికి పన్నిన పన్నాగాన్ని పోలీసులు చేధించారు. అయితే నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇంతవరకు మృతుడి భార్య సరస్వతి, ప్రియుడు శివకుమార్‌ కలిసి విశాఖకు చెందిన గుండాలతో హత్య చేయించినట్లు తెలిసింది.

తాజాగా మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. మృతుడు గౌరీశంకర్‌ భార్య సరస్వతికి బెంగళూరులో ఒక స్నేహితురాలు ఉంది. సరస్వతి భర్త గౌరీశంకరరావు కూడా బెంగళూరులోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే సరస్వతి తన స్నేహితురాలితో కలసి బెంగళూరులోనే తన భర్త గౌరీశంకర్‌ను హతమార్చేందుకు వివాహానికి ముందే పథకం రచించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం.దీంతో పార్వతీపురం ఏఎస్పీ ఆదేశాల మేరకు బెంగళూరులో ఉన్న సరస్వతి స్నేహితురాలిని కూడా విచారించడానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే బెంగళూరులో హత్య చేయడం కుదరకపోవడంతో విశాఖకు చెందిన రౌడీలతో జిల్లాలో హత్య చేయించారు.  

వివరాల్లోకి వెళితే...శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెళ్ల గ్రామానికి చెందిన సరస్వతికి అదే మండలం చిట్టిపుడివలస గ్రామానికి చెందిన యామక గౌరీ శంకరావుతో గత నెల 28న వివాహం జరిగింది.  ద్విచక్ర వాహనాన్ని సర్వీసింగ్‌కు ఇచ్చేందుకు ఇరువురూ పార్వతీపురం వచ్చారు. కొద్దిగా చీకటిపడుతున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో శంకర్‌రావు తలపై మోదారు. దీంతో తీవ్ర రక్తస్రావమై శంకర్‌రావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అతని భార్య సరస్వతే దుండగులకు సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించిందని పోలీసులు వివరించారు.

ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు జాగ్రత్తపడ్డ నిందితురాలు దుండగులు దారికాచి తన భర్తను చంపేశారని, మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లారంటూ పోలీసుల వద్ద మొసలికన్నీరు కార్చింది. హత్య జరిగిన స్థలాన్ని, సరస్వతిని కలిసి విచారించిన ఎస్పీకి ఎక్కడో అనుమానం వచ్చింది. పార్వతీపురం నుంచి జిల్లా కేంద్రానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అనుమానితుల్ని విచారించారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఎస్పీ అనుమానం మరింత బలపడింది.

గణపతినగరం స్టేషన్‌కు తరలించి కూపీ లాగగా వారు అసలు విషయాన్ని వెల్లడించారు. ఇష్టంలేని పెళ్లి వల్లే భర్త శంకర్‌రావును భార్య హత్య చేయించిందని తెలిసి ఎస్సీ షాక్‌ అయ్యారు. స్నేహితుడు శివ సలహా తీసుకున్న సరస్వతి... భర్తను చంపేందుకు వైజాగ్‌కు చెందిన రౌడీషీటర్‌ గోపీకి సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేలింది. పార్వతీపురం ఐటీడీఏ పార్క్‌ వద్ద శంకర్రావును హత్యచేసింది తామేనని ఆ ముగ్గురూ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో కోలుకున్న సరస్వతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement