ఉగ్రవాదం వైపు కశ్మీర్‌ యువత అడుగులు

Nearly 131 Youths Joined Militancy In Kashmir - Sakshi

శ్రీనగర్‌: ఉగ్రవాదం వైపు అడుగులేస్తున్న కశ్మీర్‌ యువత సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గతేడాది 126 మంది వివిధ ఉగ్రవాద సంస్థల్లో చేరగా.. ఈ ఏడాది జూలై నాటికే 131 మంది అటు వైపు ఆకర్షితులైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. జూలై 31 వరకు సేకరించిన సమాచారం ప్రకారం 131 మంది ఉగ్రవాద సంస్థల్లో చేరగా.. వీరిలో సోఫియా జిల్లా నుంచే 35 మంది చేరినట్లు కశ్మీర్‌ అధికారులు వెల్లడించారు. సోఫియా, పుల్వామా, అనంత్‌నాగ్, కుల్గామ్, అవంతిపురా జిల్లాల యువత ఎక్కువగా ఉగ్ర భూతం వైపు మళ్లుతున్నారని.. ఇప్పటివరకు చేరిన 131 మందిలో ఈ 5 జిల్లాల నుంచే 100 మంది ఉన్నారని తెలిపారు. అల్‌ కాయిదాకు మద్దతు సంస్థగా చెబుతున్న అన్సార్‌ ఘజ్వాత్‌ ఉల్‌ హింద్‌ వైపు యువకులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని.. దీనికి పుల్వామా జిల్లాకు చెందిన రషీద్‌ భట్‌ అలియాస్‌ జకీర్‌ ముసా నాయకత్వం వహిస్తున్నాడని చెప్పారు.

పాకిస్తాన్‌ అనుకూల నినాదాలను పక్కనబెడుతూ ముసా ఇచ్చిన సరికొత్త ‘షరియత్‌ యా షహదత్‌ (ఇస్లాం చట్టాలను అమలు చేద్దాం లేదా మరణిద్దాం)’ నినాదం వైపు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నాని అధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్‌ మధ్యలోనే వదిలేసిన ముసా.. హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన బుర్హన్‌ వనీ 2016లో హతమైన తర్వాత అక్కడి యువతను ఆకర్షించడంలో సఫలీకృతుడవుతున్నాడని అంటున్నారు. ముసా చదువులో, ఆటల్లో ముందుండేవాడని.. అంతరాష్ట్ర క్యారమ్‌ పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడాడని చెప్పారు. అన్సార్‌ ఘజ్వాత్‌ ఉల్‌ హింద్‌ సంస్థ ఇంకా మొదలవలేదని పోలీసులు చెబుతున్నా.. ఆ సంస్థకు అక్కడి యువతలో ఆదరణ మాత్రం పెరుగుతున్నట్లు అనుమానం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top