నారాయణ విద్యార్థి ఆత్మహత్య

Narayana student commited to suicide in guduru - Sakshi

యాజమాన్యం ఒత్తిడే కారణమంటున్న విద్యార్థి సంఘాలు

గూడూరు: నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో మంగళవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. రాపూరు మండలం గుండవోలు గ్రామానికి చెందిన మాచిరాజు విజయభాస్కర్‌రాజు, సునీత దంపతుల ఒక్కగానొక్క కుమారుడు లక్ష్మీసాయి (20) గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఏం జరిగిందో.. ఏమో ఆ విద్యార్థి ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందడం ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. లక్ష్మీసాయి గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాల హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నాడు. గత శుక్రవారం (ఈ నెల 15న) గూడూరులోని అశోక్‌నగర్‌ ప్రాంతంలో రూమ్‌ అద్దెకు తీసుకుని ఉంటున్న తన స్నేహితుడు ఎ.మనోజ్‌ వద్దకు వెళ్లాడు.

తనను కళాశాల హాస్టల్‌ నుంచి పింపించివేశారని 2 రోజులు రూమ్‌లో ఉంటానని చెప్పడంతో మనోజ్‌ సరేనన్నాడు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో లక్ష్మీసాయిని రూమ్‌లోనే ఉంచి మనోజ్‌ ఊరికి వెళ్లి, మంగళవారం తన రూమ్‌కు చేరుకున్నాడు. తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీని తొలగించి చూడగా.. లక్ష్మీసాయి మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. మృతదేహం  దుర్వాసన వెదజల్లుతుండటంతో ఆదివారం రాత్రే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఇదిలావుండగా.. లక్ష్మీసాయి ఫీజు చెల్లించాల్సి ఉండటంతో యాజమాన్యం అతడిపై విపరీతమైన ఒత్తిడి తెచ్చిందని.. సకాలంలో చెల్లించకపోవడంతో హాస్టల్‌ నుంచి పంపించివేసిందని విద్యార్థి సంఘ నాయకులు చెబుతున్నారు. కళాశాల యాజమాన్యం ఒత్తిడి కారణంగానే లక్ష్మీసాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top