విద్యార్థిపై ‘నారాయణ’ ప్రిన్సిపాల్‌ దాష్టీకం

Narayana college Principal attacked on student - Sakshi

అల్లరి చేశాడని విద్యార్థి మొహంపై కర్రతో మోదిన వైనం

2 పళ్లు విరిగి విద్యార్థికి తీవ్రగాయాలు

మీడియాకు చెప్పొద్దని బెదిరింపులు  

సాక్షి, అమరావతిబ్యూరో : నారాయణ విద్యా సంస్థలకు చెందిన ఓ ప్రిన్సిపాల్‌ దాష్టీకానికి విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు. అల్లరి చేస్తున్నాడంటూ ప్రిన్సిపాల్‌ కర్రతో ముఖంపై మోదడంతో విద్యార్థి కింద పడి రెండు పళ్లు విరిగిపోయి తీవ్ర రక్తస్రా వమైంది. ఓ వైపు విద్యార్థి తీవ్ర గాయాలపాలయినా  ఆ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంచారు. ఈ ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ స్కూల్‌ రాష్ట్ర మంత్రి నారాయణకు సంబంధించిన విద్యా సంస్థ కావడంతో వెంటనే రంగంలోకి దిగిన యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులను బెదిరించి మీడియా దృష్టికి రాకుండా తీవ్ర ఒత్తిడి పెంచారు. ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెంలోని ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న రమేష్‌ బాబు కుమారుడు రోహిత్‌సాయి నూజివీడు నారాయణ ఈ టెక్నో బ్రాంచ్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు.

శుక్రవారం మధ్యాహ్నం క్లాస్‌ రూంలో విద్యార్థులు అల్లరి చేస్తున్నారని టీచర్‌ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదుచేశాడు. ఆగ్రహించిన ప్రిన్సిపల్‌ క్లాస్‌రూంలోకి వెళ్లి కర్రతో రోహిత్‌ మొహంపై బలంగా మోదడంతో విద్యార్థి కిందపడ్డాడు. ఈఘటనలో విద్యార్థి రోహిత్‌కు రెండు పళ్లు విరిగి రక్రస్రావం అయింది. విద్యార్థికి  వైద్యచికిత్స చేయించకపోగా సాయంత్రం వరకు స్కూల్‌లోనే ఉంచారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన విద్యార్థి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు వెంటనే వైద్య చికిత్స కోసం నూజివీడుకు తరలించారు. తమ బిడ్డపై దాడి చేసిన ప్రిన్సిపాల్‌ను తండ్రి నిలదీయడంతో స్కూల్‌ యాజమాన్యం రంగంలోకి దిగి ఈ విషయాన్ని మీడియాకు చెప్పవద్దంటూ వారిపై బెదిరింపులకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సృందన ఉండదని బెదిరింపులకు దిగడంతో ఒత్తిళ్లకు తలొగ్గిన తల్లిదండ్రులు మౌనం దాల్చారు.

చిన్న దెబ్బే తిగిలింది
విద్యార్థికి చిన్న దెబ్బే తగిలింది. ఎలాంటి ప్రమాదం లేదు. విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడాం. ఏ సమస్యా లేదు.
    – మహేష్, నారాయణ స్కూల్‌ ప్రిన్సిపల్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top