భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు

Nampally Court Verdict, Life Imprisonment For Woman In Husband Murder Case - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను ఓ భార్య కిరాతకంగా హత్య చేసిన ఘటనలో నిందితురాలికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి తీర్పునిచ్చారు. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2013 మార్చి 29వ తేదీ తెల్లవారుజామున జరిగిన హత్య కేసులో భర్త బండారి వెంకటేష్‌(56)ను రోకలిబండతో మోది, ఆ తర్వాత పెట్రోల్‌పోసి దహనం చేసిన బండారి లక్ష్మి అలియాస్‌ ఇందిర(46)పై అప్పుడు పోలీసులు ఐపీసీ 302, 201, 120–బి, రెడ్‌విత్‌ 34, 385 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పక్కా ఆధారాలు సమర్పించారు. ఈ ఘటనలో లక్ష్మికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించారు. ఈ ఘటనలో ఏ–2 వై.ఆదిలక్ష్మి, ఏ–3 డి.రమ, ఏ–4 ప్రదీప్‌కుమార్‌లను నిర్ధోషులుగా ప్రకటించింది.  

ఈ ఘటన వివరాలు ఇలా...   
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామానికి చెందిన బండారి వెంకటేష్‌(56), లక్ష్మి(46) దంపతులు బంజారాహిల్స్‌ రోడ్డు నెం.10లోని గౌరీశంకర్‌నగర్‌లో నివాసముండేవారు. వీరికి మనోహర్‌(28), మహేష్‌(26), మదన్‌(24) ముగ్గురు కొడుకులు. రెండవ కొడుకు మహేష్‌ అమెరికాలో, చిన్న కొడుకు మదన్‌ కెనడాలో నివసించేవారు. సివిల్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న వెంకటేష్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నెం.10లోని ఇబ్రహీంనగర్‌లో నివసించే నాగమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు.

ఈ విషయంలోనే భార్యాభర్తల మధ్య తీవ్ర విభేదాలు రావడంతో ఇబ్రహీంనగర్‌లో నివసించే లక్ష్మి మేనల్లుడు కొప్పరి ప్రదీప్‌కుమార్‌ అలియాస్‌ వేణు సహాయంతో భర్తను కడతేర్చాలని ఆమె పథకం వేసింది. ఇందుకోసం వేణును కిరాయి హంతకుడిగా వినియోగించుకొని భర్తను హత్య చేయడానికి రూ.16 లక్షలు ఇచ్చింది. అయితే వేణు బాధ్యతను నెరవేర్చకపోగా లక్ష్మిని బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. భర్తను చంపేందుకు డబ్బులు ఇచ్చిన విషయాన్ని కొడుకులు, భర్తకు చెబుతానంటూ బెదిరించసాగాడు.

ఈ విషయం చెప్పకుండా ఉండాలంటే రూ.30 లక్షలు ఇవ్వాలంటూ బేరం పెట్టాడు. అంత డబ్బు లక్ష్మి వద్ద లేకపోవడం, ఈ విషయం ఎప్పటికైనా భర్తకు తెలుస్తుందేమోననే భయంతో భర్తను కడతేర్చాలని పథకం వేసింది. ఎప్పటిలాగే పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన భర్తకు కాఫీలో నిద్రమాత్రలు వేసి ఇచ్చింది. దీంతో అతడు నిద్రమత్తులోకి జారిపోయాడు. రాత్రి పది గంటల ప్రాంతంలో సుత్తితో భర్త తలపై పదిసార్లు బాదడంతో రక్తపుమడుగులో కొట్టుమిట్టాడాడు. ప్రాణాలతో ఉన్నాడని భావించిన లక్ష్మి వంటింట్లో ఉన్న కిరోసిన్‌ను పోసి నిప్పంటించింది.

మరుసటి రోజు తెల్లవారుజామున ఇంట్లోని కిరాయిదారులను లేపి భర్తను హత్య చేసినట్లు చెప్పి కిరాయిదారుడితో బైక్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. రంగంలోకి దిగిన బంజారాహిల్స్‌ అప్పటి ఇన్‌స్పెక్టర్‌ పీ.మురళీకృష్ణ, ఎస్సై హరిభూషణ్‌రావు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. హత్యకు ఉపయోగించిన సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు లక్ష్మిని ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న మేనల్లుడు వేణు అలియాస్‌ ప్రదీప్‌ను అరెస్ట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top