నిందితుడిని పట్టించిన సెల్‌ఫోన్‌ | Murder Case Solved in lakkavarapu kota | Sakshi
Sakshi News home page

నిందితుడిని పట్టించిన సెల్‌ఫోన్‌

May 28 2018 10:55 AM | Updated on Jul 30 2018 8:51 PM

Murder Case Solved in lakkavarapu kota - Sakshi

నిందితుడు అప్పారావుతో పోలీసులు

లక్కవరపుకోట : పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మహిళ హత్యకేసులో నిందితుడిని పట్టుకున్నారు. ఎట్టకేలకు నిందితుడు గనివాడ అప్పారావు ఉరఫ్‌ గ్యాస్‌ అప్పారావును పోలీస్‌లు అరెస్టు చేసి ఆదివారం ఎస్‌.కోట కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుకు సంబంధించి ఎస్‌.కోట సీఐ వై.రవి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.

 ఈ నెల 23న కొత్తవలస మండలం సంతపాలెం గ్రామానికి చెందిన పల్లా లక్ష్మి ఉరఫ్‌ బంగారమ్మ(40) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఎస్‌.కోటకు చెందిన గనివాడ అప్పారావు ఎస్‌.కోట భారత్‌ గ్యాస్‌ ఏజన్సీలో దినసరి వేతనదారుడుగా పనిచేసేవాడు. ఈక్రమంలో మృతురాలు లక్ష్మితో మూడు సంవత్సరాల కిందట పరిచమైంది. ఆ పరిచయం క్రమంగా అక్రమ సంబంధానికి దారితీసింది.

ఈ విషయం నిందితుడు భార్య అచ్చియ్యమ్మకు తెలియడంతో ఇద్దరిని నిలదీసింది. దీంతో లక్ష్మిని విశాఖపట్నం తీసుకువచ్చి అప్పారావు వేరేగా కాపురం పెట్టారు. ఈ సమయంలో అప్పారావుకు అనారోగ్యం సోకడంతో లక్ష్మి పట్టించుకోలేదు. దీంతో అప్పారావు ఎస్‌.కోటలో ఉంటున్న భార్య అచ్చియమ్మ వద్దకు వచ్చేశాడు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత శ్రీరాంపురం గ్రామ సమీపంలో గల స్టీల్‌ఎక్సే్చంజ్‌ కర్మాగారంలో రోజువారీ పనులకు వెళ్లాడు.

ఈ సమయంలో లక్ష్మి మళ్లీ అప్పారావుకు ఫోన్‌ చేసి తన భవిష్యత్‌ ఏమిటని ప్రశ్నించేది.  దీంతో లక్ష్మి బాధ పడలేక  అదే కర్మాగారంలో రోజువారి పనిలో చేర్పించి కొత్తపాలెం గ్రామంలో చిన్న తాటాకు ఇల్లును అద్దెకు తీసుకొని అమెను ఉంచాడు. అప్పారావు మాత్రం ఎస్‌.కోట నుంచే రాకపోకలు సాగించేవాడు.

ఇదిలా ఉండగా లక్ష్మి కర్మాగారంలో కొంతమంది వ్యక్తులతో చనువుగా ఉండడం చూసి అప్పారావు ఆమెను అంతమొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీ రాత్రి లక్ష్మికి ఫోన్‌చేసి గోల్డుస్టార్‌ జంక్షనవద్ద కలుద్దామని చెప్పాడు. 

ఎస్‌.కోట నుంచి రెండు మద్యం సీసాలు, గ్లాసులు, వాటర్‌ ప్యాకెట్‌లను కొనుగోలు చేసి అప్పారావు గోల్డుస్టార్‌ జంక్షన్‌కు వెళ్లేసరికి అప్పటికే లక్ష్మి చేరుకుంది. నిర్మాణుష్య ప్రాంతానికి వెళ్దామని లక్ష్మిని అడగ్గా, సర్లే నాకు తెలిసిన స్థలం ఉందని చెప్పి పక్కనే గల జమ్మాదేవిపేట వూట చెరువు గట్టుకు తీసుకెళ్లింది.  

అక్కడ ఇద్దరూ పూటుగా మద్యం సేవించి సంభాషించుకునే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో లక్ష్మి గొంతును బలంగా అదిమి హత్య చేశాడు. మృతదేహంపై చెట్ల కొమ్మలు వేసి ఆమె ఫోన్‌ తీసుకుని అప్పారావు ఎస్‌.కోట వెళ్లిపోయాడు.

పోలీసులు రంగప్రవేశం చేసి మృతురాలు లక్ష్మి పూర్తివివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో అప్పారావు పాత్రపై అనుమానాలు రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. మృతురాలి ఫోన్‌ ఇన్‌కమింగ్, అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌ పరిశీలించగా 22వ తేదీన అప్పారావుతో ఎక్కువగా మాట్లాడినట్లు తెలిసింది.

పైగా మృతదేహం వద్ద లభించిన గ్లాసులు, వాటర్‌ ప్యాకెట్లపై అప్పారావు వేలిముద్రలున్నాయి. దీంతో నిందితుడ్ని గట్టిగా ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడ్ని ఎస్‌.కోట కోర్టులో  హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించింది. కార్యక్రమంలో ఎస్‌.కోట, ఎల్‌.కోట ఎస్సైలు అమ్మినాయుడు, మండల శ్రీనువాస్‌ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement