విద్యార్థినిపై లైంగిక దాడి

Molestation on Girl Child in Prakasam - Sakshi

బాలిక తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తే  నిందితుడు 

పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

ఒంగోలు: తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆమె కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డ సంఘటన మానవ సంబంధాలు ఎంతగా దిగజారుతున్నాయనో తెలిపేందుకు ఉదాహరణగా చెప్పువచ్చు. రెండు సార్లు తనపై దురాగతానికి పాల్పడ్డాడంటూ బాలిక మొత్తుకున్నా.. తల్లి సైతం మభ్యపెట్టి ఇరువురికి పెళ్లి చేస్తానంటూ నచ్చజెప్పేందుకు యత్నించడంతో బాలిక పారిపోయి అమ్మమ్మ ఇంటికి చేరుకుని జరిగిన దారుణాన్ని వెల్లడించింది. దీంతో వారు ఒంగోలు వచ్చి పోలీసులను ఆశ్రయించారు. దిశ పోలీసుస్టేషన్‌లో బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు సుభాని, బాలిక తల్లిపై కేసులు నమోదు చేశారు.   

జరిగింది ఇదీ: బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేస్తవారిపేటకు చెందిన ఓ మహిళకు వివాహమైంది. ఆమె స్థానికంగా ఉన్న ఒక కాలేజీలో చిరుద్యోగిగా పనిచేస్తోంది. ఆమెకు, భర్తకు మధ్య మనస్పర్థలు రావడంతో ఏడేళ్లుగా విడిపోయి ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. కొంతకాలం పాటు ఇరువురు కుమార్తెలు తల్లి వద్దనే ఉన్నారు. అయితే తల్లి ప్రవర్తన నచ్చని చిన్న కుమార్తె అమ్మమ్మ ఇంటికి చేరుకుని అక్కడే ఉంటోంది. పెద్ద కుమార్తె మాత్రం తల్లివద్దనే ఉంటూ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఒంటరిగా ఉంటున్న బాలిక తల్లికి స్థానిక బలరాం కాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ సుభానితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సహజీవనంగా మారింది.

ఈ నేపథ్యంలో ఆ కామాంధుడి కన్ను ఇంట్లో ఎదిగిన ఆమె కుమార్తెపై పడింది. ఈ క్రమంలోనే రెండు దఫాలు బాలికను బెదిరించి ఆమెపై సుభాని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లి దృష్టికి తీసుకెళ్లగా గోలచేయవద్దని.. ఇరువురికి పెళ్లిచేస్తానంటూ నచ్చజెప్పేందుకు యత్నించింది. తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి తనను పెళ్లి చేసుకోవడం ఏమిటంటూ బాలిక నిలదీయగా చంపేస్తానంటూ సుభాని బెదిరించాడు. ఈ క్రమంలో బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చి బేస్తవారిపేటకు చేరుకుని అమ్మమ్మ ఇంట జరిగిన విషయం చెప్పి బావురుమంది. దిగ్భ్రాంతి చెందిన వారు బుధవారం సాయంత్రం స్థానిక అంబేడ్కర్‌ ఆశయ సాధన సమితి అధ్యక్షుడు బిళ్ళా చెన్నయ్య నేతృత్వంలో టూటౌన్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు.

అనంతరం వారి సూచన మేరకు దిశ పోలీసు స్టేషన్‌కు వెళ్లి బాలిక జరిగిన విషయంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు సుభానిపై పోక్సో కేసు, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక తల్లి కూడా నిందితుడికి సహకరించిందని కేసు నమోదు చేశారు. ఈ మేరకు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తున్నటు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే బాలిక తల్లి టూటౌన్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి తన కుమార్తె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసేందుకు యత్నించింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top