మిరపకాయల దొంగలు ఇద్దరు అరెస్టు

Mirchi Thievs Arrest in Krishna - Sakshi

రెండు మాసాలుగా రూ.3 లక్షలు విలువచేసేవి అపహరణ

కృష్ణాజిల్లా, చందర్లపాడు (నందిగామ) : కల్లాల్లో ఎండబెట్టిన మిరపకాయలను దొంగిలిస్తున్న ఇరువురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నందిగామ మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన కొత్త ఆనంద్‌కుమార్, జగ్గయ్యపేటకు చెందిన యర్రంశెట్టి సైదేశ్వరరావు గడిచిన రెండు మాసాలుగా పలు గ్రామాల్లోని పొలాల్లో ఆరబెట్టిన మిర్చిని దొంగిలిస్తున్నారు. చందర్లపాడు మండలంలో పోపూరు, చింతలపాడు, పాతబెల్లంకొండ వారిపాలెం, కంచికచర్ల మండలం పెండ్యాల, వత్సవాయి మండలం గట్టుభీమవరం, తెలంగాణ రాష్ట్రం మధిర మండలంలోని దేశినేనిపాలెం గ్రామాలలో 96 టిక్కీల మిరపకాయల దొంగతనం జరిగింది. పగటిపూట ద్విచక్ర వాహనంపై పొలాల్లోని కల్లాల వద్ద రెక్కీ నిర్వహించి, స్థానికులతో కొద్ది సేపు కలివిడిగా మాట్లాడతారు. రాత్రి సమయంలో కల్లాల వద్ద రైతులు కాపలా ఉంటున్నారా లేదా అనేది నిర్ధారణ చేసుకుంటారు. కాపలా ఉండరని తెలిస్తే రాత్రివేళ వచ్చి మిరపకాయలను టిక్కీలకు ఎత్తుకుని ఆటో ద్వారా తరలిస్తారు.

నిందితుల్లో ఒకడైన సైదేశ్వరరావుకు సొంత ఆటో ఉంది. మిరపకాయలను ఆ ఆటో ద్వారా నందిగామలో ఆనంద్‌కుమార్‌ ఉంటున్న ఇంట్లో నిల్వ చేస్తారు. ఆయా గ్రామాల్లో మొత్తం 96 టిక్కీల కాయలను ఇప్పటి వరకు దొంగిలించారని, వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. వీరిరువురిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు చెప్పారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top