మంత్రి కుమారుని కిడ్నాప్‌ దందా

Minister Son Kidnap Dhanda In Anantapur - Sakshi

బెంగళూరు వాసికి చుక్కలు

తక్కువ ధరకే బంగారమంటూ బురిడీ

మంత్రి స్వగ్రామంలో బందీ

రూ.4కోట్లు చెల్లించేలా అగ్రిమెంట్‌

కర్ణాటక పోలీసుల రంగ ప్రవేశం

అదుపులో ఆరుగురు     ముఠా సభ్యులు?

అనంతపురం: మంత్రి కుమారుని దందాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ధర్మవరంలో భూమి ‘పంచాయితీ’ విషయమై ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసిన ఉదంతం మరువక ముందే.. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని కిడ్నాప్‌ చేయడం జిల్లాలో కలకలం రేపుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలివీ.. బెంగళూరుకు చెందిన సలీం అనే వ్యక్తిని ఓ మంత్రి కుమారుని అనుచరులు మూడు రోజుల క్రితం కిడ్నాప్‌ చేశారు. గతంలో ఈ ముఠా సభ్యులు బెంగళూరుకు వెళ్లి తమ వద్ద బంగారం ఉందని, తక్కువ రేటుకే ఇస్తామని నమ్మబలికారు. వీరి మాయమాటలు నమ్మిన బాధితుడు అడ్వాన్స్‌ కింద రూ.70 లక్షలు ఇచ్చాడు. ఇటీవల బంగారం తీసుకెళ్లాలని ముఠా సభ్యులు సలీంకు ఫోన్‌ చేయడంతో మూడురోజుల క్రితం జిల్లాకు చేరుకున్నాడు.

రాప్తాడు సమీపంలో ఓ ప్రదేశానికి రమ్మని చెప్పిన ముఠాసభ్యులు అటునుంచి అటే మంత్రి స్వగ్రామానికి తీసికెళ్లినట్లు తెలిసింది. రెండు రోజుల పాటు అదుపులో ఉంచుకొని బాధితున్ని చితకబాదినట్లు సమాచారం. చంపుతామని బెదిరించి బాధితుని అకౌంట్‌ నుంచి రూ.49 లక్షలు తమ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. అంతటితో ఆగకుండా మరో రూ.4కోట్లు చెల్లించేలా అగ్రిమెంట్‌ బాండ్లు రాయించుకుని వదిలేశారు. ఘటనపై బాధితుడు బెంగళూరు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీసులు విచారణ నిమిత్తం మూడు రోజుల క్రితం నగరానికి చేరుకున్నారు. ఆ సందర్భంగా నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. వీరిచ్చిన సమాచారం మేరకు.. కిడ్నాప్‌ ముఠాలోని మొత్తం ఆరుగురికి పైగా సభ్యులను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.

పేరు మోసిన కిడ్నాప్‌ ముఠా
కిడ్నాప్‌ ముఠా వరుస భూ దందాలకు    పాల్పడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంత్రి కుమారుని అండతో సెటిల్‌మెంట్లు, భూ దందాలు, కిడ్నాప్‌లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇటీవల ధర్మవరంలో ఇలాంటి భూ పంచాయితీలో తలదూర్చి ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేయడం తీవ్ర దుమారం రేపింది. ధర్మవరం, రాప్తాడు ప్రజాప్రతినిధుల మధ్య అగ్గి రాజేసింది. ఈ ఘటనపై కూడా ఈ నెల 6న ‘ల్యాండ్‌మైన్‌’ శీర్షికన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఆ ఘటన మరువక ముందే అదే ముఠాలోని కొందరు సభ్యులు తాజాగా బెంగళూరు వాసిని కిడ్నాప్‌ చేసినట్లు తెలిసింది. ఈ ముఠాకు మంత్రి కుమారుడు నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై పోలీసులను ‘సాక్షి’ వివరణ కోరగా కిడ్నాప్‌లో పాల్గొన్న నిందితులను విచారిస్తున్నామని, త్వరలో కేసు వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top