
ఎమ్మార్పీ ఎక్కడైనా అమలు చేయవచ్చేమో కానీ మద్యం సీసాలపై మాత్రం కాదు... కానేకాదు! మత్తుకు బానిసైన లక్షలాది మంది రోజూ మద్యం సీసాపై రూ.15 అదనంగా చెల్లించుకుంటున్నారు! ఇల్లూ ఒళ్లూ గుల్ల చేసుకొని చెల్లిస్తున్న ఆ మొత్తం ఎక్కడికి వెళ్తోంది? తొలుత సిండికేట్‌కు... అక్కడి నుంచి అధికార పార్టీ నాయకులకు! ఈ వ్యవహారం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న కొంతమంది ఎక్సైజ్ శాఖ అధికారులకూ కొంత మొత్తం వెళ్తోందన్న విమర్శలు కొన్నేళ్లుగా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. జిల్లా కలెక్టరుగా పనిచేసి ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌గా వెళ్లిన పి.లక్ష్మీనరసింహం... ఎక్సైజ్ శాఖను చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు! కానీ అధికార పార్టీ నాయకుల ముందు అవేవీ పనిచేయవని రుజువవుతూనే ఉంది! తాజాగా జిల్లా ఎక్సైజ్‌శాఖ ఇన్‌చార్జి డీసీ ఎం.శివప్రసాద్ ఇంట్లో శుక్రవారం జరిగిన ఏసీబీ తనిఖీల్లో ఏకంగా రూ. 4.50 లక్షల నగదు దొరకడం సంచలనం సృష్టిస్తోంది.
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లాలో 235 మద్యం దుకాణా లు, 17 బార్‌లు ఉన్నాయి. కానీ బెల్ట్‌షాపులు, అనధికార పర్మిట్ రూమ్‌లు లెక్కలేనన్ని ఉన్నా యి. గత మూడేళ్లుగా అధికార పార్టీ నాయకులు, వారిలో ముఖ్యంగా జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడి కుడిభుజంగా వ్యవ‘హరి’స్తున్న వ్యక్తి కనుసన్నల్లోనే సిండికేట్ నడుస్తోంది. బెల్ట్‌షాపు నిర్వాహకులకు అండదండలు అందిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో జూలైలో గుంటూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్యంపై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చినవెంటనే సామాన్యుల ఇల్లూ ఒళ్లూ గుల్ల చేస్తున్న బెల్ట్‌షాపులను నిరోధిస్తామని, దఫదఫాలుగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ప్రజల్లో సానుకూల స్పందనలు రావడంతో టీడీపీ ప్రభుత్వం మేల్కొంది. బెల్ట్‌షాపులను తామే నిరోధిస్తామంటూ ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
కానీ ఆచరణలో అది సాధ్యం కావట్లేదు! సిండికేట్ అండతో బెల్ట్‌షాపులకు బదులు ‘ఇంటి వద్దకే మద్యం’ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఒక్కో వినియోగదారుడు ఆరు వరకూ మద్యం బాటిళ్లు కొనుక్కునేందుకు ఉన్న వెసులుబాటును అలుసుగా తీసుకుంటున్నారు. బెల్ట్‌షాపు నిర్వాహకుడు మద్యం దుకాణాల నుంచి ఆరు బాటిళ్లు ఒకేసారి తీసుకెళ్లి తమ కస్టమర్లు కోరినచోట అందజేసి వస్తున్నాడు. బెల్ట్‌షాపులు నిరోధించేశామని అధికార పార్టీ నాయకులు చెబుతున్నా చాపకింద నీరులా ఈ అక్రమ మద్యం వ్యాపారం సాగిపోతోంది. ప్రస్తుతం సగటున జిల్లాలో నెలకు రూ.35 కోట్ల వరకూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. పండుగలు, ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడు అది రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకూ చేరుతోంది. రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరుగుతున్న జిల్లాల్లో శ్రీకాకుళం ముందు వరుసలో ఉందంటే పరిస్థితి ఊహించవచ్చు.
అక్రమాలకు తలుపులు బార్లా...
లైసెన్స్ ఫీజుకు రూ.2 లక్షలు అదనంగా చెల్లించిన మద్యం దుకాణ యజమానులందరికీ ప్రభుత్వం ఆయా దుకాణాల పక్కనే పర్మిట్‌రూమ్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. మద్యం దుకాణంలో కొనుగోలు చేసిన బాటిల్‌ను అక్కడికి తీసుకెళ్లి తాగడానికి మాత్రమే అనుమతి ఉంది. అలాగే రూ.5 వేలు చెల్లించి అనుమతి తీసుకున్న ఇద్దరేసి నౌకరీనామాలతోనే విక్రయాలు సాగించాలి. కానీ అందుకు భిన్నంగా జిల్లాలోని చాలాచోట్ల పర్మిట్‌రూమ్‌ల్లో వ్యవహారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాన్ని ఉదయం 10.30 గంటలకు తెరిచి... రాత్రి 10.30 గంటలకు మూసేయాలి. పర్మిట్‌రూమ్‌లకు అదే నిబంధన వర్తిస్తుంది. కానీ దుకాణాలు మూసేసి అన్ని రకాల మద్యం బాటిళ్లను పర్మిట్ రూమ్‌ల్లో పెట్టించి తెల్లవారుజాము 4 గంటల నుంచి మొదలు అర్ధరాత్రి 12 గంటల వరకూ విక్రయాలు సాగిస్తున్నారు.
ఈ వ్యవహారాలన్నీ సవ్యంగా జరగాలంటే లైసెన్స్‌డ్ వ్యాపారులు సిండికేట్‌కు నెలనెలా రూ.60 వేల వరకూ ముడుపులు చెల్లించాల్సిందే. దీనిలో అగ్రభాగం అధికార పార్టీ నాయకుల జేబుల్లోకి వెళ్తోంది. ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వదిలేయడానికిగాను ఎక్సైజ్ శాఖలోని కొంతమంది అధికారులకు కూడా కొంత వాటా వెళ్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో ఇనిచార్జ్ డిప్యూటీ కమిషనర్ ఎం.శివప్రసాద్ ఇంట్లో భారీగా నగదు లభించడం వాటికి ఊతమిస్తోంది. మరోవైపు ఎక్సైజ్ శాఖ వ్యవహారాలపై జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో జరగాల్సిన సమీక్ష సమావేశాలు కూడా లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఈ సమావేశాలు నిర్వహించడంతో పాటు ఎక్సైజ్ శాఖ కమిషనర్ పి.లక్ష్మీనరసింహం ప్రత్యేకంగా మరింత దృష్టి పెడితే తప్ప ఆ శాఖ దారికొచ్చే పరిస్థితి కనిపించట్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.