పదిహేనేళ్లుగా చీకటి గదిలోనే..

Mentally Challenged Person House Arrested In Vikarabad - Sakshi

మొయినాబాద్‌(చేవెళ్ల): అమ్మ.. తమ్ముడు.. మరదలు అందరు ఉన్నా అతడు అనాథ అయ్యాడు. మతి స్థిమితం లేకపోవడంతో వ్యవసాయ పొలం వద్ద బందీ అయ్యాడు. 15 ఏళ్లుగా చీకటిగదిలో బందించి అన్నపానీయాలు కిటికీలోంచి ఇస్తున్నారు. తిండీ ఆ గదిలోనే.. మలమూత్ర విసర్జన ఆ గదిలోనే. మనుషుల్లో మాతవత్వం మాయమవుతుందనడానికి ఈ సంఘటనే తార్కాణం.  

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం కనకమామిడి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కనకమామిడి గ్రామానికి చెందిన బలిజ బుచ్చప్ప, సుశీల దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. పదిహేనేళ్ల క్రితం తండ్రి బుచ్చప్ప చనిపోయాడు.

పెద్దకొడుకు మల్లేష్‌కు మతిస్థిమితం సరిగా లేదని అతని భార్య అప్పట్లోనే వదిలేసి వెళ్లిపోయింది. పెళ్లికి ముందు మల్లేష్‌ అందరితో కలుపుగోలుగా, చలాకీగా ఉండేవాడు. అన్నదమ్ములు సైతం అన్యోన్యంగా ఉండేవారు. తమ్ముడి పెళ్లి అయ్యాక మల్లేష్‌కు మతిస్థిమితం సరిగాలేదని గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద చీకటి గదిలో బందించారు. అప్పటి నుంచి తల్లి సుశీల ప్లాస్టిక్‌ కవర్‌లో అన్నం, నీళ్లు తీసుకెళ్లి కిటికీలోంచి మల్లేష్‌కు ఇచ్చేది. తిండితోపాటు మలమూత్ర విసర్జన కూడా గదిలోనే. 15 సంత్సరాలుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది.  

కోట్ల విలువచేసే ఆస్తి ఉన్నా... 

మల్లేష్‌ పేరుమీద రూ.కోట్ల విలువచేసే భూమి ఉంది. అయినా తనవాళ్లు అతన్ని సరిగ్గా చూసుకోకుండా గదిలో బందించారు. తల్లి కన్న ప్రేమతో అన్నం, నీళ్లు ఇవ్వడమే తప్ప.. తమ్ముడు, మరదలు మాత్రం అస్సలు పట్టించుకునే పరిస్థితిలేదు. 15 ఏళ్లుగా గదిలోనే బందీగా ఉన్న మల్లేష్‌ వికృతంగా తయారయ్యాడు. ఇటీవల గ్రామస్తులు గదిలో ఉన్న మల్లేష్‌ను చూసి గడ్డం, తలవెంట్రుకలు తీయించారు.

మల్లేష్‌ చదువుకునే రోజుల్లో చాలా చురుగ్గా ఉండేవాడని చెబుతున్నారు. అతనికి నిజంగానే మతిస్థిమితం సరిగా లేకుంటే ఆసుపత్రిలో చూపించాలి కానీ చీకటి గదిలో బంధించడం ఏమిటని గ్రామస్తులు అంటున్నారు. పౌరహక్కుల కమిషన్‌ స్పందించి మల్లేష్‌ను చీకటి గదినుంచి విముక్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top