మట్కా.. మాయ!

Matka Gang Arrest In Mahabubnagar - Sakshi

అప్పులపాలవుతున్న కుటుంబాలెన్నో..

మక్తల్, కృష్ణ, మాగనూర్‌ ప్రాంతాల్లోస్థావరాలు

జూదంపై ఉక్కుపాదం మోపని పోలీసులురాజకీయ

నాయకులే ఏజెంట్లు  

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : పైసా పెట్టుబడి ఉండదు.. అయినా లక్షల రూపాయల బిజినెస్‌.. ఎవరికీ లెక్కచెప్పాల్సిన అవసరం ఉండదు.. గుట్టుచప్పుడుగా సాగే ఓ రహస్య వ్యాపారం పేరు మట్కా. సరిగ్గా చెప్పాలంటే ఇది పక్కా జూదం. అందరు పోగై ఆడే అటకాదు. కేవలం సెల్‌ఫోన్ల సాయంతో నంబర్లతో ఆడే ఆట ఇది. దీనిమాయలో పడిన ఎందరో అమాయకులు అప్పులపాలవుతుండగా ఏజెంట్లు మాత్రం కోట్లు సంపాదిస్తున్నారు. మక్తల్‌ నియోజకవర్గం కేంద్రంగా సాగే ఈ జూదం గురించి పోలీసులకు తెలిసినా మట్కా ఏజెంట్లు రాజకీయ నాయకులు కావడంతో చూసిచూడనట్లు వదిలేస్తున్నారు. అప్పుడప్పుడు నామమ్రాతంగా దాడులు చేస్తూ మేమూ కూడా పనిచేస్తున్నామని కేసులు నమోదు చేస్తున్నారు. 

మట్కాకు అడ్డాగా మక్తల్‌  
మక్తల్‌ నియోజకవర్గం ఈ ఆటకు అడ్డాగా మారింది. మక్తల్‌ పట్టణంతోపాటు కృష్ణ, మాగనూర్‌ ప్రాంతాల్లో ఏజెంట్లు దశాబ్ద కాలంగా రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఈ జూదం ఆడుతున్నారు. నవంబర్‌ 22వ తేదీన మక్తల్‌లోని ఓ ఇంటిపై పోలీసులు దాడిచేసి తాజొద్దీన్, చాంద్‌పాష అనే ఇద్దరు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో రూ.18,200 నగదు, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటినుంచి కొన్నిరోజులు మట్కా ఆటకు బ్రేక్‌ పడినా కొన్నిరోజులుగా మళ్లీ ఊపందుకుంది. అప్పట్లోనే పోలీసులు ఈ జూదంపై సీరియస్‌గా వ్యవహరించి ఉంటే ఈ ఆట మళ్లీ పుంజుకునేది కాదు. ఇంతకు మట్కా ఎలా ఆడతారు.. ఎక్కడినుంచి సమాచారం.. నంబర్లు సేకరిస్తారు.. అనే విషయాలు పూర్తిస్థాయిలో వెలుగులోకి రాలేదు. మొదట కృష్ణ గ్రామంలో ఈ ఆట ఆడేవారని, అక్కడి నుంచి మాగనూర్‌కు పాకిందని.. ప్రస్తుతం  మక్తల్‌లో మట్కా జోరందుకోవడంతో ఈ జూదంలో చాలామందే సభ్యులుగా ఉన్నట్టు తెలిసింది. ఈ వ్యాపారంలోతాజొద్దీన్, చాంద్‌పాష కీలక బాధ్యతలు తీసుకుని ఈ తతంగం నడిపిస్తున్నారు. ముందువీరు రాయచూర్‌ నుంచి ఆటను సాగించేవారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో పరిచయాలు పెరగడంతో వారి అడ్డాను మక్తల్‌కు మార్చుకున్నారు. రోజురోజుకు మట్కా నంబర్ల సంఖ్య పెరగడంతో ఏజెంట్లకు ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. రోజు లక్షల లాభం పొందుతున్నారంటే ఈ ఆట ఏ స్థాయిలో ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

మట్కా.. ఇలా ఆడతారు
మట్కా ఆట రెండురకాలుగా ఉంటుంది. ఒకటి ఓపెన్, రెండోది క్లోజ్‌. ఈ రెండు ఆటలను మహరాష్ట్రలోని రెండు పట్టణాల్లో ఉండే ప్రధాన కార్యాలయాలు వేర్వేరుగా నిర్వహిస్తాయి. ఒకటి ముంబాయి, రెండోది కల్యాణి. ముంబాయి ఆటలో ఓపెన్‌ నెంబర్‌ ను మధ్యాహ్నం రెండు గంటలకు వెలువరిస్తారు. క్లోజ్‌ నెంబర్‌ను రాత్రి 10గంటలకు ప్రకటిస్తారు. ప్రధానంగా జూదరులు క్లోజ్‌ కే ఎక్కువగా డబ్బులను వెచ్చిస్తారు. ఇందులో రూ.1కి రూ.80 వస్తాయి. కేవలం ఓపెన్‌కు ఆడితే రూ.1కి రూ.8 మాత్రమే ఇస్తారు. ఇక కల్యాణి ఆటలో కూడా ఇదేవిధంగా ఉంటుంది. ఈ ఆటలో నెంబర్‌ రాత్రి 12గంటలకు తెలుస్తుంది. ఈ మట్కా జూదం మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇందులోని ఏజెంట్లకు వచ్చిన కలెక్షన్ల ద్వారా కోటీశ్వరులు అయినవారు ఉన్నారు. దివాళా తీసి ఉన్న ఆస్తులను కూడా అమ్ముకున్న వారున్నారు.  

మాముళ్ల మత్తులో అధికారులు  
నియోజకవర్గంలో మట్కా మూడు పూలు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. వివిధ పార్టీలకు చెందిన బడా నాయకులే బహిరంగంగా ఏజెంట్లుగా అవతారం ఎత్తారు. వీరు కూడా గ్రామాల్లోని కార్యకర్తలను మెంబర్లుగా, ఏజెంట్లను నియమించి వారి ద్వారా అమాయకులతో జూదమాడిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే  ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటంతో యువకులు పెడదారిన పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే యువకులు వేరే పని చేయకుండా మట్కాను ఓ ఉద్యోగంలా, వ్యాపారంగా మలుచుకున్నారు. యువకులతోపాటు ఉద్యోగులు, మహిళలలు, రైతులు, కూలీలు, వ్యాపారులు, వయే వృద్ధులు సైతం ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ మట్కామాయలో పడిన వారిని విముక్తి కల్పించి ఏజెంట్ల ఆట కట్టించాలని విద్యావంతులు కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top