చెన్నూర్‌లో భారీ చోరీ | Sakshi
Sakshi News home page

చెన్నూర్‌లో భారీ చోరీ

Published Tue, Nov 5 2019 9:18 AM

Massive Robbery In Chennur Town - Sakshi

సాక్షి, చెన్నూర్‌: చెన్నూర్‌ పట్టణంలో జేబీఎస్‌ పాఠశాల సమీపంలోని గోదావరి రోడ్డులో చెన్నూర్‌ ఎంఈవో రాధాకృష్ణమూర్తి ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు తాళాలు పగలకొట్టి బీరువాలో దాచిన నగదు, విలువైన సొత్తును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు కొమ్మెర రాధాకృష్ణమూర్తి వాపోయాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లి అదేరోజు అర్ధరాత్రి 1 గంటకు ఇంటికి వచ్చి చూసేసరికి తలుపు తీసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా..  బీరువా పగులగొట్టి అందులో దాచిన మూడున్నర తులాల బంగారం, రూ.70 వేల విలువైన వెండి, రూ.1.60 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఎస్సై విక్టర్, సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. డాగ్‌స్వా్కడ్, క్లూస్‌ టీం బృందం సభ్యులు రంగంలోకి దిగారు. పట్టణంలోని జెండవాడలో చెన్న మధు ఇంటి వద్ద కుక్క ఆగడంతో మధును తీసుకెళ్లి పోలీసులు విచారిస్తున్నారు. జైపూర్‌ ఏసీపీ నరేందర్‌ ఎంఈవో ఇంటికి వెళ్లి చోరీ జరిగిన తీరును తెలుసుకున్నారు.

పక్కా ప్లాన్‌తోనే దొంగతనం..
ఏంఈవో రాధాకృష్ణమూర్తి కుటుంబం హైదరాబాద్‌ వెళ్లి వచ్చేలోగా ఇంట్లో చోరీ జరిగింది. పక్కా ప్లాన్‌తోనే దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. తెలిసిన వారైన ఉండాలి. లేక రెక్కీ నిర్వహించిన దొంగలైన ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడి ఇల్లు రోడ్డు పక్కనే ఉండడంతో పాటు నిరంతరం జన సంచారం ఉంటుంది. పగలు చోరీ జరిగే అవకాశమే లేదు. రాత్రివేళ సుమారు 10 నుంచి 12 గంటల మధ్యే చోరీ జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.  

 
Advertisement
 
Advertisement