దారుణం: వివాహితపై అత్యాచారం.. హత్య

Married Women Murdered By Unknown Person In Adilabad - Sakshi

పట్టపగలే సంఘటన

ఆలస్యంగా వెలుగులోకి

పోలీసుల అదుపులో ఇద్దరునిందితులు..?

సాక్షి, లింగాపూర్‌(ఆసిఫాబాద్‌) : బతుకుదెరువు కోసం మండలానికి వచ్చిన ఓ వివాహితను గుర్తుతెలియని దుండగులు పట్టపగలు అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన ఘటన మండలంలోని ఏల్లాపటార్‌ రామునాయక్‌తండా వద్ద ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం జరిగినట్లు అనుమానిస్తున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు, మృతురాలి భర్త గోపి కథనం ప్రకారం.. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం మస్తాన్‌ ఎల్లాపూర్‌ గ్రామానికి చెందిన టేకు లక్ష్మి, గోపి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. బతుకుదెరువు కోసం జైనూర్‌ మండల కేంద్రంలో ఓ ఇంటికి అద్దెకు తీసుకుని ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరూ వెంట్రుకలకు బుగ్గలు అమ్ముకుంటూ పిల్లలను పోషించుకుంటున్నారు. కొద్దిరోజులుగా లింగాపూర్‌ మండల పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ.. బుగ్గలు అమ్ముతున్నారు. ఎప్పటిలాగే భార్యాభర్తలు కలిసి.. ఆదివారం ఉదయమే బుగ్గలు అమ్ముకునేందుకు బయల్దేరారు. భార్యను ఏల్లాపటార్‌లో దింపి.. గోపి ఖానాపూర్‌ వై పు వెళ్లాడు. లక్ష్మిని లింగాపూర్‌ కూడలిలో ఉండమని చెప్పాడు.

ఉదయం 11 గంటలకు లింగాపూర్‌కు చేరుకున్న గోపికి లక్ష్మి కనిపించలేదు. మధ్యాహ‍్నం వరకూ వేచిచూసినా.. రాకపోవడంతో ఎల్లాపూర్‌కు వెళ్లి వాకబు చేశాడు. గ్రామం దాటి వెళ్లినట్లు కొందరు చెప్పగా.. రామునాయక్‌తండాకు వెళ్లి వాకబు చేశాడు. ఆమెను చూడనేలేదని స్థానికులు చెప్పడంతో తిరిగి లింగాపూర్‌ చేరుకున్నాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో గోపి లింగాపూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంకటేశ్‌ రంగంలోకి దిగి అదే రాత్రి గాలించినా ప్రయోజనం లేదు. తిరిగి సోమవారం వెదుకుతుండగా.. ఉదయం 10 గంటల సమయంలో రామునాయక్‌తాండ శివారు చెట్లపొదల్లో లక్ష్మి (30) శవమై కనిపించింది. ఆమె ఒంటిపై గాయాలు ఉండడం.. అనుమానస్పదస్థితిలో మృతిచెంది ఉండడంతో పోలీసులు జైనూర్‌ సీఐ సురేశ్‌కు సమాచారం అందించారు. ఆయన ఆసిఫాబాద్‌ డీఏస్పీ సత్యనా రాయణతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పోలీస్‌ జాగిలాలతో గాలించారు. లక్ష్మిపై లైంగికదాడి చేసి.. ఆపై హత్య చేసినట్లు అనుమానించారు. ఏల్లపటార్‌ గ్రామానికి చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు స మాచారం.

శవంతో కుటుంబ సభ్యుల ధర్నా
బుగ్గలు అమ్ముకునేందుకు వెళ్లిన లక్ష్మిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ.. ఆమె బంధువులు మృతదేహంతో మండల కేంద్రానికి చేరుకుని గాంధీచౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. లైంగికదాడి చేసి.. హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, మృతురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనుమానితులుగా భావిస్తున్న వారి ద్విచక్రవాహనాలను దహనం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డీఎస్పీ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. నిందితులను పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Election 2024

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top