రాజీవ్‌ తరహాలోనే మోదీ హత్యకు భారీ కుట్ర!

Maoists Murder Plan On Narendra Modi, Says Pune Police - Sakshi

పుణే : ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు భారీ కుట్ర జరిగిందని, గతేడాది నుంచే ఆయన హత్యకు మావోయిస్టులు ప్రణాళికలు రచిస్తున్నారని వెల్లడైంది. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని ఎల్టీటీఈ హతమార్చిన తరహాలోనే మావోయిస్టులు ప్రధాని మోదీని అంతం చేసేందుకు ప్లాన్‌ వేశారని పుణే పోలీసులు చెప్పారు. అందుకు సంబంధించిన ఓ లేఖను శుక్రవారం విడుదల చేశారు. మోదీ హత్యకు కుట్ర పన్నడం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మావోయిస్టులు ఆ లేఖను గతేడాది ఏప్రిల్‌లో రాశారు.

ఈ ఏడాది జనవరి మహారాష్ట్రలోని భీమా కోరేగాంలో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి కేసులో సుధీర్‌ దావలే, సురేంద్ర గాట్లింగ్‌, సోమా సేన్‌, మహేష్‌ రౌత్‌, రోనా జాకబ్‌ విల్సన్‌ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే జాకబ్‌ విల్సన్‌ను అరెస్ట్‌ చేసిన ఇంటినుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖ తాజాగా కలకలం రేపుతోంది. మోదీని ఎలా హత్య చేయాలో మావోయిస్టులు లేఖల ద్వారా చర్చించుకోవడం లేఖలో స్పష్టంగా ఉంది.

కుట్రకు కారణాలేంటి..!
దేశ వ్యాప్తంగా మోదీ హవా కొనసాగుతోందని, తమ మనుగడ కష్టమవుతుందని భావించి ప్రధానిని అంతమొందించాలని మావోయిస్టులు కుట్ర పన్నారు. తమకు ప్రధాని కొరకరాని కొయ్యగా మారారని, అసలే పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడం హత్య కుట్రకు ఓ కారణమని పోలీసులు తెలిపారు. మోదీ రోడ్‌షోలను లక్ష్యంగా చేసుకుని రాజీవ్‌ గాంధీ హత్య తరహాలోనే తమ చర్యలు ఉండాలని హై కమాండ్‌కు మావోయిస్టులు రాసిన లేఖలో ఉంది. నాలుగు లక్షల రౌండ్ల బుల్లెట్లను కొనుగోలు చేయాలని ఇందు కోసం 8 కోట్ల రూపాయలు కావాలని మావోయిస్టు కేంద్ర కమిటీకి తెలిపారు. 

కాగా, మరోవైపు ప్రధాని మోదీ హత్యకు ఐసిస్‌ ఉగ్రసంస్థ గత (మే) నెలలో కుట్రకు పాల్పడిన విషయం తెలిసిందే. ఐసిస్‌ ఉగ్రకుట్రను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) భగ్నం చేసింది. స్నిప్పర్‌ రైఫిల్‌తో మోదీని కాల్చి హత్యచేయాలని మిలిటెంట్లు భావించారని ఏటీఎస్‌ బృందం ఇటీవల వెల్లడించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top