చిక్కిన శ్రీమది

Maoist Srimadhi Held in Tamil nadu - Sakshi

కోవైలో మావోయిస్టు అరెస్టు

నెల్లైలో సానుభూతిపరుడు కూడా..

సాక్షి, చెన్నై : కేరళలో తప్పించుకున్న మావోయిస్టు శ్రీమది తమిళనాట చిక్కింది. అనైకట్ట అటవీ గ్రామంలో తలదాచుకుని ఉన్న ఆమెను కోయంబత్తూరు రూరల్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అలాగే తిరునల్వేలిలో మావోయిస్టులకు మద్దతుగా వ్యవహరిస్తూ వచ్చిన సానుభూతిపరుడు ప్రేమ్‌కుమార్‌ను కూడా అరెస్టు చేశారు.

కేరళ–తమిళనాడు–కర్ణాటకల్లో విస్తరించి ఉన్న పశ్చిమ పర్వతశ్రేణుల్ని కేంద్రంగా చేసుకుని మళ్లీ మావోయిస్టులు తమ కార్యకలాపాల్ని మొదలెట్టారు. వీరిని అణచి వేయడం కోసం మూడు రాష్ట్రాల పోలీసులు జల్లెడ పట్టి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది కేరళ రాష్ట్ర అట్టపాడి అడవులలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మరి కొందరు గాయాలతో తప్పించుకున్నారు. అప్పటి నుంచి మూడు రాష్ట్రాల పోలీసులు మరింత అప్రమత్తంగా సరిహద్దుల్లో నిఘాతో వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో తరచూ నీలగిరి– వయనాడు మార్గంలో ఉన్న కొన్ని గెస్ట్‌ హౌస్‌ల మీద మావోయిస్టులు దాడి చేయడం వంటి ఘటనలు ఉత్కంఠను రేపుతూ వచ్చాయి. తప్పించుకున్న మావోయిస్టులు పశ్చిమ పర్వత శ్రేణుల్లోనే తలదాచుకుని ఉండ వచ్చని నిర్ధారణకు వచ్చిన క్యూబ్రాంచ్‌ వర్గాలు గాలింపు ముమ్మరం చేసి ఉన్నారు.

ఆరు నెలలుగా అనైకట్టులో..  
మంగళవారం అర్ధరాత్రి కోయంబత్తూరు రూరల్‌ పోలీసులకు ఓ రహస్య సమాచారం వచ్చింది. ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. అనైకట్టు అటవీ గ్రామంలోని ఓ ఇంట్లో ఆ బృందం చుట్టుముట్టింది. ఆ ఇంట్లో ఉన్న ఓ మహిళలను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ ఇంట్లో నుంచి ఓ తుపాకీ సైతం బయట పడడంతో, అక్కడున్న వాళ్లు ఆందోళనకు లోనయ్యారు. ఆతదుపరి పట్టుబడ్డ మహిళ శ్రీమదిగా తేలింది. కర్ణాటక రాష్ట్రం చిక్‌ మంగళూరుకు చెందిన శ్రీమది కేరళ ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకుంది. ఈ ఘటన తదుపరి అక్టోబర్‌లో ఆమె అనైకట్టుకు చేరుకుని, అక్కడి స్థానికులకు తానో పేద మహిళగా పరిచయం చేసుకుంది. అక్కడే  ఓ ఇంట్లో ఉంటూ ఆరు నెలలుగా జీవనం సాగిస్తూ వస్తోంది. పోలీసులకు రహస్య సమాచారం రావడంతో శ్రీమదిని అరెస్టు చేశారు. ఆమెను రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. మిగిలిన మావోయిస్టుల  సమాచారం శ్రీమదికి తెలిసి ఉండే అవకాశాలు ఎక్కువే కావడంతో వారి జాడ కోసం ఆరా తీస్తున్నారు.

సానుభూతి పరుడు..
తిరునల్వేలి జిల్లా మున్నీరు పల్లంకు చెందిన ప్రేమ్‌కుమార్‌ కొంతకాలంగా మావోయిస్టులకు మద్దతుగా, కేంద్రానికి, ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ట్విట్లు పెడుతూ వస్తున్నారు. రోజురోజుకీ అతడి ట్విట్‌లు మరీ రెచ్చగొట్టే రీతిలో ఉండడంతో నిఘా వేశారు. స్థానిక పోలీసులు హెచ్చరించినా, అతడు ఖాతరు చేయలేదు. అదే సమయంలో తరచూ మావోయిస్టుల పేరిట ట్విట్లు పెట్టడం, వేదికలు ఎక్కి వీరావేశంతో వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా పెట్టుకున్నాడు. ఇతను మావోయిస్టుల సానుభూతి పరుడు అని తేలడంతో బుధవారం తిరునల్వేలి పోలీసులు అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top