అభయం...ఆపై అంతం ప్రతీకారాగ్ని

Maoist Killed Tribal Mens in Visakhapatnam - Sakshi

ఐదేళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్న మావోయిస్టులు

హాని తలబెట్టబోమని సంకేతాలు పంపి అదను చూసి వేటు

మిగతావారికి ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తూ  పోస్టర్లు  

మన్యం భయం గుప్పెట్లో చిక్కుకుంది. మావోయిస్టుల ఘాతుకానికి  ఇద్దరు గిరిజనులు బలయ్యారు. ఐదేళ్ల క్రితం జరిగిన దాడిలో ఇద్దరు మావోయిస్టుల మృతికి కారకులని భావిస్తున్న వీరిని అర్ధరాత్రి వేళ వచ్చి దారుణంగా కొట్టి చంపారు. ఈ సంఘటనతో మన్యం ఉలిక్కిపడింది. గిరిజనం దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.

విశాఖపట్నం, చింతపల్లి (పాడేరు): మావోయిస్టులకు భయపడి ఐదేళ్లుగా ఆ గిరిజన కుటుంబాలు వేరే ప్రాంతాల్లో తలదాచుకున్నాయి. దళ నాయకులు హతమార్చిన సంఘటనలో పాల్గొన్న వారిపై మావోయిస్టులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఎప్పటి నుంచో నిఘా పెట్టిన తమకు చిక్కకుండా జీవనం సాగిస్తున్న వారికి ఎటువంటి హానీ చేయమని సంకేతాలు పంపారు. గ్రామానికి వచ్చి స్వేచ్ఛగా జీవించాలని అభయమివ్వడంతో 3 నెలలక్రితం భాస్కరరావు కుటుంబం, వారం రోజుల క్రితం సత్తిబాబు కుటుంబం గ్రామానికి వెళ్లి జీవనం ప్రారంభించారు. అదను చూసి మావోయిస్టులు వారిద్దరిని అతి దారుణంగా హత్య చేశారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం వీరవరం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... జి.మాడుగుల మండలానికి చెందిన సింహాచలం అనే వ్యక్తి  ఒక ఆధ్యాత్మిక గురువు.  సంజీవరావు సింహాచలానికి శిష్యుడు. ప్రతిఏటా తులసీ మాలలు ధరించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం  సింహాచలం ఆధ్వర్యంలో నిర్వహించేవాడు. 2014 అక్టోబర్‌లో గ్రామంలో మాలధరించిన వారందరిని మాలలు తీసి పూజలు నిర్వహించేందుకు సింహాచలం వీరవరానికి వచ్చాడు.. భారీ ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించి తిరిగి వెళ్లిపోతుండగా సింహాచలంతో పాటు సంజీవరావు కూడా మావోయిస్టులు తోడ్కొని వెళ్లారు. బలపం సమీపంలో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న మావోయిస్టులు సంజీవరావును అక్కడే హతమార్చి సింహాచలంను కోరుకొండలో నిర్వహించే ప్రజాకోర్టులో హాజరు పరుస్తామని వెంట తీసుకొచ్చారు. సింహాచలాన్ని అదుపులోకి తీసుకుని సంజీవరావును చంపేశామని మావోయిస్టులు వెల్లడించారు.  భక్తులు ఒక్కసారిగా ఆగ్రహోద్రులై మావో యిస్టులపై దాడికి దిగారు. వారు కాల్పులు జరిపిన లెక్కచేయకుండా ముగ్గురు మావో యిస్టులను పట్టుకుని చితకబాదారు. కర్రలు, రాళ్లతో కొట్టడంతో శరత్, గణపతి అనే ఇద్దరు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. అదే ప్రాంతానికి చెందిన కొర్రా నాగేశ్వరరావు అనే మావోయిస్టు తీవ్ర గాయాలతో త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ నేప«థ్యంలో మావోయిస్టులు తమపై ప్రతీకారం తీర్చుకుంటారని భావించి గ్రామానికి చెందిన ఐదు కుటుంబాలు గ్రామం విడిచి వెళ్లిపోయాయి.

మూడు కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా భాస్కరరావు చింతపల్లిలో నివాసం ఉంటూ జీసీసీ డిపోలో తాత్కాలిక అసిస్టెంట్‌గా జీవనం సాగిస్తున్నాడు. దివ్యాంగుడైన సత్తిబాబు తమ్మంగుల పంచాయ తీ చిట్టంగరువు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. వీరిని ఎలాగైనా హతమార్చాలనే పగతో రగిలిపోతున్న మావోయిస్టులు గత కొన్నేళ్లుగా సానుభూతిపరుల ద్వారా మీరు వచ్చి గ్రామంలో ప్రశాంతంగా జీవించాలని, తమ నుంచి ఎటువంటి హానీ ఉండబోదని సంకేతాలు పంపినట్లు స్థానికులు చెబుతున్నారు. సర్కారు నుంచి ఎటువంటి సాయం లేకపోవడం వల్ల కూలీ పనులు చేసుకుని జీవించడం కష్టసాధ్యంగా మారడం, మావోయిస్టులు అభయమిచ్చినట్లు సంకేతాలు పంపడంతో వ్యవసాయం చేసుకుని జీవించాలనే లక్ష్యంతో మూడు నెలల క్రితం భాస్కరరావు కుటుంబీకులు వీరవరంలో అడుగుపెట్టారు. వారం రోజుల క్రితం సత్తిబాబు కూడా   గ్రామానికి వెళ్లి వ్యవసాయ పనులు చేయడం మొదలుపెట్టాడు. మావోయిస్టులు ఊడగొట్టిన ఇళ్లలో రేకులు వేసుకుని నివాసం ఉంటున్నారు. వీరు గ్రామంలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న మావోయిస్టులు సుమారు పది మంది బుధవారం అర్ధరాత్రి  40 మంది సానుభూతిపరులతో గ్రామానికి వెళ్లి వారిద్దరిని బయటకు పిలిచారు. భార్యలు తలుపుతీసి బయటకు వచ్చి ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్నించడంతో ఒక్కసారిగా మావోస్టులు లోపలకు చొరబడి సత్తిబాబు, భాస్కరరావులను బయటకు లాక్కొచ్చారు. కర్రలు, తుపాకులతో చితగ్గొట్టి హతమార్చారు. అడ్డుపడ్డ భార్యలను కూడా కర్రలతో కొట్టి గాయపరిచారు. మావోయిస్టు నేతలు శరత్, గణపతిలను హతమార్చిన సంఘటనలో భాVýæస్వాములైన వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తూ  పోస్టర్లు అతికించారు. మృతి చెందిన భాస్కర్‌రావుకు ఇద్దరు భార్యలు రంభ, చిన్నమ్మిలకు కోమటి, మోహన్, పార్వతి, కుమారి, శ్రీరామ్‌ అనే ఐదుగురు పిల్లలున్నారు. కోమటి డిగ్రీ, మోహన్‌ ఇంటర్‌ పూర్తి చేసి ఉన్న చదువులతో దూరంగా ఉన్నారు. పార్వతి, కుమారి వంగసారలో 9వ తరగతి, శ్రీరామ్‌ 7వ తరగతి చదువుతున్నారు. సత్తిబాబుకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. కృష్ణవేణి  4వ తరగతి, సాయి 6వ తరగతి చదువుతున్నారు.

అన్నదమ్ములిద్దరూ మావోయిస్టుల చేతిలోనే హతం  
 సంజీవరావు, భాస్కరరావు ఇద్దరు అన్నదమ్ములు. 2014లో సంజీవరావును బలపం వద్ద మావోయిస్టులు హతమార్చారు. ఈ సంఘటన నేప«థ్యంలో మావోయిస్టులపై గిరిజనులు దాడి చేసి హతమార్చిన సంఘటనలో భాస్కరరావు కూడా ఉన్నాడు. దీంతో అతను కూడా వారిచేతిలోనే ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.

ఎదిరించే గుండెలను నేలకూల్చా్చరు
పెదవాల్తేరు(విశాఖతూర్పు): జిల్లాలోని చింతపల్లి మండలం బలపం పంచాయితీకి చెందిన గిరిజనుడు గెమ్మెలి సంజీవరావును మావోయిస్టులు అతికిరాతకంగా హతమార్చడం పట్ల ఆ గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టులు ప్రశ్నించే గొంతును చంపేశారు– ఎదిరించే గుండెలను నేలకూల్చారంటూ పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. కోరుకొండ వద్ద మావోయిస్టులు సంజీవరావును అతికిరాతకంగా మట్టుబెట్టారని వారు వాపోయారు. మావోయిస్టుల దౌర్జన్యాలకు వీరవరం గ్రామం బలయిపోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. మేము పుట్టిన ఊరు, పెరిగిన ఊరు, మీరెవరు మమ్మల్ని వెళ్ల్లగొట్టడానికి అని మావోయిస్టులను ఎదిరించిన గెమ్మెలి భాస్కరరావు, పాంగి సత్తిబాబు అమరవీరులయ్యారు. మావోయిస్టుల మాటలు  లెక్క చేయకుండా గ్రామంలోనే జీవిస్తున్న నిరుపేద గిరిజన రైతులైన భాస్కరరావు, సత్తిబాబులను అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోంచి నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకు వెళ్లి మరీ పిల్లలు, మహిళలు చూస్తుండగానే అతికిరాతకంగా మావోయిస్టులు చంపడాన్ని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. పీడిత ప్రజల కోసమే పోరాటం, వారి కోసమే మా ఆరాటం అంటూ ఎంతో ఆర్భాటంగా ప్రకటనలు చేసే మావోయిస్టులు నిరుపేదలు, కోందు జాతికి చెందిన వెనుకబడిన అడవి బిడ్డలను అతికిరాతకంగా చంపడం హేయమైన చర్య అని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ అ  గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు అని తరచూ ప్రకటనలు గుప్పించే మావోయిస్టులు ప్రశ్నించే గొంతునే కోసేశారు, ఎదురించే గుండెను నేలకూల్చారని పేర్కొన్నారు.  ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు , గిరిజన పెద్దలు, గిరిజన సంఘాలు, ఈ హత్యలను ఖండించాలని కోరారు.  బిక్కుబిక్కుమంటున్న గిరిజనం

బిక్కుబిక్కుమంటూ  దిగులుగా కూర్చున్న గిరిజనులు
అరకులోయ: విశాఖ ఏజెన్సీ, సరిహద్దు ఒడిశా ప్రాంతాలలో మావోయిస్టు పార్టీ నేతలు, సభ్యులు హల్‌చల్‌ చేస్తున్నారు. పోలీసులకు గిరిజనులు సహకరిస్తున్నారనే అనుమానాలతో గ్రామాలలో ప్రజా కోర్టులు, వెనువెంటనే శిక్షలు విధిస్తున్న మావోయిస్టుల చర్యలతో గిరిజనులు భీతిల్లుతున్నారు. ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒడిశా, ఏపీ పోలీసు యంత్రాంగం ఏవోబీలో మావోయిస్టుల కార్యకలాపాలను అడ్డుకట్ట వేయడంలో విజయవంతమైంది.∙ఎన్నికలు కూడా విశాఖ ఏజెన్సీలో ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసుశాఖ ఎంతో కృషి చేసింది. మావోయిస్టుల నుంచి ఎలాంటి హింసాత్మక సంఘటనలు లేకుండానే సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల తరువాత పోలీసు యంత్రాంగం మారుమూల ప్రాంతాలలో మావోయిస్టుల ఏరివేత చర్యలను దాదాపు నిలిపివేసిందనే ప్రచారం జరిగింది. కానీ మావోయిస్టులు మాత్రం తమ కార్యక్రమాలను ఏవోబీలో చాపకింద నీరులా విస్తృతం చేస్తున్నారు. ఏవోబీ వ్యాప్తంగా మావోయిస్టులు అధికంగా సంచరిస్తూ తరచూ గ్రామాలలో ప్రజాకోర్టులు నిర్వహించడం, పోలీసులకు సహకరిస్తున్నారనే అరోపణలతో ∙గిరిజనులను హెచ్చరించడం అవసరమైతే దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో  ఎక్కువయ్యాయి. ఒడిశా పోలీసు బలగాలు కూంబింగ్‌ చర్యలను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడం మావోయిస్టుల సంచారానికి కలిసోస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఏపీ పోలీసు బలగాలు కూడా అవుట్‌పోస్టులలో మకాం ఉన్నా ఏవోబీలో మావోయిస్టులు సంచరిస్తున్నారు.

వారోత్సవాలకు పది రోజుల ముందే..
కొయ్యూరు(పాడేరు): మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు ప్రారంభానికి పది రోజుల ముందు మావోయిస్టుల తమ ఉనికి చాటారు. వారిపై తిరుగుబాటు చేసిన ఇద్దరు గిరిజనులను హతమార్చారు. గడచిన పదిహేనేళ్లలో మావోల చేతిలో బలైనవారు 123 మంది. తాజాగా ఇద్దరిని హతమార్చడంతో మన్యం భయం గుప్పెట్లోకి వెళ్లిపోయింది. కొద్దిరోజుల కిందట మావోయిస్టులు పెదబయలు మండలంలో బొంగజంగి గ్రామానికి చెందిన పాంగి సత్తిబాబును చంపేశారు.దీనిపై మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. ఈ సంఘటన మరువక ముందే మావోయిస్టులు  హింసకు పాల్పడ్డారు. సత్తిబాబును హతమార్చడంతో గ్రామస్తులు భయపడి కలెక్టర్‌ వినయ్‌చంద్‌కు స్పందనలో ఫిర్యాదు చేశారు.అక్కడ ఉండలేమని తెలిపారు. తాజా ఘటనతో గిరిజనులు భయపడుతున్నారు. ఏటా మావోయిస్టులు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తారు.

పోలీసు ఇన్‌ఫార్మర్లే టార్గెట్‌
పోలీసులు, మావోయిస్టుల భయంతో ఇప్పటికే గ్రామాల నుంచి బయటకు వెళ్లకుండా ఇళ్లకే వందల సంఖ్యలో గిరిజనులు పరిమితమయ్యారు. తమ నివాసిత మారుమూల గ్రామాల నుంచి మండల కేంద్రాలకు కూడా రాలేని పరిస్థితిలో భయం భయంగానే కొంతమంది గిరిజనులు జీవిస్తున్నారు. మావోయిస్టు సానుభూతి పరులు, అనుబంధ సంఘాల ప్రతినిధుల లొంగుబాటు,అరెస్ట్‌ల వ్యూహంతో పోలీసుశాఖ పనిచేస్తుండగా,మావోయిస్టు పార్టీ మాత్రం పోలీసు ఇన్‌పార్మర్ల వ్యవస్థను వెలికి  తీస్తోంది.  

నిర్మానుష్యంగా కోరుకొండ
చింతపల్లి: మండలంలోని బలపం పంచాయతీ కోరుకొండ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉండేది. మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఎటువంటి సంఘటనలకు పాల్పడిన సురక్షిత ప్రాంతమైన కోరుకొండ ప్రాంతానికి వెళ్లి తలదాచుకునే వారు. పోలీసులు కూడా ఈ ప్రాంతానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టాలంటే గడగడలాడేవారు. ఎటుచూసిన మావోయిస్టుల మందుపాతరలు పోలీసు బలగాలకు స్వాగతం పలికేవి. 2014 అక్టోబర్‌ నుంచి పరిస్థితులు మారాయి. జి.మాడుగులకు చెందిన ఆధ్యాత్మిక గురువు సింహాచలంను అదుపులోకి తీసుకోవడంతో తిరుగుబాటు చేసిన గెమ్మెలి సంజీవరావును మావోలు హత్య చేయడం, ఆపై భక్తులు మావోలపై దాడి చేసిన ఇద్దర్ని చంపినప్పటి నుంచి  మావోయిస్టులు పట్టుకోల్పోయారు. అయితే తాజా ఘటనతో ఇక్కడ నిర్మానుష్య వాతావరణం నెలకొంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top