వివాహ వేడుకలో విషాదం

Man Murdered In Marriage Celebrations At Hyderabad - Sakshi

స్వల్ప విషయమై రేగిన వివాదం

కత్తితో దాడి.. యువకుడు మృతి

సాక్షి, విజయనగర్‌కాలనీ : వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కత్తిపోట్లకు గురైన ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ నాగం రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఆసిఫ్‌నగర్‌ జగదాంబనగర్‌లో నివసించే పులిపాటి నర్సింగ్‌రావు కుమారుడు కిశోర్‌ వివాహం ఈ నెల 15న సికింద్రాబాద్‌లో జరిగింది. వివాహ అనంతరం ఆదివారం నిర్వహించిన విందులో పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు పాల్గొన్నారు.

నర్సింగ్‌రావుకు కాటేదాన్‌లో కార్పెంటర్‌ కార్ఖానా ఉన్నది. అతని వద్ద టాటాఏసీ  ఆటోడ్రైవర్‌గా పనిచేసే వి.శ్రావణ్‌కుమార్‌(25)తో పాటు ఫర్నీచర్‌ పాలిష్‌ పనిచేసే చింటు కూడా వేడుకలో పాల్గొన్నారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్‌గా నమోదై ఉన్న జోషివాడి ప్రాంతానికి చెందిన భిక్షపతి విందుకు హాజరయ్యాడు. ఆ సమయంలో చింటు, భిక్షపతి మధ్య స్వల్ప విషయమై వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఇరువురి కొట్టుకున్నారు. దీంతో భిక్షపతి తన తమ్ముడు గణే‹Ù(32)కు ఫోన్‌ చేసి తనపై దాడిచేస్తున్నారని వెంటనే రావాల్సిందిగా కోరాడు.  

హాకీ స్టిక్, జాంబియాతో దాడి..
భిక్షపతి ద్వారా సమాచారం అందుకున్న తమ్ముడు గణేష్‌ ఆ సమయంలో  మద్యం సేవించి ఉన్నాడు. అన్న పిలుపుమేరకు హాకీ స్టిక్, జాంబియా (కత్తి)తో  రాగా అక్కడి నుంచి చింటు పరారయ్యాడు. కోపంతో రగిలిపోతున్న గణే‹Ùకు అదే బస్తీలో ఉంటున్న సాయిగణేష్‌ (24), ఆటోడ్రైవర్‌ శ్రావణ్‌కుమార్‌ పెళ్లి మండపంలో కనిపించడంతో మీరే చింటును తప్పించారంటూ అన్నదమ్ములిద్దరు కలిసి వారిపై దాడి చేశారు. దాడిలో సాయిగణేష్‌ స్వల్ప గాయాలతో తప్పించుకోగా శ్రవణ్‌కుమార్‌ను హాకీ స్టిక్‌తో తలపై తీవ్రంగా కొట్టడంతో అది విరిగిపోయింది.

అనంతరం జాంబియాతో ముఖం, ఛాతి, గొంతు తదితర శరీర భాగాలపై విచక్షణారహితంగా పొడవడంతో శ్రవణ్‌కుమార్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న శ్రవణ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు పోలీసుల సాయంతో వైద్య చికిత్స నిమిత్తం నాంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు ఉస్మానియాకు తీసుకు వెళ్లాలని సూచించారు. ఉస్మానియా వైద్యులు అతన్ని పరీక్షించిన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.  

అలుముకున్న విషాద ఛాయలు...  
శ్రవణ్‌కుమార్‌ కత్తిపోట్లతోపోయాడనే విషయం తెలుసుకున్న బంధుమిత్రులు పెద్ద ఎత్తున అతని ఇంటి వద్దకు చేరుకున్నారు. అందరితో చనువుగా ఉండే శ్రవణ్‌కుమార్‌ మృతిచెందడంతో  ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సంఘటన స్థలాన్ని అడిషనల్‌ డీసీపీ పూజిత, ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ డివిజన్‌ ఏసీపీ శివమారుతి ఏసీపీ వేణుగోపాల్, ఆసిఫ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగం రవీందర్, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్లు ఆకుల శ్రీనివాస్,  రాజేష్ల‌ష్‌తో పాటు క్లూస్‌టీం సంఘటన స్థలాన్ని పరిశీలించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం శ్రవణ్‌కుమార్‌ మృతిదేహానికి ఆసిఫ్‌నగర్‌ దేవునికుంట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top