
సంఘటన స్థలంలో కాలిపోయిన వాహనం.. (ఇన్‌సెట్లో మృతుడు వెంకటయ్య)
ఒకరిని హత్యచేసిన వ్యక్తి, భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు
నవాబుపేట(జడ్చర్ల): ఒకరిని హత్యచేసిన వ్యక్తి, భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం మండలంలోని పోమాల్ గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పోమాల్ గ్రామానికి చెందిన పిడుగు వెంకటయ్య(యాసూభు)(35) ఆదివారం రాత్రి పొలంవద్ద గేదెలకు పాలుపితికి బైక్‌పై క్యాన్‌లో ఇంటికి తీసుకువస్తుండగా, అప్పటికే కాపుకాసిన అదే గ్రామానికి కామారం యాదయ్య బైక్‌ను అడ్డగించాడు. అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో వెంకటయ్య పరుగు తీస్తూ గ్రామంలోకి చేరుకుని కిందపడిపోయాడు.
గ్రామస్తులు, బంధువులు గమనించి అతన్ని చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు సోమవారం మృతిచెందాడు. వెంకటయ్య చనిపోయాడని తెలియడంతో యాదయ్య(25) తీవ్ర భయానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం గ్రామ సమీపంలోని మర్రిచెట్టుకు ఉరి వేసుకు ని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు. పెట్రోల్ దాడికి పాతకక్షలే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు.