డబ్బులు ఇవ్వకుంటే పదేళ్లు జైల్లో పెట్టిస్తా

Man Held For Extortion Of Rs 75 Lakh From Doctor In Pune - Sakshi

పుణె: అడిగినంత డబ్బులు ముట్టజెప్పకపోతే మీ కొడుకును జైల్లో పెట్టిస్తానంటూ ఓ వ్యక్తి వైద్యుడిపై బెదిరింపులకు పాల్పడ్డిన ఘటన పుణెలో చోటు చేసుకుంది. అతని ప్రవర్తనతో విసిని వేసారిపోయిన వైద్యుడు పోలీసులను ఆశ్రయించగా.. వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది అక్టోబర్‌లో ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు జరిగిన ఘోరంలో ఓ డాక్టర్‌ కుమారుడి భాగస్వామ్యం ఉన్నట్లు పేర్కొంది. పేషెంటుగా ఆస్పత్రికి వెళ్తే తనపై దారుణానికి ఒడిగట్టారంది. దీనిపై పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. 

ఇదిలా ఉండగా రూ.1.3 కోట్లు ఇస్తే ఈ కేసు సెటిల్‌ చేస్తానని ఓ వ్యక్తి సదరు డాక్టర్‌తో సంప్రదింపులు జరిపాడు. డబ్బులు ఇవ్వకపోతే మీ కుమారుడికి సుమారు పది సంవత్సరాల జైలు శిక్ష పడేలా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో వైద్యుడు రూ.54 లక్షల విలువైన చెక్‌, రూ.21 లక్షల నగదు నిందితుడికి అందించాడు. ఈ క్రమంలో అతడు మరో రూ.55 లక్షలు డిమాండ్‌ చేశాడు. దీంతో సదరు వైద్యుడు ఫిబ్రవరి 9న పోలీసులను ఆశ్రయించాడు. ఆ మహిళ కావాలనే తప్పుడు ఫిర్యాదు చేసిందని పేర్కొన్నాడు.

కేవలం ఆసుపత్రి ఫీజు చెల్లించే దగ్గర మాత్రమే ఆమెతో వివాదం తలెత్తిందని తెలిపాడు. అంతేకాక మహిళ దళిత వర్గానికి చెందినవారు కావడంతో, ఎలాగైనా తన కొడుకును మైనారిటీ చట్టం కింద పదేండ్ల జైలు శిక్షతో పాటు బెయిల్‌ రాకుండా చేస్తానని దుండగుడు బెదిరింపులకు దిగుతున్నారని తెలిపాడు. దీంతో పోలీసులు నిందితుడిని పట్టుకుని గురువారం కోర్టు ముందు హాజరుపర్చారు. విచారణ చేపట్టిన కోర్టు నిందితుడిని రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top