ముగ్గురిని పెళ్లాడి...మరో పెళ్లికి సిద్ధం | Man Escaped After Three Marriages | Sakshi
Sakshi News home page

బయటపడిన నిత్య పెళ్లికొడుకు బాగోతం

Apr 11 2018 12:25 PM | Updated on Oct 17 2018 6:06 PM

Man Escaped After Three Marriages  - Sakshi

పవన్‌ ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న మహిళాసంఘ సభ్యులు

నిజామాబాద్‌ క్రైం(నిజామాబాద్‌ అర్బన్‌): ఒకరికి తెలియకుండా ఒకరిని.. ముగ్గురిని పెళ్లాడాడు.  మరో అమ్మాయిని కూడా పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడు. ఈ పెళ్లిళ్లకు పెద్దల సహకారం కూడా ఉండడంతో దర్జాగా పెళ్లాడేశాడు. నాలుగో పెళ్లికి వచ్చేసరికి విషయం తెలియడంతో తండ్రితో సహా జారుకున్నాడు. నగరంలోని ఐద్వా సంఘం సహకారంతో సదరు నిత్యపెళ్లికొడుకు ఇంటి ఎదుట ఆయన భార్యలు ధర్నాకు దిగారు. నగరంలో రాజీవ్‌నగర్‌(దుబ్బా)కు పవన్‌కుమార్‌ ఛత్రే బాగోతమిది. వివరాల్లోకి వెళ్తే.. ఈ పవన్‌కుమార్‌ ఛత్రే పెళ్లిళ్ల ప్రస్థానం మొదట మహారాష్ట్రలో ప్రారంభమైంది.

2010లో మహారాష్ట్రలోని టెంబర్‌ ప్రాంతానికి చెందిన ఐలాబాయితో జరిగింది. పెళ్లి తర్వాత నిజామాబాద్‌కు మకాం మార్చి రెండేళ్లు కాపురం చేసి అనంతరం నాందేడ్‌ వెళ్లిపోయారు. అనంతరం పవన్‌కుమార్‌ 2015లో నిర్మల్‌ జిల్లా గొల్లమాడ గ్రామానికి చెందిన దీపను పెళ్లి చేసుకున్న అతడు.. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో కాపురం పెట్టాడు.  2017లో విజయవాడ  చెన్నూర్‌ గ్రామానికి చెందిన రాణిని పెండ్లి చేసుకుని, ఆమెను చెన్నూర్‌లో ఉంచాడు. ఇటీవలే కేరళకు చెందిన యువతిని నాలుగో వివాహం చేసుకొనేందుకు సిద్ధమయ్యాడు.

డొంక కదిలిందిలా..
అయితే ఐలాభాయిని పవన్‌కుమార్‌ వేధిస్తుంటే 3వ టౌన్‌లో ఫిర్యాదు చేసి అనంతరం విడాకుల కోసం కోర్టులో దావా వేసింది. అనంతరం అత్తగారింటికి వెళ్లగా భర్తకు మరో రెండు వివాహాలు జరిగినట్లు స్థానికుల ద్వారా తెలుసుకుని షాక్‌కు గురైంది. తనకు జరిగిన అన్యాయంపై ఐలాభాయి ఐద్వా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బని లతను ఆశ్రయించింది. దీంతో ఆమె పవన్‌ గురించి ఆరా తీయగా, ఈ పెళ్లిళ్ల బాగోతం బయటపడింది. దీంతో ఐలాబాయి, దీప మంగళవారం ఐద్వా ప్రతినిధులతో కలిసి భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగారు.

బాధితులు ధర్నాకు దిగిన విషయాన్ని తెలుసుకున్న మూడవ టౌన్‌ పోలీసులు అక్కడకు చేరుకుని, వివరాలు ఆరా తీశారు. కాగా, విజయవాడలో ఉంటున్న మూడవ భార్య రాణి నిజామాబాద్‌కు బయలుదేరినట్లు సమాచారం. ప్రస్తుతం పవన్‌కుమార్, అతని తండ్రి చంద్రకాంత్‌ పరారీ కాగా, తల్లి పద్మావతి ఇంట్లోనే ఉంది. బాధితుల నుంచి సుమారు రూ.40లక్షల వరకు వసూలు చేశాడని, ఆ డబ్బు రాబడితే బాధితులకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని సబ్బని లత పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement