ప్రాంక్‌ కాల్‌.. ఆపై కటకటాల పాలు..

A Man Arrested In Prank Call Over Chemical Attack On Narendra Modi - Sakshi

ముంబై : ప్రధాని నరేంద్ర మోదీపై దాడులు జరుగుతాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ప్రాంక్‌ కాల్‌ చేసిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ముంబై పోలీసులు సోమవారం వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన 22 ఏళ్ల కాశీనాథ్‌ మండల్‌ ముంబైలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) కంట్రోల్‌ రూమ్‌ కాంటాక్ట్‌ నెంబర్‌ సేకరించాడు. ఆపై ఎన్‌ఎస్‌జీ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి ప్రధాని మోదీపై దాడి జరుగుతుందని సమాచారం ఇచ్చాడు.

కెమికల్‌ దాడి జరిగే అవకాశం ఉందని, తన వద్ద సమాచారం ఉందని ఎన్‌ఎస్‌జీని నమ్మించాడు. ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా కాశీనాథ్‌ను సెంట్రల్‌ ముంబైలోని డీబీ మార్గ్‌ పోలీసులు జూలై 27న అదుపులోకి తీసుకున్నారు. సూరత్‌కు వెళ్లే రైలులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. నరేంద్ర మోదీని కలుసుకోవడమే తన ఉద్దేశమని కాశీనాథ్‌ విచారణలో వెల్లడించాడు. ఇటీవల జార్ఖండ్‌లో జరిగిన నక్సల్స్‌ దాడిలో తన స్నేహితుడు చనిపోయాడని.. ఈ విషయంపై ప్రధాని మోదీని కలుసుకుని మాట్లాడాలని భావించినట్లు నిందితుడు పేర్కొన్నాడు. నిందితుడిని నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top