టర్కీ తీసుకెళ్లి తస్కరించారు

Man Arrest in Kidney Racket Case Hyderabad - Sakshi

కిడ్నీ రాకెట్‌ కేసులో మరో నిందితుడి అరెస్టు

ఎంఈఏలో స్టాంపింగ్స్‌ చేయించిన సందీప్‌

నకిలీ డాక్యుమెంట్లు అని తెలిసీ సహకారం

ఉత్తరప్రదేశ్‌లో పట్టుకున్న రాచకొండ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ కేసులో రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మరో నిందితుడిని పట్టుకున్నారు. ఈ ముఠా సృష్టించిన నకిలీ సర్టిఫికెట్లపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) నుంచి స్టాంపింగ్‌ చేయించిన ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌ వాసి సందీప్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు కమిషనర్‌ మహేష్‌ మురళీధర్‌ భగవత్‌ గురువారం వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ముగ్గురిని కటకటాల్లోకి పంపిన విషయం విదితమే. ఢిల్లీలో స్థిరపడిన భోపాల్‌ వాసి అమ్రిష్‌ మెడికల్‌ టూరిజం ఏజెంట్‌గా పని చేసేవాడు. మొదట్లో చట్ట వ్యతిరేకమైన ‘అద్దెకు తల్లులు’ సరోగసీ నుంచి మొదలెట్టి ఆ తరవాత మానవ అవయవాల మార్పిడి వ్యాపారం వైపు మళ్లాడు. పలువురు డాక్టర్లు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, ప్రభుత్వ అధికారులు, ఏజెంట్లు, బ్రోకర్లతో కుమ్మక్కై దందాకు పాల్పడుతున్నాడు. డబ్బు అవసరమున్న వారిని గుర్తించి వారి అవయవాలు మార్పిడి చేసి డబ్బు ఇవ్వకుండా మోసం చేసేవాడు. ఈ క్రమంలోనే ఇతడికి మరో ఇద్దరితో పరిచయం ఏర్పడింది. ముగ్గురూ ముఠాగా ఏర్పడి కిడ్నీల మార్పిడి దందా మొదలెట్టారు. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు రోగుల నుంచి వసూలు చేసేవారు.

రోగులు, దాతలను శ్రీలంక రాజధాని కొలంబో, ఈజిప్ట్‌లోని కైరో, టర్కీలోని ఇజ్మిర్‌ ప్రాంతాల్లోని వివిధ ఆస్పత్రులకు తీసుకెళ్లి 40 కిడ్నీల క్రయవిక్రయాలు చేపట్టారు. వీటిలో అత్యధికంగా బోగస్‌ పత్రాలతో అక్రమంగా జరిగినవే. వీరిలో ఓ నిందితుడు ఫేస్‌బుక్‌లో రోహన్‌ మాలిక్‌ పేరుతో ఖాతా తెరిచి, కిడ్నీ అవసరముంటూ పోస్టు చేశాడు. దీనిని చూసిన రాచకొండ కమిషనరేట్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అతడిని సంప్రదించాడు. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక ముఠా సభ్యుడు వాట్సాప్‌ ద్వారా ఇతడితో సంప్రదింపులు జరిపి కిడ్నీకి రూ.20 లక్షల వెలకట్టాడు. అతడు  అంగీకరించడంతో ఢిల్లీకి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన బాధితుడిని నోయిడాలోని ఓ హోటల్‌లో ఉంచి వైద్య పరీక్షలు చేయించారు.

బాధితుడు రోగి బంధువుగా నకిలీ సర్టిఫికెట్‌ సృష్టించారు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు స్టాంపింగ్‌ నిమిత్తం దాఖలు చేశారు. ఈ వ్యవహారాన్ని న్యూ ఢిల్లీలోని రోఖాదియా ఓవర్సీస్‌ కంపెనీకి చెందిన సందీ‹ప్‌ కుమార్‌ పర్యవేక్షించాడు. పత్రాలు నకిలీవని తెలిసీ స్టాంపింగ్‌ పూర్తి చేయించాడు. ఇలా పొందిన మెడికల్‌ వీసాపై బాధితుడిని టర్కీకి తీసుకెళ్లారు. అక్కడే అతడిని మోసం చేసి, బెదిరించి ఆపరేషన్‌ ద్వారా కిడ్నీ ‘తస్కరించారు’. అతికష్టమ్మీద నగరానికి తిరిగి వచ్చిన బాధితుడు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ హరినాథ్‌ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అమ్రిష్‌ సహా ఇద్దరిని గత నెలలో అరెస్టు చేశారు. ఎంఈఏలో తమ నకిలీ పత్రాలకు స్టాంపింగ్‌ పూర్తి చేయించడానికి తాము సందీప్‌ కుమార్‌కు రూ.10 వేల చొప్పున ఇచ్చే వారిమని బయటపెట్టారు. దీంతో అతడి కోసం గాలించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో పట్టుకున్నారు. అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. ఈ గ్యాంగ్‌ దుబాయ్, వియత్నాం, చైనా, సింగపూర్, ఫిలీప్పిన్స్, బ్యాంకాక్, ఇండోనేషియా, మెక్సికోలకూ వెళ్లి వచ్చినట్లు తేలింది. దీంతో అక్కడా ఇలాంటి దందాలే చేశారా? అనే కోణంలో ఆరా తీçస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top