మృత్యు మలుపులు

Mahabubnagar Road Accident Crime News - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం: కళ్లు మూసి తెరిచేలోగానే.. ఘోరాలు జరిగిపోతున్నాయి.. రెప్పపాటులోనే ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.. రహ దారి పొడవునా నెత్తుటేరులు పారుతున్నాయి.. క్షతగాత్రుల ఆర్తనాదాలు, మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటుతున్నాయి.. మహబూబ్‌నగర్‌ నుంచి రాయచూర్‌ మధ్య ఉన్న రహదారిపై ఈ పరిస్థితులు నిత్యకృత్యమయ్యాయి.. ఇలాం టి ఘటనలు ప్రతిరోజు చోటుచేసుకుంటున్నా.. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంతో ఈ రహదారి మరోసారి తెరపైకి వచ్చింది.. మైసమ్మ మలుపు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే.. ఈ ప్రమాదానికి గల కారణాన్ని ఓ పరిశీలిస్తే రాత్రివేళలో ఆ మలుపు దగ్గర రెడ్‌లైట్‌ ఇండిగేటర్‌ లేకపోవడంతో చీకటిలో ముందు వచ్చే లారీ కనిపించక టాటా సుమోను ఓవర్‌టెక్‌ చేసి ముందుకు వెళ్లిన ఇండికా కారు.. లారీని ఢీకొట్టింది.. 

ఇవిగో ఘటనలు 
మహబూబ్‌నగర్‌ నుంచి దేవరకద్ర వైపు వెళ్తున్న రహదారిపై గతంలో చాలా ప్రమాదాలు జరిగాయి. వాటిలో ధర్మాపూర్‌ క్రాస్‌రోడ్‌ దగ్గర మహబూబ్‌నగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న సంఘటనలో ఆరు మంది మృత్యువాతపడ్డారు. అలాగే చౌదర్‌పల్లి స్టేజీ దగ్గర ట్రాక్టర్‌ ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందారు. మన్యంకొండ స్టేజీ దగ్గర కారు బోల్తాపడి ముగ్గురు, ఓబ్లాయిపల్లి దగ్గర కారు, ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు, రాంరెడ్డిగూడెం దగ్గర బోయపల్లికి చెందిన ఓ కుటుంబం, ఆటో, జీపు ఢీకోనడంతో ఆటోలో ఉన్న ఓ బాబు, ఓ వ్యక్తి మృతిచెందారు.

న్యూ ఇయర్‌ వేడుకల్లో ముగ్గురు బీటెక్‌ విద్యార్థులు ధర్మాపూర్‌ క్రాస్‌ రోడ్‌ దగ్గర ప్రమాదానికి గురై మృతిచెందారు. ఆగస్టులో జరిగిన ఆర్టీసీ బస్సు, ఆటో ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి, ఓ వ్యక్తి మృత్యువాతపడ్డారు. తాజాగా మంగళవారం రాత్రి జరిగిన లారీ, రెండు కార్ల ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జడ్చర్ల నుంచి రాయచూర్‌ వరకు 167వ జాతీయ రహదారిగా మార్పు చెందిన తర్వాత ఈ రహదారిపై ఏ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆర్‌అండ్‌బీ అధికారులు ఈ రోడ్డుతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొస్తున్నారు. జాతీయ రహదారి భద్రత అధికారులు స్థానికంగా కనిపించడం లేదు. దీంతో రోడ్డు పర్యవేక్షణ అస్తవ్యస్తంగా మారింది. 

కనిపించని సూచికలు, హెచ్చరికలు 
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్లపై వాహనాల వేగాన్ని క్రమబద్ధీకరించేందుకు రేడియం స్టిక్కర్లు అతికించి మొబైల్‌ బారికేడ్లు, సైన్‌ బోర్డులను ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసిన బారికేడ్లు కింద పడిపోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. రోడ్డు మరమ్మతు జరుగుతున్న దగ్గర.. గుంతలు ఉన్న చోట సూచికలు ఏర్పాటు చేయాలి. రోడ్ల ప్రమాదాల గురించి హెచ్చరిస్తూ రోడ్ల పక్కనే హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి. రోడ్ల సామర్థ్యం మేరకు ఎంత వేగంగా వెళ్లాలో తెలిపే సూచికలు ప్రమాదాలు, వర్షం కారణంగా కిందపడిపోతే పునరుద్ధరించాలి. 

మహబూబ్‌నగర్‌ నుంచి రాయిచూర్‌ మధ్య ఉన్న రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలకు గల కారణాలను పరిశీలిస్తే.. మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, రహదారిపై అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అనే విషయం తేటతెల్లమవుతుంది. ముఖ్యంగా రహదారిపై ఉన్న మూలమలుపులు, విశాలంగా లేని రోడ్డు కారణంగా ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. ద్విచక్రవాహనాలతోపాటు ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు, బస్సులు ఇతర భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దారుణమేమిటంటే కాలినడకన వెళ్తున్న వారు కూడా ప్రమాదాలకు గురవుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఎదురెదురుగా ద్విచక్రవాహనాలు ఢీకొని ప్రమాదాలు చోటుచేసుకోవడం దాదాపు ఇక్కడే చూస్తుంటాం అనడంలో అతిశయోక్తి లేదు. 

నరకప్రాయం.. అరగంట ప్రయాణం 
మహబూబ్‌నగర్‌ వన్‌టౌన్‌ పరదేశీనాయుడు చౌరస్తా నుంచి దేవరకద్ర వరకు అత్యంత ప్ర మాదకరమైన మూల మలుపులు 12 ఉండ గా, 18 చోట్ల ఎగుడు దిగుడుగా రోడ్డు కనిపిస్తోంది. వన్‌టౌన్‌ చౌరస్తా నుంచి దేవరకద్రకు 23 కి.మీ. అంటే కేవలం 30 నిమిషాల ప్ర యాణం.. ఈ అరగంట సమయంలో ప్రయా ణికులకు నరకం చూపుతుంది. మొదటి మ లుపు రాజీవ్‌ గృహకల్ప దగ్గర ఎదురవగా.. ఇక్కడ ఉండే మలుపు అత్యంత ప్రమాదకరం గా ఉంటుంది.

అక్కడి నుంచి కొంత ముందు కు వెళ్లడంతో మైసమ్మ దగ్గర ఉన్న మరో మ లుపు దగ్గర అవతలి వాహనాలు దగ్గరకు వెళ్లే వరకు కనిపించవు. అక్కడి నుంచి కొంత ముందుకు వెళ్తే ఆల్‌మదీనా కళాళాల దగ్గర మరోమలుపు దర్శనమిస్తుంది. అదేవిధంగా మరి కొంత దూరంలో పెట్రోల్‌ బంకు ఎదుట ధర్మాపూర్‌ సమీపం లో ఉన్న మలుపు ఈ రోడ్డులోనే అత్యంత ప్ర మాదకరమైంది. ఇక్కడ జరిగినన్ని ప్రమాదా లు మరెక్కడా జరిగి ఉండవు. అలాగే జేపీఎన్‌సీఈ కళాశాల దగ్గర మరో మలుపు, కోడూ రు– ఓబ్లాయిపల్లి మధ్యలో మరో అత్యంత ప్రమాదకరమైన మలుపు వస్తోంది. కేవలం ఈ మలుపుల దగ్గర గతంలో చూసుకుంటే అత్యంత దారుణమైన ప్రమాదాలు జరగడం గమనార్హం. 

కుటుంబాలు చిన్నాభిన్నం 

రహదారి ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, మృతుల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. గాయాలతో బయటపడిన వారు ఎక్కువ సంఖ్యలో వికలాంగులు అవుతున్నారు. వారిలో కొంతమంది ఏళ్ల తరబడి మంచానికే పరిమితమవుతున్నారు. కొన్ని సంఘటనల్లో కుటుంబ సభ్యులంతా మృత్యుపాలవుతున్నారు. భర్తను కోల్పోయిన భార్య తమ పిల్లలను సాకుతూ ఒంటరిగా కుటుంబాన్ని పోషించుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఇవి ప్రమాదానికి గురైన కుటుంబాల్లో కనిపించే విషాధ ఘటనలు. ప్రమాదానికి కారణమైన వ్యక్తుల బాధలు మరోలా ఉంటున్నాయి. ఆర్థికంగా చితికిపోతున్నారు. మరికొందరు జైలుకు కూడా వెళ్తున్నారు. 

డివైడర్‌ ఏర్పాటు చేయాలి 
రాయచూర్‌ రోడ్డు వెడల్పు అయిన తర్వాత వాహనాల వేగం చాలా పెరుగుతుంది. ఈ క్రమంలో ఎదురెదురుగా వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. రాత్రివేళలో రోడ్డు వెంబడి విద్యుత్‌ దీపాలు లేకపోవడంతో లైటింగ్‌ తక్కువగా ఉండే వాహనాలకు ముందు వాహనం కనిపించదు. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతుంటాయి. పాలమూరు యూనివర్సిటీ నుంచి మన్యంకొండ వరకు రోడ్డు మధ్యలో డివైడర్‌ ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలను కొంత వరకు తగ్గించవచ్చు. – శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్‌ ఎంవీఐ, మహబూబ్‌నగర్‌ 

ఈ ప్రాంతాలే ప్రమాదకరం

మహబూబ్‌నగర్‌ నుంచి దేవరకద్ర వైపు వెళ్తున్న అంతర్రాష్ట్ర రహదారిపై నిత్యం ప్ర మాదాలు జరిగే స్థలాలు 10 వరకు ఉంటా యి. వాటిలో ముఖ్యమైన ప్రదేశాలు రాజీ వ్‌ గృహకల్ప మలుపు, మైసమ్మ మలుపు, ఆల్‌మదీనా కళాశాల, ధర్మాపూర్‌ క్రాస్‌రో డ్, ధర్మాపూర్‌ సమీపంలో, చౌదర్‌పల్లి గేట్‌ ఎదుట, జేపీఎన్‌సీఈ దగ్గర, కోడూర్, ఓ బ్లాయిపల్లి మలుపు, దేవరకద్ర పెద్ద వంతెనపై ప్రమాదాలు జరుగుతుంటాయి.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top