కడుపులో మగపిల్లాడుంటేనే పెళ్లి | Sakshi
Sakshi News home page

కడుపులో మగపిల్లాడుంటేనే పెళ్లి

Published Fri, Oct 13 2017 6:48 AM

lover cheating girlfriend to girl child pregnancy in scanning

ప్రేమ పేరుతో ఓ యువకుడు బాలికను నమ్మించి గర్భం చేశాడు. తీరా పెళ్లి విషయం వచ్చేసరికి కడుపులో మగపిల్లాడుంటే చేసుకుంటానని చెప్పాడు. అయితే స్కానింగ్‌లో ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్‌ చేయించాడు. తర్వాత మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. తనకు జరిగిన మోసం తెలుసుకుని ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం యువకుడు కటకటాలు లెక్కిస్తుండగా, స్కానింగ్‌ చేసిన వైద్యురాలు, ఆసుపత్రి నిర్వాహకులు పరారీలో ఉన్నారు. వివరాల్లోకెళితే..

కర్నూలు(హాస్పిటల్‌): తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16) అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. ఆ బాలిక 8వ తరగతి చదువుతున్న సమయంలో నవాబ్‌పేటకు చెందిన ఎలక్ట్రీషియన్‌ శాకమోని శివకుమార్‌(19) పరిచయమయ్యాడు. తరచూ పాఠశాలకు ఎలక్ట్రికల్‌ పనులకు వెళ్లి ఆ బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమలో దించాడు. అనంతరం కొద్దిరోజులకు వారిద్దరి మధ్య చనువు మరింత పెరిగి శారీరకంగా దగ్గరయ్యారు. కాగా.. ఆ యువకుడితో బాలిక తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటంతో పాఠశాల నుంచి టీసీ ఇచ్చి ఇంటికి పంపించారు.

కొన్నిరోజులకు బాలిక గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోవాలని యువకుడిపై  ఒత్తిడి పెంచింది.  కడుపులో మగపిల్లాడు ఉంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. స్థానిక ఆర్‌ఎంపీల సూచన మేరకు బాలికను కర్నూలులోని కొత్తబస్టాండ్‌ సమీపంలో ఉన్న రక్ష హాస్పిటల్‌లో డాక్టర్‌ మహేశ్వరికి చూపించాడు. స్కానింగ్‌ చేసిన అనంతరం కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్‌ చేయించాడు. అనంతరం బాలికకు ఫోన్‌ చేయడం మానేశాడు. మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న బాలిక నవాబ్‌పేట పోలీస్‌స్టేషన్‌లో గత నెల 29న ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడితో పాటు వైద్యురాలు డాక్టర్‌ మహేశ్వరి, రక్ష ఆసుపత్రి యాజమాన్యంపై ఐపీసీ సెక్షన్‌ 376(2)(ఎన్‌), 313 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం డాక్టర్‌ మహేశ్వరితో పాటు రక్ష ఆసుపత్రి నిర్వాహకులు పరారీలో ఉన్నారు. 

Advertisement
Advertisement