ఆటోను ఢీకొట్టిన లారీ 

Lorry and auto was collided  - Sakshi

ఆరుగురు దుర్మరణం..మరో ఇద్దరికి గాయాలు 

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో ఘటన 

మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు 

చిలుకూరు: వారంతా కోదాడలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వచ్చారు. అది ముగియగానే జాన్‌పహాడ్‌ దర్గాను దర్శించుకుని రాత్రి హుజూర్‌నగర్‌లో ఉన్న మరో బంధువు ఇంట్లో బస చేశారు. ఉదయం అక్కడినుంచి సొంత ప్రాంతానికి వెళ్లాలంటే కోదాడకు రావాలి. దీంతో హుజూర్‌నగర్‌నుంచి కోదాడకు ఓ ఆటో మాట్లాడుకుని బయలుదేరారు. మార్గమధ్యలోకి రాగానే ఆటో వేగంగా ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు షేక్‌ అఫ్జల్‌పాషా (48), గౌసియాబేగం (40), మహమూదాబేగం (35), మహిన్‌ (15), ముస్కాన్‌ (12), షేక్‌ మహబూ బ్‌ పాషా (40) మృతిచెందారు. జాకీర్‌పాషా, ఆటో డ్రైవర్‌ నాగుల్‌ మీరాకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామ శివారులో శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. 

ఫంక్షన్‌కు వచ్చి.. 
కుటుంబ పెద్ద అయిన షేక్‌ అఫ్జల్‌ పాషా, ఆయన భార్య గౌసియా బేగం, తమ్ముడు షేక్‌ మహబూబ్‌ పాషా, తమ్ముడి భార్య మహమూదాబేగం, తమ్ముడి కుమార్తెలు మహిన్, ముస్కాన్, ఆయన కొడుకు జాకీర్‌పాషాలు సూర్యాపేట జిల్లా కోదాడలో ఉంటున్న తన చెల్లెలు అక్తర్‌బేగం ఇంట్లో ఫంక్షన్‌ కోసం బుధవారం వచ్చారు. ఫంక్షన్‌ పూర్తికాగానే హుజూర్‌నగర్‌లో ఉంటున్న అఫ్జల్‌ పాషా చిన్న తమ్ము డు యాకుబ్‌ ఇంటికి వెళ్లారు. అ రోజు రాత్రి అక్కడే ఉండి గురువారం ఉదయం జాన్‌పహాడ్‌ దర్గాకు వెళ్లారు. అదే రోజు రాత్రి 7 గంటలకు తిరిగి హుజూర్‌నగర్‌కు చేరుకున్నారు. రాత్రి సమయంలో వెళ్లడం ఇబ్బంది అనుకుని అక్కడే నిద్రపోయారు. ఉదయం 6 గంటలకు తమ స్వగ్రామానికి బయలుదేరారు. హుజూర్‌ నగర్‌ నుంచి కోదాడ వచ్చేందుకు లోకల్‌ ఆటో మాట్లాడుకున్నారు.

కోదాడకు వస్తుండగా చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామ శివారులోకి రాగానే ఆటో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో షేక్‌ అఫ్జల్‌పాషా, గౌసియాబేగం, మహమూదాబేగం, మహిన్‌లకు తీవ్ర గాయా లు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రగాయాలైన ముస్కాన్, షేక్‌ మహబూబ్‌ పాషా, ఆటోడ్రైవ ర్‌ నాగుల్‌ మీరాలను హుజూర్‌నగర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా ముస్కాన్‌ మార్గమధ్యలో చనిపోయింది. మహబూబ్‌ పాషా, డ్రైవర్‌ను మెరుగైన చికిత్స అక్కడినుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహబూబ్‌ పాషా మృతిచెందాడు. జాకీర్‌ పాషా, ఆటోడ్రైవర్‌ చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను శవపరీక్ష అనంతరం బంధువులకు అందజేశారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు, డీ ఎస్పీ సుదర్శన్‌రెడ్డి, సీఐలు రవి, శ్రీనివాస్‌రెడ్డిలు పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top