మాజీ కేంద్రమంత్రిపై లైంగిక ఆరోపణలు

Law student accuses politician of sexual harassment goes missing - Sakshi

బీజేపీ మాజీ కేంద్రమంత్రి స్వామి చిన్మయానంద్‌పై  లైంగిక ఆరోపణలు

‘చాలామంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు’ - బాధితురాలి  ఫేస్‌బుక్‌ లైవ్‌ వీడియో వైరల్‌ 

కనిపించకుండా పోయిన బాధితురాలు

సాక్షి, లక్నో: కేంద్ర హోంశాఖ మాజీ సహాయమంత్రి స్వామి చిన్మయానంద్‌పై మరోసారి లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. షాజహన్‌పూర్‌కు చెందిన లా విద్యార్థిని  ఆ కాలేజీ డైరెక్టర్‌ కూడా అయిన చిన్మయానంద్‌పై  చేసిన ఆరోపణలు  కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే చాలామంది అమ్మాయిల జీవితం నాశనం చేశాడు. తనను కూడా బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ ఎల్‌ఎల్‌ఎం (పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లా) విద్యార్థిని ఫేస్‌బుక్‌ లైవ్‌ చేసింది.  ఆ సన్యాసి రూపంలో  ఉన్న ఆయన పోలీసు ఉన్నతాధికారులు తన  చెప్పు చేతల్లో పెట్టుకుని, తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరిస్తూ వుంటాడని వాపోయింది. అయితే తనకు, తన కుటుంబానికి ముప్పు ఉందని కూడా కన్నీటి పర్యంతమైంది. దీనికి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోవాని, తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ వీడియో  సోషల్‌ మీడియాలో వైరల్‌  కావడంతో   ప్రస్తుతం (శనివారం నుంచి) ఆమె కనిపించకుండా పోయింది.  దీంతో ఆమె భద్రతపై తీవ్ర ఆందోళన  నెలకొంది.  ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్‌లోని స్వామి సుఖదేవానంద న్యాయ కళాశాలలో బాధిత విద్యార్థిని చివరి సంవత్సరం చదువుతోంది. 

మరోవైపు కాలేజీ హాస్టల్నుంచి తమ కుమార్తె అదృశ్యమైందనీ, చిన్మయానందే దీనికి కారణమంటూ కుటుంబ సభ్యులు షాజహన్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎప్పుడూ తనతో చెప్పలేదనీ, అయితే రక్షాబంధన్‌కు ఇంటికి వచ్చినపుడు ఆందోళనగా కనిపించిందని ఆమె తండ్రి  చెప్పారు. ఇది ఇలా వుంటే  రూ .5 కోట్లు డిమాండ్‌ చేస్తూ గుర్తు తెలియని వ్యక్తులనుంచి కాల్‌ వచ్చిందంటూ స్వామి చిన్మయానంద్ మద్దతుదారులు, కాలేజీ యాజమాన్యం కూడా కౌంటర్ ఫిర్యాదు చేశారు.  ఈ రెండు ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

కాగా ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన చిన్మయానంద్‌ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో (1999-2004)  కేంద్రమంత్రిగా ఉన్నారు.  అఇయతే, 2011 నవంబరులో ఆయన ఆశ్రమంలోని యువతి ఆరోపణల నేపథ్యంలో దాడి, రేప్, బలవంతం అబార్షన్, హత్యాప్రయత్నం కేసులు నమోదయ్యాయి. అయితే  ఏడేళ్ల తరువాత గత ఏడాది ఏప్రిల్‌లో ఈ కేసును ఎత్తివేస్తూ యోగి సర్కారు సంచలన నిర్ణయం తీసుకోగా, దీనికి వ్యతిరేకంగా బాధితురాలు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు  రాసిన సంగతి తెలిసిందే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top