రంగమ్మ.. దొంగమ్మ..

Lady Thief Arrested - Sakshi

బస్సులు, ఆటోల్లో మహిళలే ఆమెకు టార్గెట్‌

బంగారు నగలు, నగదు కాజేసే మాయ ‘లేడీ’ అరెస్ట్‌

అమలాపురం టౌన్‌ : బస్సులు, ఆటోల్లో ప్రయాణించే మహిళల బ్యాగ్‌ల్లో నగలు, నగదు చాకచక్యంగా నొక్కేసే నైపుణ్యం ఆమెది. బస్సులు, ఆటోల్లో కిక్కిరిసి ప్రయాణించే మహిళలను టార్గెట్‌ చేస్తుంది. బస్సు స్టాపుల్లో, ముఖ్య కూడళ్లలో ఓ సాధారణ ప్రయాణికురాలిగా నిలబడి మహిళా ప్రయాణికుల కదలికలను కనిపెడుతూ వారి బ్యాగ్‌లను, వారి కూడా మగవారు ఉన్నారా? లేదా?.. ఇలాంటి పరిస్థితులున్న మహిళా ప్రయాణికులను ఎంచుకుని వారితో బస్సులో..

ఆటోలో ప్రయాణించి అదును చూసి బ్యాగ్‌లను బ్లేడ్‌తో కట్‌ చేసి కాజేస్తుంది. ఈ  మాయలేడీని అమలాపురం పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఆమె వివరాలను పట్టణ సీఐ సీహెచ్‌ శ్రీరామకోటేశ్వరరావు శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. గోకవరం మండల శివారు సంజయ్‌ కాలనీకి చెందిన హంసపరుగుల రంగమ్మ అనే రంగను పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఆమె వద్ద రూ.రెండు లక్షల విలువైన 72 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు రంగమ్మ జిల్లాలో పలుచోట్ల ఈ తరహా నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించారు. నిందితురాలు రంగమ్మను, ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు నగలను విలేకర్ల ముందు ప్రవేశపెట్టారు. గత సంవత్సరం ఆగస్టు 17న మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామానికి చెందిన గెద్డాడ లక్ష్మీ భవాని బస్సులో అమలాపురం ప్రయాణిస్తున్న సమయంలో ఆమె బ్యాగ్‌లో నగలతో దాచుకున్న చిన్న సంచిని చాకచక్యంగా కాజేసి తర్వాత స్టేజ్‌లో దిగిపోయింది.

అయితే అప్పట్లో బాధిత మహిళ తన పక్కనే కూర్చున్న ప్రయాణికురాలిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు కొన్ని ఆనవాళ్లతో ఫిర్యాదు చేసింది. పక్కన కూర్చున్న అనుమానిత మహిళ పొట్టిగా, లావుగా ఉంటుందని, నడుముపై పెద్ద పుట్టి మచ్చ ఉంటుందని పోలీసులకు ఆమె గుర్తులు చెప్పింది. బాధితురాలు ఇచ్చిన ఆధారాలతో అప్పటి నుంచి నిఘా పెట్టడంతో పట్టణ ఎస్సై విజయశంకర్‌ అమలాపురంలో సంచరిస్తున్న ఆమెను గుర్తించి పట్టుకున్నారు.

ఆమెను విచారించగా నేరాన్ని అంగీకరించడంతో ఆమె నుంచి నగలు స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీరామ కోటేశ్వరరావుతో పాటు పట్టణ ఎస్సైలు విజయశంకర్, సురేంద్ర, క్రైం పార్టీ హెడ్‌ కానిస్టేబుల్‌ బత్తుల రామచంద్రరావులు విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. సీఐ శ్రీరామ కోటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు బస్సులు, ఆటోల్లో ప్రయాణిస్తున్నప్పుడు తమకు ఉన్న నగలను ధరించాలే తప్ప.. వాటిని చిన్న బ్యాగ్‌లు, పర్సులు, సంచల్లో దాచి వాటిని బట్టల బ్యాగ్‌లో పెట్టుకుని వెళ్లకూడదని సూచించారు. ఇలా బ్యాగ్‌లో నగలు, నగదు పెట్టుకుంటే ఇలాంటి చోరీలను చవి చూడాల్సి వస్తుందని వివరించారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top