హరేన్‌ను కాల్చి చంపింది అస్ఘరే.. 

key turning point of murder of former Gujarat Home Minister - Sakshi

పోటా కోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు 

జీవితఖైదు ఖరారు చేసిన అత్యున్నత న్యాయస్థానం 

గుజరాత్‌ మాజీ హోంమంత్రి హత్య కేసులో కీలకమలుపు  

ప్రస్తుతం నల్లగొండ జైలులో ఉన్న అస్ఘర్‌

సాక్షి, హైదరాబాద్‌: గుజరాత్‌ మాజీ హోంమంత్రి హరేన్‌ పాండ్య హత్య కేసు విచారణలో కీలకమలుపు చోటుచేసుకుంది. మహ్మద్‌ అస్ఘర్‌ అలీ హంతకుడని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ కేసుకు సంబంధించి 2011లో గుజరాత్‌ హైకోర్టు కొట్టివేసిన శిక్షల్ని అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. 2003 మార్చి 26న జరిగిన ఈ హత్యకేసులో అస్ఘర్‌ అలీతోపాటు మరో 11 మందికి అహ్మదాబాద్‌ పోటా కోర్టు విధించిన జీవితఖైదు శిక్షను సమర్థించింది. దీంతో పీడీ యాక్ట్‌ కింద నల్లగొండ జైల్లో ఉన్న అస్ఘర్‌అలీ గుజరాత్‌ జైలుకు వెళ్లడం తప్పనిసరైంది. హరేన్‌పాండ్యపై తుపాకీ ఎక్కుపెట్టి, కాల్చి చంపింది అస్ఘర్‌ అలీనే అని అప్పట్లో సీబీఐ నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్యకేసులోనూ అస్ఘర్‌ నిందితుడిగా ఉన్నాడు. నల్లగొండకు చెందిన మహ్మద్‌ అస్ఘర్‌ అలీకి జునైద్, అద్నాన్, ఛోటు అనే పేర్లు కూడా ఉన్నాయి. 1992 డిసెంబర్‌లో జరిగిన బాబ్రీమసీదు విధ్వంసం తర్వాత ఉగ్రవాద చర్యలపట్ల ఆకర్షితుడయ్యాడు. కశ్మీర్‌కు చెందిన ముస్లిం ముజాహిదీన్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడి ఉగ్రవాద శిక్షణాశిబిరాల్లో తుపాకులు కాల్చడం, ఆర్డీఎక్స్‌ బాంబులను పేల్చడంపై శిక్షణ తీసుకున్నాడు. తిరిగి వచ్చి నల్లగొండకు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ బారిసహా మరికొందరితో కలసి ముఠా ఏర్పాటు చేశాడు.  

హత్య కేసుల్లోని నిందితుడిని తప్పించి... 
బాబ్రీని కూల్చివేసిన ‘కర సేవకులు’అనే ఆరోపణలపై నగరంలో రెండు దారుణహత్యలు జరిగాయి. 1993 జనవరి 22న వీహెచ్‌పీ నేత పాపయ్యగౌడ్, అదే ఏడాది ఫిబ్రవరి 2న మాజీ కార్పొరేటర్, బీజేపీ నేత నందరాజ్‌ గౌడ్‌ హత్య కేసుల్లో మీర్జా ఫయాజ్‌ బేగ్‌ను కోర్టు దోషిగా తేల్చి జీవితఖైదు విధించింది. చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న అస్ఘర్‌ను మిగిలిన కేసుల విచారణ నిమిత్తం పోలీసులు తరచూ నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చేవారు. ఈ క్రమంలో అస్ఘర్, బారి తదితరులు 1996 డిసెంబర్‌ 19న నాంపల్లి న్యాయస్థానం నుంచి మీర్జా ఫయాజ్‌ను తప్పించారు. కశ్మీర్‌కు పంపించి ముస్లిమ్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులతో కలిసి పనిచేసేలా సంబంధాలు కల్పించాడు. జైలు నుంచి తప్పించుకున్న మీర్జా కొన్నిరోజులకే అక్కడ జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో భద్రతాదళాల చేతిలో హతమయ్యాడు.  

నాంపల్లి వద్ద పట్టుబడి... 
1997 ఫిబ్రవరిలో అస్ఘర్, బారి సహా పదిమంది నిందితుల్ని సిటీ పోలీసులు నాంపల్లి వద్ద పట్టుకున్నారు. ఆ సమయంలో వీరి వద్ద నుంచి 3 కిలోల ఆర్డీఎక్స్, 3 హ్యాండ్‌ గ్రనేడ్లు, రెండు పిస్టళ్లు, 40 రౌండ్ల తూటాలు స్వాదీనం చేసుకున్నారు. నగరంలో భారీ విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. కేసును విచారిస్తుండగా మీర్జా ఎస్కేప్‌లో అస్ఘర్‌ పాత్ర కీలకమనే విషయం వెలుగులోకి వచ్చింది. హరేన్‌పాండ్యను హత్య చేయడానికి పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు 2003లో కుట్ర పన్నాయి.

ఈ బాధ్యతల్ని గుజరాత్‌కు చెందిన లిక్కర్‌ డాన్, ఉగ్రవాది రసూల్‌ఖాన్‌ పాఠి ద్వారా అస్ఘర్‌కు అప్పగించాయి. 2003 మార్చి 26న హరేన్‌ తన ఇంటి సమీపంలో వాకింగ్‌ చేస్తుండగా కారులో వెళ్లిన అస్ఘర్‌ ఐదురౌండ్లు కాల్చడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సీబీఐ దర్యాప్తు చేపట్టి అదే ఏడాది ఏప్రిల్‌ 17న మేడ్చల్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో అస్ఘర్‌ తదితరులను పట్టు కుంది. సుదీర్ఘకాలం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్న వీరిపై విచారణ జరిపిన అహ్మదాబాద్‌లోని పోటా కోర్టు అస్ఘర్‌ తదితరులను దోషులుగా తేల్చింది. అస్ఘర్‌కు జీవితఖైదు విధించింది. 2011లో ఈ కేసు గుజరాత్‌ హైకోర్టు లో వీగిపోవడంతో వాళ్లు బయటపడ్డారు. హైకోర్టు తీర్పు ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు పోటా న్యాయస్థానం విధించిన శిక్షల్ని సమర్థిస్తూ  తీర్పు వెలువరించింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top