దీపక్‌ గ్యాంగ్‌ పనేనా!

Key Progress in the case of Rs 58 lakh above Robbery  - Sakshi

రూ.58.97 లక్షలు కొట్టేసిన కేసులో కీలక పురోగతి

తమిళనాడులోని రామ్‌జీనగర్‌ ముఠాగా నిర్ధారణ

పాత నేరస్తులతో సరిపోలిన అనుమానితుల ఫొటోలు

మీడియాకు విడుదల చేసిన పోలీసు అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పనామా గోడౌన్స్‌ వద్ద మంగళవారం పట్టపగలు రూ.58.97 లక్షలు ఎత్తుకుపోయింది తమిళనాడులోని రామ్‌జీనగర్‌కు చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. యాక్సిస్‌ బ్యాంక్‌కు చెందిన ఏటీఎం కేంద్రంలోని మిషన్లలో నగదు నింపడానికి వచ్చిన వాహనం సెక్యూరిటీ గార్డు దృష్టి మళ్లించిన ముఠా నగదు ఎత్తుకుపోయిన విషయం విదితమే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాచకొండ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

ఈ నేరం చేయడానికి ముందు దుండగులు సమీపంలోని ఓ ఇరానీ హోటల్‌లో టీ తాగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ ఆధారంగా గుర్తించారు. ఆ హోటల్‌కు వెళ్లిన పోలీసులు అనుమానితుల ఫొటోలు సేకరించారు. వీటిని ఇప్పటి వరకు ఈ తరహా దృష్టి మళ్లించి దోచుకుపోయే నేరాల్లో అరెస్టయిన పాత నిందితుల ఫొటోలతో పోల్చి చూశారు. ఈ నేపథ్యంలోనే ఇది రామ్‌జీనగర్‌కు చెందిన దీపక్‌ గ్యాంగ్‌ పనిగా తేలింది. ఈ ముఠాకు చెందిన అనేక మంది పాత నేరగాళ్ల ఫొటోలతో సీసీ కెమెరా ఫీడ్‌ నుంచి తీసినవి సరిపోలాయి. వీటిని పోలీసులు బుధవారం మీడియాకు విడుదల చేశారు.  

రూ.1,650 వెదజల్లి....  
మరోపక్క నగదు రవాణా వాహనం సెక్యూరిటీ గార్డు దృష్టి మళ్లించడానికి ఈ నేరగాళ్లు నగదు చల్లారు. ఆ వాహనం నుంచి కస్టోడియన్లు నగదు నింపడానికి వెళ్లిన ఏటీఎం కేంద్రం వరకు ఇలా చేశారు. ఈ మొత్తం రూ.1,650 అని లెక్కతేలింది. నేరగాళ్లు ఈ కరెన్సీ నోట్లతో పాటు కొంత మలేసియా కరెన్సీ కూడా కింద చల్లారు. దీన్ని బట్టి ఈ ముఠా ఇంతకు ముందు మరో నేరం చేసి ఆ డబ్బుతో మలేసియా వెళ్లి జల్సాలు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నా రు. కనీసం ఏడు నుంచి ఎనిమిది మంది ఈ నేరంలో పాలు పంచుకున్నట్లు భావిస్తున్నారు. వారం పాటు ఓ ప్రాంతంలో బస చేసి, పక్కా రెక్కీ అనంతరమే ఈ గ్యాంగ్‌ పంజా విసిరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం నిర్ధారించడానికి మూడు కమిషనరేట్లలో ఉన్న లాడ్జీలు, హోటళ్ల నుంచి రాచకొండ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
 
ప్రజా రవాణా వ్యవస్థను వాడుకుని....
నగరంలో సీసీ కెమెరాలు ఉన్నాయని తెలుసుకున్న నేరగాళ్లు తెలివిగా వ్యవహరించారు. రామ్‌జీనగర్‌ గ్యాంగ్‌ సొంత ద్విచక్ర వాహనాలు వాడుతుంది. ఈసారి మాత్రం ఘటనాస్థలి వరకు వేర్వేరు మార్గా ల్లో వచ్చిన నేరగాళ్లు నగదు ఉన్న ట్రంక్‌ పెట్టెను కొట్టేసిన తర్వాత ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించా రు. ఇలా చేస్తే తాము ప్రయాణించిన వాహనాన్ని గుర్తించే లోపు వీలైనంత దూరం వెళ్లిపోవచ్చనే ఉద్దేశంతోనే ఇలా చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. దృష్టి మళ్లించడం ద్వారా కాజేసిన డబ్బు  పెట్టెతో రోడ్డు దాటిన నేరగాళ్లు అక్కడ ఉన్న ఓ సెవెన్‌ సీటర్‌ ఆటో ఎక్కి ఎల్బీనగర్‌ వరకు వెళ్లారు. ఈ ప్రయాణం సాగుతున్నంత సేపు ఆటోడ్రైవర్‌తో ఏమీ మాట్లాడలేదు.

ఆ సమయంలో ఆటోలో మొత్తం ఐదుగురు ఉన్నట్లు సీసీ కెమెరాల ద్వారా తెలిసింది. వీరంతా ఒకే ముఠా వారని నిర్ధారించారు. ఎల్బీనగర్‌ లో ఆటో దిగి డ్రైవర్‌కు రూ.100 ఇచ్చి రూ.50 తిరిగి తీసుకున్నారు. అక్కడ నుంచి మరో ఆటో ఎక్కి దిల్‌సుఖ్‌నగర్‌ వరకు, అట్నుంచి వేరే ఆటోలో మలక్‌పేట వరకు వెళ్లినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వీళ్ల కోసం వేటాడుతూ పోలీసులు రామ్‌జీనగర్‌ వరకు వెళ్లినా ఈ ముఠా ఇంకా అక్కడకు చేరలేదని తెలిసింది. మరోపక్క వనస్థలిపురం పోలీసులు ఈ నేరం జరిగిన తీరును అధ్యయనం చేస్తూ బుధవారం క్రైమ్‌ సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. త్వరలోనే ముఠాను పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top