అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..

jewellery shop man lied to the police - Sakshi

చోరీ ఘటనను అనుకూలంగా మార్చుకోవాలనుకున్ననగల షాపు యజమాని

80 తులాల బంగారం, 20 కేజీల వెండి, రూ.90 వేలు చోరీకి   గురైనట్లు ఫిర్యాదు

గుమస్తాలను పోలీసులు  విచారించడంతో గుట్టురట్టు

చోరీ జరిగింది నిజమే.. ఆభరణాలు పోలేదు: పోలీసులు

సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ కోటిరెడ్డి,  అడిషనల్‌ ఎస్పీ గిరిధర్‌

మహబూబాబాద్‌ రూరల్‌ : దుకాణంలో దొంగలు పడిన ఘటనను ఓ యజమాని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాడు. తన షాపులో 80 తులాల బంగారం, 20 కేజీల వెండి, రూ.90 వేలు చోరీకి గురైనట్లు అప్పటికప్పుడు కథ అల్లి రక్తి కట్టించాడు. ఇప్పటికే వరుస దొంగతనాలతో గస్తీ ముమ్మరం చేసిన పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. బాధితుడి ఫిర్యాదు ప్రకారం ఇది భారీ చోరీ ఘటన కావడంతో ఏకంగా ఎస్పీ, అదనపు ఎస్పీలే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించడంతో చోరీ గుట్టు రట్టయ్యింది.

దొంగతనం జరిగింది నిజమే అయినప్పటికీ సొత్తు పోలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన బుధవారం సంచలనం సృష్టించింది. అదనపు ఎస్పీ కథనం గిరిధర్‌ ప్రకారం.. మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన సత్యమనోరమ బంగారు నగల దుకాణం యజమాని నారోజు సుభాష్‌చంద్రబోస్‌ నిత్యం ఇంటి నుంచి ఒక పెట్టెలో బంగారం, రెండు బ్యాగుల్లో వెండి నగలు, రెండు బ్యాగుల్లో పత్రాలు తెచ్చుకుని షాపులో వ్యాపారం నిర్వహిస్తుంటాడు.

రాత్రి ఇంటికి వెళ్లేటప్పుడు ఆ ఆభరణాలను తిరిగి తన వెంట తీసుకెళ్తాడు. మంగళవారం రాత్రి కూడా అలాగే తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం గుమస్తా వెంకటేశ్వర్లు 10.30 గంటలకు షాపు తెరిచేందుకు వచ్చి రిమోట్‌ సాయంతో షెట్టర్‌ తీసి లోపలికి వెళ్లగానే షాపులోని ఫర్నిచర్, ఇతర వస్తువులు, సామగ్రి చిందరవందరగా పడిఉన్నాయి. వెంటనే అతడు యజమాని సుభాష్‌చంద్రబోస్‌కు సమాచారమిచ్చాడు.

ఇదే అదునుగా భావించిన యజ మాని తన షాపులో పెద్దమొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించాడు. ఇందుకు సహకరించాలని వర్కర్లను కోరాడు. వర్కర్లు అనిల్‌ వద్ద 20 తులాలు, వెంకటేశ్వర్లు వద్ద 15 తులాల బంగారం ఉంటే ఇదే షాపులో భద్రపరిచినట్లు పోలీసులకు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేశాడు. అలాగే తన కౌంటర్‌లో ఉన్న మరో 45 తులాల బంగారం, 20 కిలోల వెండి, రూ. 90 వేల నగదు చోరీకి గురైనట్లు కథ అల్లాడు.

యజమాని ఫిర్యాదు ప్రకారం భారీ చోరీ కావడంతో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు నాలుగు పోలీస్‌ బృందాలు రంగంలోకి దిగాయి. వర్కర్లు నరేష్, అనిల్‌ను విడివిడిగా విచారించడంతో వాస్తవం బయటపడింది. మంగళవారం రాత్రి సుభాష్‌చంద్రబోస్‌ తన గుమాస్తా అనిల్‌తో కలిసి ఆభరణాలు ఇంటికి తీసుకెళ్లడం లక్ష్మీ, నరేష్‌ ప్రత్యక్షంగా చూసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చివరికి యజమాని కూడా నిజం ఒప్పుకుని తన షాపులో ఎలాంటి వస్తువులు పోలేదని చెప్పినట్లు ఏఎస్పీ గిరిధర్‌ వెల్లడించారు.

కాగా సంఘటన స్థలాన్ని ఎస్పీ కోటిరెడ్డి సందర్శిం చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణలో డీఎస్పీ ఆంగోత్‌ నరేష్‌కుమార్, టౌన్‌ సీఐ జబ్బార్, సీసీఎస్‌ సీఐ శ్రీనివాసులు, డీసీఆర్బీ సీఐ రమేష్‌కుమార్, ఐటీకోర్‌ సీఐ శ్యాంసుందర్, టౌన్, ట్రాఫిక్‌ ఎస్సైలు అరుణ్‌కుమార్, ఏఎస్సై వెంకటరమణ, పీసీ వేణుగోపాల్, అశోక్‌ పాల్గొన్నారు. 

నష్టాల నుంచి బయటపడేందుకే..   

మానుకోటలో వరుస దొంగతనాలు జరుగుతుం డడం, సోమవారం ఓ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకొని బంగారు నగలను రికవరీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన దుకా ణంలో చోరీ జరగడంతో అప్పటికే నగల వ్యాపారంలో నష్టపోయి, అప్పులపాలైన సుభాష్‌చంద్రబోస్‌ ఈ ఘటనను అనుకూలంగా మార్చుకోవా లని భావించినట్లు తెలిసింది. అందుకే భారీ చోరీ జరిగినట్లు కథ అల్లినప్పటికీ పోలీసులు తమదైన శైలిలో గుమాస్తాలను విచారించడంతో అసలు విషయం బయటపడింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top