జయరామ్‌ను హత్యచేస్తూ వీడియో!

Jayaram Murder Captured on Cell Phone Camera by Rakesh reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేసు విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్‌, కాల్‌ డేటా ఆధారంగా నిందితుడు రాకేష్‌ రెడ్డిలో మరో కోణం వెలుగులోకి వచ్చింది.  పక్కా పథకం ప్రకారమే జయరామ్‌ను హతమార్చినట్లు ఇప్పటికే నిర్థారణకు వచ్చిన పోలీసులు...అందుకు సంబంధించి ఓ వీడియోను స్వాధీనం చేసుకున్నారు. జయరామ్ హత్యకు ముందు ఖాళీ బాండ్‌ పేపర్ల మీద సంతకాలు చేయిస్తున్నప్పడు, హత్య చేస్తున్నప్పడు నిందితుడు తన సెల్‌ఫోన్‌తో వీడియో తీసినట‍్లు గుర్తించిన పోలీసులు... ఆ సమయంలో రౌడీ షీటర్‌ నగేష్‌, అతడి మేనల్లుడు విశాల్‌ కూడా ఘటనా స్థలంలోనే ఉన్నట్లు సమాచారం. కాగా ఏ పని చేసినా రాకేష్‌ రెడ్డికి వీడియో తీసే అలవాటు ఉండటంతో ...ఇప్పుడు ఆ వీడియోనే అతడి కష్టాలు తెచ్చిపెట్టింది.

మరోవైపు ఈ కేసులో నిందితుడు రాకేష్‌ రెడ్డికి పోలీస్‌ అధికారుల మధ్య సంబంధాలపై కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నం ఏపీసీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాస్‌కు ఇప్పటికే నోటీసులు అందాయి. వీరిని బంజారాహిల్స్‌ ఏసీపీ కార్యాలయంలో పోలీసులు విచారణ చేయనున్నారు. అలాగే ఈ  కేసులో అయిదుగురి ప్రమేయం ఉన్నట్లు ఓ నిర్థారణకు వచ్చిన పోలీసులు ఓ వైపు సంబంధించి అనుమానితులను విచారిస్తూనే మరోవైపు రాకేష్‌రెడ్డి కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన రోజు, ఆ తెల్లవారి, అంతకుముందు వారం రోజులు ఎవరెవరికి ఫోన్లు చేశారనే వివరాలను సేకరిస్తున్నారు.  హత్య ఘటన కంటే ముందు వారం రోజులు, ఆ తర్వాత రెండు రోజులు చేసిన మొత్తం 300 పైగా కాల్స్‌ వివరాలను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఎనిమిది రోజుల కస్టడీలో పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని, కేసులో పురోగతి కనిపిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top