నర్సు కాదు.. నరరూప రాక్షసి | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 12 2018 8:55 AM

Japan Nurse Killed 20 Patients with Poisoning - Sakshi

పెషెంట్ల బాగోగులు చూసుకోవాల్సిన నర్సు.. మృగంగా మారింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు... ఏకంగా 20 మంది ప్రాణాలను బలి తీసుకుంది. అయితే అందుకు  ఆమె చెబుతున్న సమాధానం వింటే ఎవరైనా షాక్‌కి గురికావాల్సిందే... జపాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...

టోక్యో: గతంలో నిందితురాలు ఆయూమీ కుబోకి(31) టోక్యో సబ్‌ అర్బన్‌లోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేసేది. ఆ సమయంలో(2016)లో ఓ వృద్ధుడు(88) మరణించటంతో.. అతని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో ఆయూమీనే అతనికి విషమిచ్చి చంపిందన్న విషయం తేలటంతో గత శనివారం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే విచారణలో ఆమె షాకింగ్‌ విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది.

సెలైన్‌ బాటిళ్లలో విషం(సబ్బు, కాస్మోటిక్‌లతో కలిపి తయారు చేసిన రసాయనం) ఎక్కించి 20 మందిని చంపినట్లు నిందితురాలు ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆయా మరణాలపై ఆరాలు తీయటం ప్రారంభించారు. అయితే వారందిరిపై తనకేం పగలేదని.. కేవలం పనిని తప్పించుకునేందుకు తాను అలా చేశానని ఆమె చెప్పటంతో పోలీసులు కంగుతిన్నారు. ‘పెషెంట్ల బాగోగులు చూసుకోవటం కష్టతరమైంది. రోజు అర్ధరాత్రి దాకా ఉండాల్సి వచ్చేది. ఒకవేళ వాళ్లు చనిపోతే ఆ బాధ్యతంతా నా నెత్తినే పడేది. శవ పరీక్ష.. బంధువులకు అప్పగింత.. అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చేంది. ఈ వ్యవహారం అంతా నాకు చిరాకు తెప్పించింది. అందుకే నా డ్యూటీ అయిపోయ్యాక వెళ్లేముందు వారి సెలైన్‌ బాటిళ్లకు విషమిచ్చేదాన్ని. ఇందుకోసం తీవ్ర అస్వస్థతో ఉన్న వృద్ధులనే టార్గెట్‌ చేసుకున్నా’ అని ఆయూమీ స్టేట్‌మెంట్‌ను స్థానిక మీడియా ప్రచురించింది.

అయితే ఈ వ్యవహారంపై స్పందించేందుకు ఆస్పత్రి యాజమాన్యం నిరాకరించింది. ఆమె 2016లోనే పని మానేసిందని, పోలీసు దర్యాప్తులో అసలు నిజాలు వెలుగుచూస్తాయని మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. ఇదిలా ఉంటే 2016లో ఆస్పత్రిలో మొత్తం 48 మంది పెషెంట్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 

Advertisement
Advertisement