అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

Interstate Thiefs Gang Arrest in West Godavari - Sakshi

రూ. 4 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం

జిల్లాలో 17 చోరీలలో నిందితులు

పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం అర్బన్‌:  తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురిని రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం  పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం మండలాల్లో గత ఏడాది కాలంగా దొంగతనాలు జరుగుతున్నాయి. బాధితుల ఇచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా ఎస్పీ, డీఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందంతో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తాడేపల్లిగూడెం – నల్లజర్ల మార్గంలో ప్రత్యేక బృందంతో వాహనాల తనిఖీ చేపట్టారు. అదే మార్గంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద బంగారు నగలు ఉన్నాయి. విచారణలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన నుగేష్‌ మణికంఠ, పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన జనపాల శ్రీనివాసుగా గుర్తించారు. పాత నేరస్తులని తేలడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం మండలాల్లో రెక్కి నిర్వహించి తాళాలు వేసి ఉన్న ధనికుల ఇళ్లను కొల్లగొట్టేవారు.

దొంగిలించిన బంగారు ఆభరాలను ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్న తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్యన్‌  శాంతమూర్తి ద్వారా బంగారు ఆభర దుకాణాలు నిర్వహించే వ్యాపారులు యోగ మురగన్‌  జ్యువెలరీ షాపు యజమాని యోగ మురుగన్‌ సింథిల్, న్యూ అంబిక జ్యువెలరీ షాపు దేసింగురాజ్‌ మనోజ్‌ కుమార్, నారాయణన్‌ జ్యువెలరీ షాపు దేవదాస్‌ నారాయణదాస్, జగన్‌ సిల్వర్‌ షాపు గురుస్వామి జగన్‌లకు విక్రయించేవారు. పైన తెలిపిన ముగ్గురు  నేరస్తులు, వ్యాపారులు ఒక ముఠాగా ఏర్పడి ఈ దొంగతనాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దొంగిలించిన ఆభరణాలను సుబ్రహ్మణ్యన్‌ శాంతమూర్తికి విజయవాడ రైల్వేస్టేషన్‌లో అందజేసేవారు. వీరికి అవసరమైన ఖర్చులకు బంగారు వ్యాపారస్తులు పెట్టుబడి పెడతారు. వీరి వద్ద నుంచి ఇంకా బంగారం, వెండి రికవరీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం వీరి వద్ద నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక మోటారు సైకిల్‌ను, చోరీకి ఉపయోగించే ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. త్వరలో మిగిలిన ముఠా సభ్యులను అరెస్టు చేస్తామని రూరల్‌ సీఐ పి శ్రీను తెలిపారు. నేరస్తులను పట్టుకునేందుకు ఎస్సై బాదం శ్రీనివాసు, భూపతి శ్రీను, దుర్గాప్రసాద్, హెడ్‌ కానిస్టేబుల్‌ పసుపులేటి శ్రీనివాసరావు, రాంబాబులను ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

స్నేహం ఏర్పడింది ఇలా..
చేబ్రోలుకు చెందిన జనపాల శ్రీనివాసు ఒక హత్యకేసుకు సంబంధించి శిక్ష పడింది. జైలులో శిక్ష అనుభవిస్తుండగా తణుకు పరిధిలో చోరీలకు పాల్పడుతూ పట్టుబడిన తమిళనాడుకు చెందిన నుగేష్‌ మణికంఠ, కార్తీక్‌ అనే వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. వీరు ముగ్గురూ తమిళనాడుకు చెందిన రామనాథపురం జిల్లాలోని బంగారు, వెండి ఆభరణ వ్యాపారులతో కలిసి చోరీలు ప్రారంభించారు.

జిల్లాలో 17 చోరీలు
2017 నుంచి ఉంగుటూరు మండలం రామచంద్రపురంలో ఒకటి, గొల్లగూడెం ఒకటి, ఉంగుటూరులో రెండు, నిడమర్రులో ఒకటి, తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం పెదతాడేపల్లిలో ఒకటి, వెంకట్రామన్నగూడెంలో రెండు, ఆరుళ్లలో ఒకటి, జగన్నాథపురంలో ఒకటి, పెంటపాడు మండలంలోని ప్రత్తిపాడులో ఒకటి, రావిపాడులో ఒకటి, ఆకుతీగపాడులో ఒకటి, జట్లపాలెం ఒకటి మొత్తం 17 చోరీలు చేసినట్టు  నేరస్తులు అంగీకరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top