పోలీసుల అదుపులో డ్రగుల్బాజీ | Sakshi
Sakshi News home page

డ్రగుల్బాజీ

Published Sat, Jun 20 2020 9:58 AM

Drugs Smuggling Gang held in West Godavari - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో డ్రగ్స్‌ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. నాలుగురోజుల క్రితం నెదర్లాండ్స్‌ నుంచి చెన్నై వచ్చిన పార్శిల్‌లో డ్రగ్స్‌ ఉన్నట్లు గుర్తించిన కస్టమ్స్‌ అధికారులు దానిపై ఉన్న చిరునామా ఆధారంగా భీమవరానికి చెందిన పి.భానుచంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 17న చెన్నైలో అరెస్టు చూపించారు.  దీంతో అసలు భానుచంద్రకు డ్రగ్స్‌ మాఫియాకు ఉన్న లింక్‌లు ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు.  బీటెక్‌ను మధ్యలోనే వదిలివేసినభానుచంద్ర చాలా కాలంగా ఈ డ్రగ్స్‌ వ్యవహారంలో ఉన్నట్లు ఆధారాలు లభ్యం అవుతున్నాయి. 

ఎలా పట్టుబడ్డాడు...
నెదర్లాండ్స్‌ నుంచి ఈ నెల 16న విమానంలో చెన్నైకి ఒక పార్శిల్‌ వచ్చింది. అందులో బొమ్మలు (టాయ్స్‌) ఉన్నట్లుగా ప్యాకింగ్‌పై ఉంది. నెదర్లాండ్స్‌ నుంచి భారతదేశానికి బొమ్మలు తెప్పించాల్సిన అవసరం ఏంటని అనుమానించిన కస్టమ్స్‌ అధికారులు దీన్ని తెరిచి పరిశీలించగా బొమ్మలలో 400కి పైగా పిల్స్‌ ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ఎండీఎంఏ (మెథిలియా డ్యాక్సీ మెతంపెటామైన్‌) అనే డ్రగ్స్‌ ఉన్నట్లు గుర్తించారు. వీటిని మత్తుతో పాటు లైంగిక సామర్థ్యం పెరగడానికి వాడతారని సమాచారం. గతంలో కూడా భానుచంద్ర పదిసార్లు ఈ డ్రగ్స్‌ను ఇండియాకి తెప్పించినట్లుగా గుర్తించారు.

డార్క్‌ నెట్‌ ద్వారా...
భానుచంద్ర డార్క్‌నెట్‌ ద్వారా ఈ డ్రగ్స్‌ను బుక్‌చేసి తెప్పిస్తున్నట్లు గుర్తించారు. ఐదు వందల డాలర్లను ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించి దీన్ని తెప్పించాడు. వీటి ధర ఇండియన్‌ మార్కెట్‌లో రూ.12 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. టెర్రరిస్ట్‌లు, డ్రగ్‌మాఫియా మాత్రమే ఉపయోగించే డార్క్‌నెట్‌తో భానుచంద్రకు సంబంధాలు ఎలా ఉన్నాయి? అతని వెనుక ఎవరు ఉన్నారు? అనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. 

రంగంలోకి పోలీసులు
జిల్లా పోలీసు యంత్రాంగం దీనిపై రంగంలోకి దిగింది. భీమవరంతోపాటు పరిసర ప్రాంతాలు నరసాపురం ప్రాంతాలలో డ్రగ్స్‌ను రహస్యంగా సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. భీమవరం పరిసర ప్రాంతాలలో సంపన్న వర్గాలకు ఈ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. డ్రగ్స్‌ సరఫరా విషయంలో రాజకీయ నేతలు ఎవరైనా ఉన్నారా? ఇంకా డ్రగ్స్‌ ముఠాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాలపై దృష్టి పెట్టారు. భీమవరం ప్రాంతాల్లో డ్రగ్స్‌తో పాటు గంజాయి అమ్మకాలు జరిపే వారి పాత్ర ఈ వ్యవహారంలో ఎంత ఉందనే అంశంపై దృష్టి పెట్టారు. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపితే జిల్లాలో బిగ్‌షాట్స్‌ బయటకు వచ్చే అవకాశం ఉంది. 

Advertisement
Advertisement