అట్టపెట్టెలో అరవైఐదు లక్షలు!

Interest money Mafia was Caught by Railway Police - Sakshi

     వడ్డీ సొమ్మును గుట్టుగా తరలిస్తున్న మాఫియా 

     హైదరాబాద్‌ కేంద్రంగా కోట్లలో దందా

     ముంబై తరలిస్తుండగా పట్టుకున్న రైల్వే పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: అది హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌ సాయంత్రం 4 కావస్తోంది. ముంబై వెళ్లేందుకు నలుగురు వ్యక్తులు ప్లాట్‌ఫాంపై కొన్ని అట్టపెట్టెలతో నిలుచుని ఉన్నారు. పది నుంచి ఇరవై బాక్సులను రైల్లో ఎక్కించేందుకు సిద్ధపడుతుండగా రైల్వే పోలీసులు వచ్చి వాటిల్లో రెండు బాక్సులను తెరచి చూశారు. అట్టపెట్టెల్లో పైన ఎల్‌ఈడీ బల్బులు వాటి కింద నోట్ల కట్టల్ని చూసి షాక్‌ అయ్యారు. తర్వాత అన్ని బాక్సుల్లో ఉన్న రూ.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. జనరల్‌ రైల్వే పోలీసు విభాగం ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌ వెంటనే రంగంలోకి దిగారు. 

హవాలా కాదు..: ఈ నెల 5న వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై రైల్వే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ముందు హవా లా డబ్బుగా భావించినా విచారణలో ఆసక్తికరమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన పలు ఫైనాన్స్‌ సంస్థలు హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో జీరో దందా చేస్తున్న వ్యాపారులకు ఏటా రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు అప్పులిచ్చాయి. వీటికి సంబంధించి ప్రతి నెలా చెల్లించాల్సిన వడ్డీ డబ్బులను ఈ విధంగా  పంపిస్తున్నారు. ముంబైకి చెందిన 4 ప్రధాన ఫైనాన్స్‌ కంపెనీలు బేగంబజార్‌ నుంచి వడ్డీ సొమ్మును రెండున్నరేళ్లుగా ఇదే రీతిలో తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలింది. ఎలాంటి సందేహం రాకుండా ఉండేందుకు వడ్డీ వ్యాపార మాఫియా ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నట్లు బయటపడింది. వడ్డీకిచ్చిన సొమ్ముకు లీగల్‌గా లెక్కాపత్రం లేకపోవడంతో తిరిగి వసూలు చేసుకునే వ్యవహారాన్నీ చీకటి మార్గం లోనే చలామణీ చేస్తున్నట్లు గుర్తించారు. 

ఆంధ్రా పార్శిల్స్‌ కేంద్రంగా.. 
పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బాలపై ఉస్మాన్‌గంజ్‌లోని ఆంధ్రా పార్శిల్స్‌ సర్వీసెస్‌కు చెందిన ప్యాకింగులుండటం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు అరెస్ట్‌ చేసిన నలుగురు ఏజెన్సీ వ్యక్తులు బిహార్‌కు చెందిన వారు కావడం, వీరంతా ఆంధ్రా పార్శిల్స్‌ సర్వీస్‌లో పనిచేస్తుండటం వడ్డీ మాఫియా వ్యవహారంలో కీలకంగా మారింది. ఆంధ్రా పార్శిల్స్‌ పేరుతో హవాలా సొమ్ము రవాణా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రా పార్శిల్స్‌ మేనేజర్‌ లాల్జీ పరారీలో ఉండటంతో కేసులో అతడే కీలక సూత్రధారి అని భావిస్తున్నారు.

అతడు నేరుగా వెళ్లకుండా వడ్డీ డబ్బులను ఈ రకంగా ముంబై ఫైనాన్స్‌ కంపెనీలకు చేరవేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌ నుంచే కాకుండా ఆంధ్రా పార్శిల్స్‌ పేరుతో దేశవ్యాప్తంగా ఇంకా ఎన్ని ప్రాంతాల నుంచి ఇలాంటి దందా సాగుతుందో విచారణలో తెలుసుకుంటామని, లాల్జీ కోసం తమ బృందాలు వెతుకుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ముంబైకి చెందిన ఫైనాన్షియర్లు, బేగంబజార్‌కు చెందిన వ్యాపారుల జాబితా కూడా తేలాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top