గుట్కాకు అడ్డాగా..

Illegal Tobacco Selling In East Godavari - Sakshi

కాకినాడలో రూ.50 లక్షల సరుకు స్వాధీనం

గుట్కా అమ్మకాలకే కాదు.. దాని తయారీకి కూడా జిల్లా అడ్డాగా మారుతోంది. జిల్లా కేంద్రమైన కాకినాడతోపాటు.. వాణిజ్య కేంద్రమైన రాజమహేంద్రవరం నగరాలు ఈ అక్రమ దందాకు కేంద్రాలుగా నిలుస్తున్నాయి. మన జిల్లాతోపాటు, రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు ఈ దందాలో ప్రధాన భాగస్వాములుగా నిలుస్తున్నారు. ఈ గుట్టును జిల్లా, రాజమహేంద్రవరం అర్బన్‌ పోలీసులు శనివారం ఛేదించారు.

కాకినాడ రూరల్‌ : గుట్కా అమ్మకాలతోపాటు దాని తయారీకి కూడా కాకినాడ నగరం నిలయంగా మారుతోంది. తూరంగి పంచాయతీ పరిధి కాకినాడ – యానాం రోడ్డులోని ఓ ప్రైవేటు గోడౌన్‌పై ఇంద్రపాలెం పోలీసులు, ఆహార అధికారులు శనివారం చేసిన దాడి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ దాడుల్లో గుట్కా తయారీకి సిద్ధంగా ఉంచిన రూ.50 లక్షలకు పైగా విలువైన ముడిసరుకు, తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ పోర్టు పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జి సీఐ రాజశేఖర్, ఇంద్రపాలెం ఎస్సై డి.రామారావుల కథనం ప్రకారం.. గోడౌన్‌లో గుట్కా తయారీకి అవసరమైన ముడి సరుకు, దానిని పొడిగా మార్చేందుకు అవసరమైన యంత్రాలు ఉన్నాయి. అక్కడ ముడిసరుకు తయారు చేసి, ధవళేశ్వరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాజవోలు గ్రామంలోని మరో గుట్కా తయారీ కేంద్రానికి తరలిస్తారు. అక్కడ గుట్కా ప్యాకెట్లు తయారు చేస్తున్నారు.

రాజవోలు గుట్కా కేంద్రానికి సంబంధించి తొమ్మిది మంది అనుమానితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని, వారి ద్వారా వచ్చిన సమాచారంపై తూరంగిలోని గోడౌన్‌పై దాడి చేశారు. అయితే ఈ దాడిలో ఎవ్వరూ పట్టుబడలేదని, ముందుగానే సమాచారం తెలుసుకొని పరారైనట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. గుట్కా తయారీకి అవసరమైన ముడి సరుకు ఎక్కడి నుంచి వస్తోందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి, సంబంధిత వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని రాజశేఖర్, రామారావు చెప్పారు. ఈ దాడిలో జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి వై.పాండురంగారావు, ఇంద్రపాలెం ఏఎస్సై మురళీకృష్ణ, కానిస్టేబుళ్లు రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top