ఈ–సిగరెట్స్‌పై నిఘా | Hyderabad Police Target on E Cigarette Users | Sakshi
Sakshi News home page

ఈ–సిగరెట్స్‌పై నిఘా

Sep 26 2019 9:22 AM | Updated on Sep 27 2019 1:42 PM

Hyderabad Police Target on E Cigarette Users - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ సిగరెట్ల వాడకం, దిగుమతి, అమ్మకం తదితరాలను నిషేధిస్తూ కేంద్రం గత వారం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. వీటిని వినియోగిస్తున్న వారిలో 70 శాతం యువతే ఉండటం, వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిని తక్షణం అమలులోకి తీసుకువస్తూ నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిఘా, దాడులు ముమ్మరం చేశారు. ఫలితంగా పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం ఇద్దరిని అరెస్ట్‌ చేసి వారి నుంచి 250 ఈ–సిగరెట్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. ఆర్డినెన్స్‌ జారీ చేసిన కేంద్రం అందులోని సెక్షన్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఇంకా వెలువరించలేదు. దీంతో పోలీసులు ప్రస్తుతానికి సీఓటీపీ చట్టం కిందే ఈ–సిగరెట్ల కేసులను నమోదు చేస్తున్నారు. తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్‌ షోయబ్, మొఘల్‌పుర వాసి మహ్మద్‌ మాజ్‌ చార్మినార్‌ సమీపంలోని షెరిటన్‌ మార్కెట్‌లో లక్కీ కలెక్షన్స్, మాజ్‌ కలెక్షన్స్‌ పేరుతో వేర్వేరు దుకాణాలు నిర్వహిస్తున్నారు. వివిధ వస్తువుల విక్రయం ముసుగులో ఈ ద్వయం కేంద్రం నిషేధించిన ఈ–సిగరెట్లనూ హోల్‌సేల్‌గా, రిటైల్‌గా అమ్మేస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎల్‌.భాస్కర్‌రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్‌ ముజఫర్‌ అలీలతో కూడిన బృందాలు దాడి చేశాయి.

షోయబ్, మాజ్‌లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 250 ఈ–సిగరెట్‌ మిషన్లు, అందులో వాడే ఫ్లేవర్స్‌ బాటిల్స్‌ 56 స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వాటినీ మీర్‌చౌక్‌ పోలీసులకు అప్పగించారు. ఈ–సిగరెట్లను నిషేధించిన కేంద్రం వాటిని వినియోగించడం, విక్రయించడం, కలిగి ఉండటం, రవాణా చేయడాన్ని తీవ్రమైన నేరాలుగా పరిగణించింది. ఈ నేరాలు చేసిన వారికి జైలు, భారీ జరిమానాలు విధిస్తామని పేర్కొంది. అయితే ఆర్డినెన్స్‌ ఇచ్చినప్పటికీ ఆ నిషేధ చట్టంలోని సెక్షన్లు, శిక్షలను వివరిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. దీంతో పోలీసులు ప్రస్తుతానికి సిగరెట్స్‌ అండ్‌ అదర్‌ టుబాకో ప్రొడక్టŠస్‌ (సీఓటీపీ) చట్టం కింద కేసు నమోదు చేస్తున్నారు. ఇది అత్యంత సాధారణ కేసు రావడంతో నిందితులకే అదే రోజు పోలీసుస్టేషన్‌లోనే బెయిల్‌ లభిస్తోంది. కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసి, అది అధికారికంగా  పోలీçసు విభాగానికి అందితే ఈ–సిగరెట్స్‌ కేసుల్లో నిందితుల్ని రిమాండ్‌ చేయడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇకపై నగరంలో ఈ–సిగరెట్లపై నిఘా కొనసాగుతుందని, చిక్కిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. వ్యాపారులు, వ్యక్తులు... ఇలా ఎవరి వద్దనైనా ఈ–సిగరెట్లు ఉంటే తక్షణం వాటిని స్థానిక పోలీసుస్టేషన్లలో అప్పగించాలని పోలీసులు సూచిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement