దారి తప్పిన బాల్యమిత్రులు 

Hyderabad Police Arrest Cell Phone Thieves - Sakshi

ఈజీమనీ కోసం సెల్‌ఫోన్‌ చోరీలు 

నిర్మానుష్య ప్రాంతాల్లో  పాదచారులే టార్గెట్‌ 

టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన నిందితులు

సాక్షి, సిటీబ్యూరో : జల్సాలకు అలవాటుపడి ఈజీమనీ కోసం నేరాలబాట పట్టిన బాల్యమిత్రులను సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌ రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.అసిఫ్‌నగర్‌కు చెందిన మహమ్మద్‌ ఒమర్‌ ఫరూక్, మెహదీపట్నం మురద్‌నగర్‌కు చెందిన యాసీర్‌ ఆలీఖాన్‌ చిన్ననాటి నుంచి మిత్రులు. ఇంటర్మీడియట్‌లో ఫెయిల్‌ అయిన వీరు గంజాయి, తదితర చెడు అలవాట్లకు బానిసలై వచ్చిన ఆదాయం చాలకపోవడంతో నేరాలబాట పట్టారు.

ఈజీమనీ కోసం సెల్‌ఫోన్‌ దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఉదయం వేళల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో వాకింగ్‌ చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడేవారు. నేరం చేయాలనుకునే ప్రాంతంలో ముందుగానే షార్ట్‌కట్‌ మార్గాలు, ఏ మార్గంలో వెళితే తప్పించుకోవచ్చనే విషయాలపై రెక్కీ నిర్వహిస్తారు.  బైక్‌పై వచ్చి సెల్‌ఫోన్‌ లాక్కుని మాయమయ్యేవారు. ఇదే తరహాలో సైఫాబాద్‌ ఠాణా పరిధిలోని లకిడీకాపూల్‌లోని నిజామ్‌ క్లబ్‌ అవుట్‌ గేట్‌ వద్ద ఈ నెల 22న ఉదయం సెల్‌ఫోన్‌ మాట్లాడుకుంటూ వెళుతున్న వ్యక్తి నుంచి ఫోన్‌ లాక్కుని పరారయ్యారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా  ఫుటేజీ ఆధారంగా నిందితులు ఒమర్‌ ఫరూక్, యాసీర్‌ ఆలీఖాన్‌లుగా గుర్తించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం అర్ధరాత్రి వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి బైక్, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ కోసం సైఫాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top