నాది ముంబై.. చికెన్‌ బిర్యానీ కావాలి! | Hyderabad: cyber crime accused demand biryani | Sakshi
Sakshi News home page

మన్సూర్‌తో పోలీసుల ‘కష్ట’డీ!

Nov 2 2017 11:18 AM | Updated on Nov 2 2017 11:29 AM

Hyderabad: cyber crime accused demand biryani - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముంబైకి చెందిన మన్సూర్‌ షేక్‌ అమెరికాలో ఉంటూ అక్కడ హైదరాబాద్‌కు చెందిన యువతిని వేధించాడు... దీంతో బాధితురాలు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇండియాకు డిపోర్ట్‌ అయ్యాడు... ముంబై కేంద్రంగా ఆమె కుటుంబీకులకూ నరకం చూపడం ప్రారంభించాడు.. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అతడిని అరెస్టు చేశారు... న్యాయస్థానం అనుమతితో బుధవారం కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీసులకు ‘కష్టాలు’ మొదలయ్యాయి... భోజనంతో పాటు ఇతర అంశాల్లో మన్సూర్‌ కోరికలు చూసిన అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

ముంబైకి చెందిన మన్సూర్‌ షేక్‌ కొన్నేళ్ళుగా అమెరికాలో ట్రాన్స్‌పోర్టు కంపెనీ నిర్వహిస్తున్నాడు. నగరంలోని నాంపల్లికి చెందిన ఓ యువతి విద్యాభ్యాసం నిమిత్తం కొన్నేళ్ళ క్రితం అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తోంది. ఆమెతో మన్సూర్‌కు పరిచయం ఏర్పడటంతో ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. వ్యసనపరుడైన మన్సూర్‌కు పలువురు యువతులతో సంబంధాలు ఉన్నట్లు తెలుసుకున్న ఆమె అతడిని దూరంగా ఉంచింది. అయినా తన పంథా మార్చుకోని మన్సూర్‌ పెళ్లి పేరుతో ఆమెను వేధించడం మొదలెట్టాడు. వేధింపులు తారా స్థాయికి చేరడంతో బాధితురాలు అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు పూర్వాపరాలు పరిశీలించిన అక్కడి అధికారులు మన్సూర్‌ను డిపోర్టేషన్‌ (బలవంతంగా తిప్పిపంపడం) ద్వారా ముంబైకి పంపించారు. అయినా తన వైఖరి మార్చుకోని అతను ఎలాగైనా అమెరికాలో ఉన్న ఆ యువతినే వివాహం చేసుకోవాలని భావించాడు. హైదరాబాద్‌లో ఉంటున్న యువతి కుటుంబీకులను సంప్రదించి పెళ్లి విషయం మాట్లాడాడు. తమ కుమార్తెకు అభ్యంతరం లేకపోతే తమకు అభ్యంతరం లేదన్నారు. ఈ విషయాన్ని వారు అమెరికాలో ఉన్న యువతికి చెప్పగా.. ఆమె వివాహానికి ససేమిరా అందింది. దీంతో ఆమె కుటుంబీకులు మన్సూర్‌తో ఈ విషయం అక్కడితో వదిలేయాలని సూచించారు. దీంతో కక్షకట్టిన మన్సూర్‌ అమెరికాలోనే ఉంటున్న యువతి సోదరి,  లండన్‌లో ఉంటున్న మరో సోదరిలతో మాట్లాడాడు. వీరికి సంబంధించిన కొన్ని ఫొటోలను బయటపెట్టి సంసారాలు పాడు చేస్తానంటూ బెదిరించాడు.

‘మీ కుమార్తె నాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఉన్నాయి. వాటిని సోషల్‌మీడియాలో పెడతా’ అంటూ ఆమె కుటుంబసభ్యులను బెదిరిస్తున్నాడు. వారి ఫిర్యాదుతో సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మన్సూర్‌ను అరెస్టు చేసి సిటీకి తీసుకువచ్చి కోర్టు ద్వారా రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. సాధారణ నిందితులకు ఇస్తున్న మాదిరిగానే పప్పు భోజనం పెట్టాలనే ఉద్దేశంతో పోలీసులు వాటినే తెప్పించారు. అయితే తనది ముంబై అంటూ ఘీంకరిస్తున్న మన్సూర్‌ తాను పప్పు అన్నం తిననని, చికెన్‌ బిర్యానీ, మటన్‌ బిర్యానీ, కోడిగుడ్లు కావాలంటూ డిమాండ్‌ చేస్తున్నా డు. ఇతడి నుంచి వివరాలు సేకరించడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement