ప్రాణం తీసిన ఆస్తి

husbend dead in assets Dispute - Sakshi

ఇల్లు విషయంలో భర్తను హతమార్చిన భార్య

తలపై ఇనుప రాడ్‌తో మోదిన వైనం

కొరసవాడలో సంఘటన

శ్రీకాకుళం, పాతపట్నం: ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంలో భర్త మృతి చెందాడు. భార్య చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ సంఘటన పాతపట్నం మండలంలో కొరసవాడ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలావున్నాయి. కొరసవాడ గ్రామంలో కర్ణం వీధిలో పూర్ణచంద్ర పాణిగ్రహీ(52), కుంతల పాణిగ్రహీ అలియాస్‌ సుహాసిని దంపతులు కొన్నేళ్లగా నివాసం ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య ఆస్తి విషయంలో తగాదా రావడంతో ఆదివారం అర్ధరాత్రి సమయంలో భర్తపై భార్య క్షణికావేశంలో ఇనుప రాడ్‌తో దాడి చేసింది. భర్త పూర్ణచంద్ర పాణిగ్రహీ తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే అతడు మృతి చెందాడు. పూర్ణచంద్ర పాణిగ్రహీకి సంబంధించి నలుగురు అన్నదమ్ములు. ఇందులో ఇద్దరు ఇప్పటికే మృతి చెందారు.  పూర్ణచంద్ర పాణిగ్రహీ, మరొ అన్నయ్య గ్రామంలోనే వేర్వేరుగా నివసిస్తున్నారు. ప్రస్తుతం పూర్ణచంద్ర పాణిగ్రహీ కుటుంబం ఉంటున్న ఇల్లు అన్నదమ్ముల మధ్య తగాదాలో ఉంది.

ఈ ఇంటికి సంబంధించి పూర్ణచంద్ర పాణిగ్రహీ భార్యాభర్తల మధ్య గత రెండేళ్లగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇల్లు తన పేరున రాయమని కుంతల పాణిగ్రహీ గొడవ చేస్తుండేది. ఇదే విషయంపై గతంలో కూడా స్థానిక పోలీసు స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో ఒకే ఇంట్లో భార్య, భర్తలు వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. పూర్ణచంద్ర పాణిగ్రహీ ఒక్కడే రోజూ వంట చేసుకొని పనులకు వెళ్లేవాడు. సారకంద తేవడానికి బరంపురం ఆదివారం వెళతానని తోటివారికి చెప్పి వెళ్లాడు. సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. అయితే ఎప్పటిలాగే ఆదివారం రాత్రి కూడా ఇంట్లో రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో భార్య సుహాసిని క్షణికావేశంలో ఇంట్లోని గ్యాస్‌ స్టౌ పక్కనే ఉన్న ఇనుప రాడ్‌ను తీసుకుని భర్త తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే అతడు మృతి చెందాడు. ఆ సమయంలో ఇంట్లో కుమార్తె మాధురి పాణిగ్రహీ ఉంది. వెంటనే సుహాసిని తన తల్లి కుమారి పండాకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది.

పక్క గ్రామం కాగువాడలో ఉన్న తల్లి, తమ్ముడు జగదీష్‌ పండా కొరసవాడ చేరుకొని కుంతల పాణిగ్రహీ ఇంటికి వచ్చారు. ఇంట్లో ఉన్న పూర్ణచంద్ర మృతదేహాన్ని చూసి ప్రైవేటు అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి తెప్పించారు. దానిలో పూర్ణచంద్రను ఎక్కించుకొని గ్రామంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు చెప్పడంతో చేసేదిలేక తిరిగి ఇంటికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు మృతదేహంపై కిరోసిన్‌పోసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు సుహాసిని ప్రయత్నించింది. అయితే అప్పటికే ఇరుగుపొరుగు వారికి విషయం తెలియడంతో అందరూ చేరుకోవడంతో ఆ ప్రయత్నం విఫలమయింది. ఇంట్లో రక్తపు మరకలు ఉండడంతో వాటిని కడిగేందుకు ప్రయత్నించింది.

అయితే గోడలకు కూడా రక్తపు మరకలు ఉండడంతో చేసేదిలేక మిన్నకుండిపోయింది. సోమవారం ఉదయం గ్రామస్తులు ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. సంఘన స్థలానికి సీఐ బి.ఎస్‌.ఎస్‌.ప్రకాష్, ఎస్‌ఐ ఎం.హరికృష్ణ చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. ఇరుగుపొరుగు వారిని, గ్రామస్తులను అడిగి వివరాలు తీలుసుకున్నారు. మృతుడు భార్య సుహాసినిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని అంబులైన్స్‌లో పాతపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి పంచనామా చేసి, పోర్టుమార్టం చేశారు. అనంతరం మృతదేహాన్ని మృతుడు అన్న బృందావన్‌ పాణిగ్రహాకి అందజేశారు. మృతుడు అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పాతపట్నం సీఐ తెలిపారు. పూర్ణచంద్ర పాణిగ్రహీ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు అందరితో కలిసిమెలిసి ఉండేవాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top