ఆన్‌లైన్‌ చాటింగ్‌తో మోసం

Husband Wife Cheating Software Employee In Online Chatting - Sakshi

భాగ్యనగర్‌కాలనీ: మింగిల్‌ ఆన్‌లైన్‌ ద్వారా చాటింగ్‌ చేస్తూ ఓ వ్యక్తిని లోబర్చుకుని డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్న భార్యభర్తలపై కేసు నమోదైన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సిఐ కుషాల్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్న కె.రమాకాంత్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.  మింగిల్‌ ఆన్‌లైన్‌ వెబ్‌ సైట్‌ ద్వారా కవిత అలియాస్‌ స్వాతితో పరిచయం ఏర్పడింది. దీంతో రోజూ చాటింగ్‌ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. అయితే కవిత అలియాస్‌ స్వాతి తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, నాలుగు లక్షల రూపాయలు అవసరముందని రమాకాంత్‌ను వేడుకుంది. దీంతో రమాకాంత్‌ తన వద్ద అంత డబ్బు లేదని ఈ నెల 9వ తేదీన 5 వేల రూపాయలు నెట్‌ బ్యాంకింగ్‌  ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేశాడు.

తిరిగి మళ్లీ అడగడంతో 14వ తేదీన మరో 10 వేల రూపాయలను ట్రాన్స్‌ఫర్‌ చేయగా ఇంతటితో ఆగకుండా అతని వద్ద నుంచి ఎలాగైనా డబ్బులు లాగాలని పథకం వేసిన భార్యభర్తలు సతీష్, స్వాతి చాటింగ్‌లో లక్ష రూపాయలు కావాలని మరోసారి అతనిని వేడుకున్నారు. దీంతో తాను ఇవ్వలేనంటూ తేల్చి చెప్పడంతో ఆన్‌లైన్‌ మెసేజ్‌ల ద్వారా అతడిని ప్రేమలోకి దించేందుకు ప్రయత్నించింది.  ఈ క్రమంలోనే సెల్‌ ఫోన్‌ ద్వారా ఒకరికొకరు మెసేజ్‌లు పంపుకున్నారు. ఇంతటితో ఆగకుండా స్వాతి బాండ్‌ పేపర్‌లు తీసుకుని మీ ఇంటికి వస్తానని లక్ష రూపాయలు అప్పుగా ఇవ్వాలని కోరింది. దీంతో అతడు నిరాకరించాడు. అయితే స్వాతి తన భర్తతో డబ్బులు ఇవ్వాలని రమాకాంత్‌తో ఫోన్‌లో మాట్లాడించింది. దీంతో రమాకాంత్‌ తాను ఇవ్వలేనని చెప్పడంతో చాటింగ్‌ ద్వారా మరింత ఒత్తిడి తీసుకువచ్చింది.  సెల్‌ఫోన్‌లో వారు ఇద్దరు మాట్లాడుకున్న మెసేజ్‌లను భర్త సతీష్‌ రమాకాంత్‌ ఇంటికి వెళ్లి తనకు డబ్బులు ఇవ్వాలని లేదంటే మెసేజ్‌లు బయటపెడితే ఇబ్బందికరంగా ఉంటుందని బెదిరించటమే కాకుండా 10 లక్షల రూపాయలు డిమాండ్‌ చేశాడు. దీంతో వారి నుంచి వేధింపులు తాళలేక రమాకాంత్‌ కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top