భార్యను కిరాతకంగా హతమార్చిన భర్త 

Husband Assassinate His Wife In Guntur District - Sakshi

సాక్షి, రేపల్లె: అనుమానం పెనుభూతంగా మారి కట్టుకున్న భార్యనే అతి కిరాతకంగా కడతేర్చాడో భర్త.. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి చనిపోయిందని తెలియని కుమార్తెలు రక్తసిక్తమైన ఆమె గుండెలను హత్తుకుని పడుకున్నారు.. అమ్మ బతికే ఉందని భావించారు. పోలీసుల అలికిడితో నిద్ర లేచారు. ఉలుకుపలుకూ లేకుండా పడి ఉన్న అమ్మకు ఏమైందో తెలియదు... నాన్న ఎక్కడికి వెళ్లాడో తెలియని ఆయోమయ పరిస్థితుల్లో చిన్నారులు దీనంగా వచ్చిపోయేవారి వంక చూస్తున్న తీరు హృదయ విదారకంగా మారింది. రేపల్లె పట్టణంలోని 13వ వార్డు ఉప్పూడి రోడ్డులో శనివారం తెల్లవారుజామున ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉప్పుటూరి వీరేంద్ర, సౌజన్య భార్యాభర్తలు. అద్దె ఇంటిలో కాపురం ఉంటున్నారు. వారికి భవ్యశ్రీ, జన్సిక అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వీరేంద్ర తెనాలిలోని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసున్నాడు. (మిగిలిన టెన్త్‌ పరీక్షలు రద్దు.. సీఎం‌ కీలక నిర్ణయం)

భార్య సౌజన్య(30)కు వేరేవారితో వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తూ తరచూ గొడవ పెట్టుకుంటుండేవాడు. అనుమానం పెనుభూతంగా మారింది. ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం పిల్లలు నిద్రపోయిన అనంతరం భార్యను కత్తితో నరికి చంపాడు. అనంతరం పురుగులు మందు తాగి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, 13వ వార్డులోని ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నట్లు పట్టణ సీఐ ఎస్‌.సాంబశివరావు తెలిపారు. వీరేంద్ర పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాపట్ల డీఎస్సీ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ విజయశ్రీ ఘటన స్థలానికి చేరకుని కేసు పూర్వాపరాలను తెలుసుకున్నారు. బంధువులను వివరాలు అడిగితెలుసుకున్నారు.  

పెళ్ళైన నాటి నుంచి చిత్రహింసలు  
పట్టణంలోని రామశాస్త్రి కల్యాణ మండపం వద్ద నివాసం ఉంటున్న సౌజన్య తల్లిదండ్రులు పమిడిమళ్ల శ్రీరామమూర్తి, కనకమహాలక్ష్మి, బంధువులు చిన్నారులను దగ్గరకు తీసుకుని ఘటన స్థలం వద్ద విలపిస్తున్న తీరు వర్ణనాతీతం. పెళ్లైన నాటి నుంచి తమ బిడ్డను చిత్రహింసలకు గురిచేస్తూనే ఉన్నాడని వారు ఆరోపించారు. వీరేంద్ర  ఏ పాఠశాలలో పట్టుమని నెలరోజులు కూడా పని చేయకుండా తరచూ తన కూతురిని బాధపెడుతుండే వాడని తెలిపారు. సొంతూరు చీరాల నుంచి సంవత్సరం క్రితం రేపల్లె వచ్చి ఉంటున్నాడని, ఇద్దరు ఆడపిల్లలు కావడంతో అవసరం అన్నప్పుడల్లా డబ్బులు ఇచ్చే వారమని చెప్పారు. అనుమానంతో తమ బిడ్డను కిరాతకంగా చంపాడని విలపిస్తున్నారు.
చదవండి: గ్రేటర్‌లో మళ్లీ కరోనా అలజడి..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top