విధి ఆడిన వింత నాటకంలో..

Hit And Run Accused Died In That Pattern In Florida - Sakshi

ఫ్లోరిడా : విధి బలీయమైనదని కొందరు నమ్ముతారు.. మరికొందరు కొట్టిపారేస్తారు. అయితే డగ్లస్‌ పార్క్‌హర్స్ట్‌(68) అనే వ్యక్తి మృతిచెందడం ఎన్నో అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఐదు దశాబ్దాల కిందట చేసిన పాపమే ఇప్పుడు అతడి పాలిట మృత్యువైందని బాధితురాలి కుటుంబంతో పాటు నెటిజన్లు అంటున్నారు.

ఆ వివరాల్లోకెళ్తే... గత శుక్రవారం అమెరికా ఫ్లోరిడాలోని శాన్‌ఫోర్డ్‌లో జరిగిన కారు ప్రమాదం (హిట్‌ అండ్‌ రన్ కేసు‌)లో డగ్లస్‌ అనే వృద్ధుడు మృతిచెందాడు. తాగిన మైకంలో ఉన్న కరోల్‌ షారో(51) బేస్‌బాల్‌ పార్కు స్టేడియంలో వాహనాన్ని నడిపి ఈ ప్రమాదానికి కారణమయ్యారని పోలీసులు తెలిపారు. హిట్‌ అండ్‌ రన్‌లో గాయపడ్డ డగ్లస్‌ను హాస్పిటల్‌కు తరలిస్తుండగా చనిపోయాడు. 50 ఏళ్ల కిందట డగ్లస్‌ కారు కింద పడి ఓ చిన్నారి చనిపోయినట్లుగానే ఇప్పుడు అతడు ప్రాణాలు వదలడం గమనార్హం.

అసలేమైందంటే..
1968లో వియత్నానికి చెందిన డగ్లస్‌ పార్క్‌హర్స్ట్‌(18) తాగిన మైకంలో కారును నడిపాడు. ఈ క్రమంలో చిన్నారి కరోలీ(4) మృతికి కారణమయ్యాడు. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో తన సోదరి చనిపోయిందని కరోలీ అక్క ఫిర్యాదు చేశారు. అక్కతో కలిసి చిన్నారి కరోలీ రోడ్డు దాటుతుండగా నిందితుడు డగ్లస్‌ తాగిన మైకంలో వాహనాన్ని నడపంతో కారు పాపను ఢీకొట్టింది. దీంతో కరోలీ 40 అడుగుల దూరంలో పడిపోయి తీవ్రరక్తస్రావమై చనిపోయింది. కేసు విచారణలో.. తనకు ఏ పాపం తెలియదని, ఏదో వస్తువును ఢీకొట్టిన మాట వాస్తవమేనన్నాడు డగ్లస్‌. కానీ ఏ చిన్నారి కూడా తనకు రోడ్డుపై కనిపించలేదని చెప్పడంతో నిర్దోషిగా బటయకొచ్చాడు. 

2013లో మరోసారి కరోలీ సోదరి కేసును రీఓపెన్‌ చేయించారు. ఈసారి నిజం బట్టబయలైంది. కొన్ని సాక్ష్యాధారాలు, పరిస్థితుల కారణంగా నిందితుడు డగ్లస్‌ తన తప్పును అంగీకరించాడు. కానీ అప్పటికే నేరం జరిగి చాలాకాలం (45 ఏళ్లు) అయిపోయిందని.. ఇప్పుడు నిందితుడికి శిక్ష వేయలేమని కోర్టు తీర్పిచ్చింది.

50 ఏళ్లకు న్యాయం
ఐదు దశాబ్దాల తర్వాతనైనా దేవుడు న్యాయం జరిగేలా చూశాడని కరోలీ కేసును విచారణ చేసిన పోలీసు అధికారి (రిటైర్డ్‌) రస్‌ జాన్సన్‌ అన్నారు. అందుకే చివరికి కరోల్‌ అనే పేరున్న యువతి కారణంగానే, అదేతీరుగా హిట్‌ అండ్‌ రన్‌ ప్రమాదంలో నిందితుడు డగ్లస్‌ చనిపోయాడని చెప్పారు. నెటిజన్లు సైతం ఈ విషయంపై పోస్టులు చేస్తున్నాడు.

నా చెల్లికి జరిగినట్లే : తన చెల్లెలు కరోలీ మృతికి కారణమైన వ్యక్తి డగ్లస్‌ పార్క్‌హర్స్ట్‌(68) కూడా అదే తీరుగా చనిపోయాడని డార్లీన్‌ అన్నారు. ఇప్పుడు ఓ వలయం పూర్తయింది. ఇక ఈ విషయాన్ని వదిలేయాలని అభిప్రాయపడ్డారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top