గుట్టుగా గుట్కా దందా

gutka mafia in guntur and krishna - Sakshi

 తయారీ, మార్కెటింగ్‌ కృష్ణా, గుంటూరు నుంచే..

నెలకు రూ.15 కోట్లమేర లావాదేవీలు

కృష్ణా, గుంటూరు జిల్లాలు కేంద్రంగా గుట్కా దందా గుట్టుగా సాగిపోతోంది. తయారీ నుంచి మార్కెటింగ్‌ వరకూ ఇక్కడి నుంచే యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు స్పందించడంలేదు. అప్పుడప్పుడు వ్యాపారులపై దాడులు చేయడం మినహా, తయారీ కేంద్రాలపై దృష్టి సారించడంలేదు.  

సాక్షి, అమరావతిబ్యూరో: ‘నా పేరు ముఖేష్‌ నేను ఒకే సంవత్సరం గుట్కా నమిలాను. ఇప్పుడు నా నోటి క్యాన్సర్‌కు ఆపరేషన్‌ జరుగుతోంది. బహుశా ఇక నేను మాట్లాడలేకపోవచ్చు’.. ‘దురదృష్టంకొద్దీ ముఖేష్‌ను కాపాడలేకపోయాం. అతని వయసు 24 ఏళ్లే..’ అంటూ సినిమా థియేటర్లలో ప్రదర్శనకు ముందు, ఇంటర్వెల్‌ తరువాత వచ్చే ఒక ప్రచార చిత్రంలోని మాటలు ఇవీ... గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల వచ్చే క్యాన్సర్‌ వ్యాధిపై  అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఈ ప్రచార చిత్రంలో ముఖేష్‌ పరిస్థితి చూసినవారి మనసు కకావికలమవుతుంది. అయితే ప్రభుత్వ యంత్రాం గాన్ని మాత్రం ఆ చిత్రం కదిలించలేకపోతోంది.

అంతా పక్కాగా..
నిషేధిత గుట్కా రాకెట్‌కు రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు అడ్డాగా మారాయి. తయారీ నుంచి మార్కెటింగ్‌ వరకు అంతా పక్కాగా సాగిపోతోంది. నెలకు రూ.15 కోట్ల మేర వ్యాపారం యథేచ్ఛగా జరుగుతున్నా అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవడమే లేదు. ఎందుకంటే ఈ గుట్కా రాకెట్‌కు సూత్రధారులూ టీడీపీ ప్రజాప్రతినిధుల సన్నిహితులు, పాత్రధారులు అనుచరులే కాబట్టి.

అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండ
రాజధాని గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా పెద్ద ఎత్తున గుట్కాను తయారు చేస్తున్నారు. గుంటూరు, విజయవాడలోని టీడీపీ ప్రజాప్రతినిధుల ముఖ్య అనుచరులే ఈ రాకెట్‌ను నిర్వహిస్తున్నారు. విజయవాడలో అనైతికంగా టీడీపీలో కొనసాగుతున్న ఓ ప్రజాప్రతినిధి ఈ రాకెట్‌కు కొమ్ముకాస్తున్నారు. ఆయన వర్గీయులే విజయవాడ, గుంటూరులోని ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు.

పట్టున్న గ్రామాల్లో యూనిట్లు
గుంటూరు జిల్లాలోని కొందరు టీడీపీ నేతలతో కలసి గుట్కా యూనిట్లు నెలకొల్పారు. టీడీపీకి ఏకపక్షంగా బలమైన గ్రామాల్లో యూని ట్లను ఏర్పాటు చేశారని నిఘావర్గాలకు గుర్తిం చాయి. స్థానికంగా లభించే పొగాకు, బెంగళూరు నుంచి పౌడర్, రసాయనాలు తెప్పిస్తున్నారు. ఒడిశా, జార్ఖండ్‌ నుంచి పనివారిని రప్పిస్తూ మరీ గుట్టుచప్పుడు కాకుండా గుట్కా తయారు చేస్తున్నారు. భారీస్థాయిలో తయారు చేస్తున్న గుట్కా ప్యాకెట్లను గుంటూరు, విజయవాడతోపాటు రాయలసీమ, ఉభయగోదావరి జిల్లాల్లో మార్కెటింగ్‌ చేస్తున్నారు. అందుకు విజయవాడ వన్‌టౌన్, గుడివాడ, గుంటూరు జిల్లా చిలకలూరిపేట, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తదితర కేంద్రాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాజధాని గ్రామాల్లో యూనిట్లలో తయారు చేసిన గుట్కా ప్యాకెట్లను ఆ కేంద్రాలకు రవాణా చేస్తున్నారు. అక్కడ నుంచి చిల్లర వర్తకులకు విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో చిలకలూరిపేట, గన్నవరం తదితర చోట్ల అధికారులు దాడులు చేసి పెద్ద సంఖ్యలో గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

నెలకు రూ.15కోట్ల అక్రమ వ్యాపారం
ఏదో గుట్కా వ్యాపారమే కదా అని తేలిగ్గా తీసేయకండి. ఎందుకంటే రాజధాని గ్రామాల కేంద్రంగా నెలకు రూ.15 కోట్ల వ్యాపారం సాగుతోంది. ఒక్కో ప్యాకెట్‌ను రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే రోజుకు లక్ష ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. అంటే రోజుకు రూ.10లక్షల వ్యాపారం సాగుతోంది. ఇక్కడ నుంచి ఇతర జిల్లాలకు రోజుకు రూ.40 లక్షల వరకు గుట్కా ప్యాకెట్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు. అంటే రోజుకు రూ.50 లక్షల టర్నోవర్‌. ఆ లెక్కన నెలకు రూ.15 కోట్ల వరకు గుట్కా అక్రమ వ్యాపారం అడ్డూఅదుపు లేకుండా సాగిపోతోంది.

అధికార యంత్రాంగం ఉదాసీనం
రాజధాని కేంద్రంగా వ్యవస్థీకృతమైన గుట్కా రాకెట్‌పై అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. అప్పుడప్పుడు గుట్కా అక్రమంగా నిల్వ చేసిన చిరువ్యాపారులపై దాడులు నిర్వహిస్తున్నారు. అయితే సిండికేట్‌ మీద ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. రాజధాని గ్రామాల్లోనే గుట్కా యూనిట్లు ఉన్నాయని తెలిసినప్పటికీ దాడలు చేయనేలేదు. ప్రధానంగా విజయవాడ వన్‌టౌన్, గుంటూరులోని గుట్కా సిండికేట్‌ మీద దాడులకు అధికారులు వెనుకాడుతున్నారు. ఈ సిండికేట్‌కు విజయవాడలోని వివాదాస్పద టీడీపీ ప్రజాప్రతినిధి అండదండలు కూడా ఉండటమే అధికారుల ఉదాసీనతకు కారణమని సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top