జడ్జి, ఐఏఎస్‌ అంటూ 'టెక్కి'టమారా విద్యలు! | Gurgaon police Arrested the Tekki fraud | Sakshi
Sakshi News home page

'టెక్కి'టమారా విద్యలు!

Sep 26 2018 1:30 AM | Updated on Sep 27 2018 2:31 PM

Gurgaon police Arrested the Tekki fraud - Sakshi

పోలీసుల అదుపులో నిందితుడు కేదార్‌నాథ్‌ సాగర్‌ శర్మ

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ సమీపంలోని గుర్గావ్‌లో సీనియర్‌ సివిల్‌ జడ్జీ అవతారం ఎత్తి దాదాపు 40 మందికి రూ.2 కోట్ల వరకు టోకరా వేశాడో టెక్కీ. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన నిందితుడు హైదరాబాద్‌ వారాసిగూడలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన కేదార్‌నాథ్‌ సాగర్‌ శర్మగా అక్కడి పోలీసులు గుర్తించారు. ఓ పక్క జడ్జీగా, మరోపక్క సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిగా చెప్పుకుంటూ ఇతడు మోసాలు చేసినట్లు గుర్గావ్‌ పోలీసులు చెబుతున్నారు. శర్మ అరెస్టు విషయం తెలుసుకున్న ఇక్కడి పోలీసులు ఇక్కడా ఎవరినైనా మోసం చేశాడా.. అన్నది లోతుగా ఆరా తీస్తున్నారు. దాదాపు ఐదేళ్ల క్రితం బీటెక్‌ పూర్తి చేసిన కేదార్‌నాథ్‌ నగరంలోని ఓ ప్రముఖ ఐటీ ఫర్మ్‌లో సూపర్‌వైజర్‌గా చేరాడు. నెలకు రూ.13 లక్షల జీతం వచ్చే ఈ ఉద్యోగాన్ని, తన కుటుంబాన్ని 2012లో వదిలేశాడు. ఆ తర్వాత నగరంలోనే అనేక ఉద్యోగాలు చేసినా ఎక్కడా నిలదొక్కుకోలేకపోయాడు. 2016లో సిటీలో కేదార్‌నాథ్‌ ఆన్‌లైన్‌ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం ఏడాది క్రితం గుర్గావ్‌ వెళ్లి అక్కడి సెక్టార్‌ 102లో ఉన్న హెరిటేజ్‌ మ్యాక్స్‌ సొసైటీలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో మళ్లీ వారాసిగూడకు వచ్చేసినా... అప్పుడప్పుడు గుర్గావ్‌ వెళ్లి వస్తుండేవాడు.  

జడ్జీగా, ఐఏఎస్‌గా అవతారం.. 
దాదాపు ఆరు నెలల క్రితం అక్కడే ఓ సెకండ్‌ హ్యాండ్‌ బీఎండబ్ల్యూ కారు ఖరీదు చేసిన శర్మ హఠాత్తుగా బోగస్‌ జడ్జీ అవతారమెత్తాడు. తన వాహనంపై ‘సీనియర్‌ సివిల్‌ జడ్జీ’అని రాయించుకోవడంతో పాటు ఆ హోదాతో కొన్ని స్టాంపులు, గుర్తింపు కార్డు తయారు చేయించుకున్నాడు. ఉద్యోగాలు, కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లు, ఇళ్లు ఇప్పిస్తానంటూ మోసాలు చేస్తూ అందినకాడికి దండుకోవడం మొదలుపెట్టాడు. తాను తెలంగాణలో సీనియర్‌ సివిల్‌ జడ్జీనని, ప్రస్తుతం సెలవులో ఉన్నానని, త్వరలో డిప్యూటేషన్‌పై గుర్గావ్‌ కోర్టుకు వచ్చానంటూ నమ్మబలికాడు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిగా మరో గుర్తింపు కార్డు తయారు చేసుకున్న శర్మ అలా కూడా చెలామణి అయ్యాడు. ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇళ్లను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశాడు. ఎయిమ్స్‌లో నాలుగో తరగతి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మరి కొంతమంది నుంచి వసూళ్లకు పాల్పడ్డాడు. కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లు ఇప్పిస్తానంటూ ఒక్కో సీటుకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు దండుకున్నాడు. ఇలా కొద్ది రోజుల్లోనే ఢిల్లీ, గుర్గావ్‌కు చెందిన 40 మంది నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేశాడు. ఢిల్లీకి చెందిన విడాకులు తీసుకున్న ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశాడు.

వ్యాపారి ఫిర్యాదుతో చెక్‌
హద్దూఅదుపూ లేకుండా సాగుతున్న కేదార్‌నాథ్‌ వ్యవహారానికి ఓ కారు స్పేర్‌పార్ట్స్‌ వ్యాపారి ఫిర్యాదుతో చెక్‌ పడింది. జూన్‌ 9న తన కారు మరమ్మతుల కోసం కేదార్‌నాథ్‌ గుర్గావ్‌ సెక్టార్‌ 51లో మర మ్మతు, స్పేర్‌పార్ట్స్‌ దుకాణం నిర్వహించే గగన్‌ భాత్రా వద్దకు వెళ్లాడు. ఆ వాహనంపై ఉన్న ‘జడ్జీ’ స్టిక్కర్‌ను చూసిన భాత్రా నిజమని నమ్మాడు. మాటల్లో ప్రభుత్వం రూ.4 లక్షలకు విక్రయించే ఇంటిని రూ.2 లక్షలకు ఇప్పిస్తానంటూ చెప్పాడు. ఈ మాటలు నమ్మిన గగన్‌ ఆ మొత్తం ఇచ్చాడు. అనంతరం కేదార్‌నాథ్‌ కనిపించకుండా పోయాడు. దీంతో అతని కారు నంబర్‌ (డీఎల్‌12సీ4707) ఆధారంగా గగన్‌ గుర్గావ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో మోసాల చిట్టా బయటపడింది. ప్రస్తుతం పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో అక్కడి పీడబ్ల్యూడీ గెస్ట్‌హౌస్‌కు తన కారులో వెళ్లిన కేదార్‌నాథ్‌ జడ్జీగా చెప్పుకుని ఉచితంగా 14 రోజులు ఉండి రాచమర్యాదలు పొందినట్లు గుర్తించారు. జనాన్ని మోసం చేసి వసూలు చేసిన డబ్బుతో ఇటీవలే థాయ్‌లాండ్‌ టూర్‌కు వెళ్లివచ్చినట్లు తేలింది. ఇతడి చేతిలో మోసపోయిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారని గుర్గావ్‌ ఏసీపీ షంషేర్‌ సింగ్‌ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement