ప్రమాదమా..? ఆత్మహత్యాయత్నమా..?

Gas Stove Explosion In Karimnagar - Sakshi

సిరిసిల్లక్రైం: సిరిసిల్ల పట్టణంలోని ఒకటోవార్డు చంద్రంపేటకు చెందిన భీమనపల్లి భూలక్ష్మి, ఆమె కూతురుభాగ్యకు ఆదివారం మధ్యాహ్నం కాలిన గాయాలు అయ్యాయి. గ్యాస్‌స్టౌ పేలడంతో ప్రమాదం జరిగినట్లు ఎస్సై నరేశ్‌ కేసు నమోదు చేశారు. అయితే ప్రమాదం కాదని.. మానసిక వేదనతో నిప్పంటించుకుందని, తన కూతురు రక్షించబోగా గాయపడిందని భూలక్ష్మి భర్త భీమనపల్లి అంజయ్య ‘సాక్షి’తో తన అవేదన వ్యక్తం చేశాడు. 80శాతం కాలిన గాయాలున్న భూలక్ష్మిని హుటా హుటిన హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించానని, కూతురు సిరిసిల్ల ఆసుప్రతిలో చికిత్స పొందుతోందని వివరించాడు.
 
భూ తగాదాలతోనేనా..? 
అంజయ వివరాల ప్రకారం.. గత నెల 27న సిరిసిల్లలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద కోళ్లపురం నర్సయ్య, మ్యాన రాజేశం, అబ్బగోని శ్రీనివాస్, భీమనపల్లి అంజయ్యకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో కోళ్లపురం నర్సయ్యను మ్యాన రాజేశం కులంపేరుతో దూషించాడు. దీంతో మ్యాన రాజేశం, అబ్బగోని శ్రీనివాస్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. సాక్షిగా భీమనపల్లి అంజయ్య ఉన్నాడని తెలిసిన మ్యాన రాజేశం కక్ష పెంచుకున్నాడు. తన భార్యపై అత్యాచారానికి యత్నించినట్లు అంజయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం భూలక్ష్మికి తెలిసి మనస్తాపంతో కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు ఆర్పడానికి యత్నించిన కూతురు భాగ్యలక్ష్మికి సైతం గా యాలు అయ్యాయి.

భూ లక్ష్మిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తలించారు. పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం జిల్లా పోలీసులు వాగ్మూలం తీసుకోవడానికి హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ జడ్జి సమక్షంలో వివరాలు సేకరించారు. వాగ్మూలాన్ని షీల్డ్‌ కవర్‌లో పంపిస్తామని జడ్జి చెప్పినట్లు ఎస్సై నరేశ్‌ పేర్కొన్నారు. ‘చంద్రంపేటలో జరిగిన ఘటనపై బాధిత మహిళ కూతురు భాగ్య ఇచ్చిన ఫిర్యాదుతోనే కేసు నమోదు చేశాం. గ్యాస్‌స్టౌ అంటించే క్రమంలో ప్రమాదం జరిగినట్లు వాళ్ల కొడుకు సైతం  చెప్పాడు.’ అంటూ ఎస్సై నరేశ్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top